వెండితెరపై లవకుశ చిత్రం

వాల్మీకి రామాయణంలో అత్యంత ప్రధానమైన రసవత్తర ఘట్టం లవకుశుల కథ. లవకుశులు సీతారాముల కవల పుత్రులు. వీరిద్దరిలో కుశుడే పెద్దవాడు. వీరు వాల్మీకి ఆశ్రమంలో పుట్టి అక్కడే పెరుగుతారు. ఇతను తమ్ముడు లవుడితో కలిసి రామాయణ కథను గానం చేస్తాడు. కుశుడు దక్షిణ కోసల దేశంలోని కుశావతి నగరానికి రాజవుతాడు. కుశావతి నగరం వింధ్యపర్వత సమీపంలో ఉంటుంది. వాల్మీకి కుశముష్టి (ఇదొక మొక్క వేరు) పై భాగాన్ని మంత్రించి భూతాలను నాశనం చెయ్యడం వల్ల లవుడు అనే పేరు వచ్చింది. రాముడు ఇతనికి శ్రావస్తి అనే నగరాన్ని ఏర్పాటు చేస్తాడు. ఇతనిని ఉత్తర కోసలకు రాజును చేస్తాడు. లవకుశుల విషయాన్ని ఇక్కడికి విడిచిపెట్టి వెండితెరపైకి వచ్చిన లవకుశుల చరిత్రను చూద్దాం.

ప్రజల మాటకు విలువ ఇచ్చి రాముడు సీతను పరిత్యజించగా ఆమె వాల్మీకి ఆశ్రమంలో కుశలవులకు జన్మ ఇస్తుంది. వారిద్దరూ పెరిగిన అనంతరం యాగాశ్వాన్ని బంధించి రాముడితో తలపడటం కథాంశం. భారతీయ చలన చిత్ర రంగంలో ఈ సినిమా వివిధ భాషల్లో నిర్మించారు. ఈ చిత్రం ఎప్పుడు వచ్చినా ప్రతీ భారతీయుడిని ఆకట్టుకుంటుంది అనడంలో సందేహం లేదు. మొట్టమొదటిసారిగా లవకుశ సినిమా మూకీ సినిమాగా 1919 లో ఆర్ నటరాజ మొదలియార్ తీసారు. మరో పదిహేనేళ్ళ తర్వాత 1934 లో సౌందర రాజన్ తమిళంలో ఈ చిత్రాన్ని తీసారు. అదే ఏడాది అంటే 1934 లో తెలుగులోనూ లవకుశ చిత్రం విడుదల అయ్యింది. అది టాకీ సినిమా. తెలుగు కన్నా ముందు దేవకీ బోస్ బెంగాలీలోనూ, హిందీలోనూ ఈ చిత్రాన్ని సీత టైటిల్ తో తీసారు. బెంగాలీ సినిమాలో పృధ్వీరాజ్ కపూర్ శ్రీరాముడిగా నటించారు. ఈ సినిమాని ఈస్ట్ ఇండియా ఫిలిం కంపెనీ బ్యానర్ పై నిర్మించారు. సి పుల్లయ్య స్టేజ్ నాటకంగా రాసిన దానిని ఆధారం చేసుకుని ఈ సినిమా తీసారు. అనంతరం తెలుగులో ఈ సినిమాను ఈస్ట్ ఇండియా ఫిలిం కంపెనీ సి పుల్లయ్య దర్శకత్వంలో తీసింది. రెండింటికీ స్క్రిప్ట్ ఒక్కటే. అలాగే బెంగాలీ, హిందీ చిత్రాలకు వాడిన రథాలు, ఇతర సెట్ మెటీరియల్ ను తెలుగులోనూ ఉపయోగించారు. అలనాటి ప్రముఖ కవి బలిజేపల్లి లక్ష్మీకాంతం సాహిత్యం అందించగా ప్రభల సత్యనారాయణ సంగీతం సమకూర్చారు. శ్రీరాముడిగా పారుపల్లి సుబ్బారావు, సీతగా సీనియర్ శ్రీరంజని నటించారు. లవకుశులుగా భీమారావు, మల్లికార్జున రావులు నటించారు. ఈమని వెంకటరామయ్య లక్ష్మణుడి పాత్రలో నటించారు. భారతుడిగా కె నాగుమణి, శత్రుఘ్నుడిగా చారి, వశిష్టుడిగా మద్దూరి బుచ్చయ్య శాస్త్రి, రజకుడిగా సి హెచ్ బీ వెంకటాచలం, రజకుడి భార్యగా పద్మబాల, వాల్మీకిగా పారుపల్లి సత్యనారాయణ, ఊర్మిళగా సీతాదేవి నటించారు. ఈ చిత్రం విడుదల అయినప్పుడు గ్రామాలనుంచి ఎడ్ల బండి పై పట్టణాలకు వెళ్లి సినిమా చూసేరట. విజయవాడలోని దుర్గా కళా మందిర్ లో మొదటి వారంలో దాదాపు 26 వేల మంది ఈ సినిమా చూసారట. అప్పట్లో కొన్ని థియేటర్ లలో దాదాపు ఏడాది పాటు ఈ సినిమా ఆడటం విశేషం.

ఈ సినిమాతోనే తెలుగులో పాటల పుస్తకం అమ్మడం ప్రారంభమైనట్టు చెప్పుకునే వారు.

సీతగా నటించిన శ్రీరంజని సినిమా హాల్స్ కు వెళ్ళినప్పుడు ఆమెను అభిమానులు దేవతగా ఆరాధించారు. కొబ్బరికాయలు కొట్టారు. హారతి పట్టారు.

ఇక 1963 లో సి పుల్లయ్య దర్శకత్వంలో రంగులలో వచ్చిన లవకుశ చిత్రాన్ని శంకర రెడ్డి నిర్మించారు. దర్శకత్వంలో పుల్లయ్య గారికి ఆయన కుమారుడు సి ఎస్ రావు కూడా సహకరించారు. ఈ సినిమాలో ఎన్ టీ రామారావు రాముడిగా, అంజలీదేవి సీతగా నటించారు. ఈ చిత్రంలో లవుడిగా మాస్టర్ నాగరాజు (స్టేజ్, సినీ నటుడు ఏ వీ సుబ్బారావు కుమారుడు), కుశుడిగా సుబ్రహ్మణ్యం (వీ సుబ్బారావు కుమారుడు) నటించారు. రజకుడిగా రేలంగి వెంకట రామయ్య, రజకుడి భార్యగా గిరిజ నటించారు. ఈ బ్లాక్ బస్టర్ మూవీ గత ఏడాది యాభై ఏళ్ళు పూర్తి చేసుకున్న సంగతి తెలిసిందే కదా? సముద్రాల రాఘవా చార్య సాహిత్యం అందించారు. ఈ చిత్రాన్ని అనంతరం తమిళం, కన్నడం, హిందీ భాషల్లో అనువదించారు.

తెలుగులోలవకుశలో పాటలు, పద్యాలు సముద్రాల సీనియర్, కొసరాజు రాఘవయ్య, వెంపటి సదాశివబ్రహ్మం రాసారు. జిక్కి కృష్ణవేణి, జె వీ రాఘవులు, కె రాణి, మాధవపెద్ది సత్యం, పీ బీ శ్రీనివాస్, పీ లీల, ఘంటసాల వెంకటేశ్వర రావు, పీ సుశీల ఆలపించారు. ఈ చిత్రంలో మొత్తం 37 పాటలు, పద్యాలు ఉన్నాయి. 26 కేంద్రాలలో ఈ చిత్రాన్ని విడుదల చేసారు. ఈ అన్ని కేంద్రాలలోను వంద రోజులు ఆడటం విశేషం. 16 కేంద్రాలలో 175 రోజులు ఆడింది. జాతీయ స్థాయిలో అత్యుత్తమ చిత్రంగా అవార్డు అందుకుంది. చక్కని నటన కోసం ఎన్టీఆర్ కు, టీ ఎల్ కాంత రావులకు రాష్ట్రపతి అవార్డులు దక్కాయి.

ఇలా ఉండగా 1978 లో గుజరాతీలో నరేంద్ర మిస్త్రీ లవకుశ సినిమా తీసారు. ఇక 2010లో లవకుశను యానిమేషన్ చిత్రంగా ధవళ సత్యం హిందీలో తీసారు.

– యామిజాల జగదీశ్

Send a Comment

Your email address will not be published.