వ్యాసపూర్ణిమ

vyasapoornimaవేదవ్యాసుడు! వేదాలను విభజించిన వాడు. కనుకే వేదవ్యాసుడైనట్టు చెప్తారు. కానీ వ్యాసుడు అనేది ప్రత్యేకించి ఒకరి పెరుకాదు. ప్రతి ద్వాపరంలోనూ వేదం విభజన చేసిన వాళ్లకు ఈ బిరుదు వచ్చిందని చెప్పుకోవచ్చు.
విష్ణుపురాణం ప్రకారం ఈ వైవసవత మన్వంతరంలో గడచిన ఇరవై ఎనిమిది ద్వాపరాలలో ఇరవై ఎనిమిది మంది ఋషులు వేదవ్యాసుడు అనే బిరుదు పొందినట్టు ఉంది.

వసిష్ఠ పౌత్రుడు పరాశరుడు. ఆ పరాశరుడు దాశరాజు కన్య సత్యవతిని ఇష్టపడతాడు. వీరికి కృష్ణద్వైపాయనుడు అనే కొడుకు పుట్టాడు. అతనే వ్యాసుడు. ఈ వ్యాసుడే సత్యవతి ఆజ్ఞ మేరకు అంబిక, అంబాలికలకు పుత్రదానం చేసాడు. ధృతరాష్ట్ర, పాండురాజులు పుట్టారు. అంబిక దాసికి ఇతని వల్ల విదురుడు పుట్టాడు.

ఆదిలో వేదాలు ఒకే మొత్తంగా ఉండేవి. అయితే వాటిని వ్యాసుడు విభజించి వర్గీకరించాడు. వ్యాసుడి శిష్యులు పైలుడు, వైశంపాయనుడు.

సూర్య సావర్ణి మనువు కాలంలో వ్యాసుడు సప్త రుషులలో ఒకడయ్యాడు.

ఇదలా ఉంచితే మనం జరుపుకునే పండగలలో ఒకటి గురువుకోసం మన పూర్వీకులు కేటాయించారు. ఆ పండగే గురుపూర్ణిమ. ఆషాఢ మాసంలో వచ్చే పూర్ణిమ రోజున వ్యాసపూర్ణిమగా జరుపుకుంటాం.

ఆరోజునే చాతుర్మాస్య వ్రతం ఆరంభమవుతుంది. అది వర్షాకాలం కావడంతో సన్యాసులు ఈ నాలుగు నెలలూ ఒకే చోట ఉండాలని, దీక్ష పూనాలని ఆ కాలపు నియమం. సన్యాసులు కాలి నడకన యాత్ర చేసేటప్పుడు పురుగులు వంటివి వారి పాదాల కింద నలిగి చనిపోయే ప్రమాదం ఉంది. అలాంటి జీవహింస జరగకుండా ఉండటానికి ఈ నియమం పాటించడం మొదలు పెట్టారు. ఈ నాలుగు నెలలూ నాలుగు పక్షాలుగా చేసుకుని వారు ఒకే ఊళ్ళో ఉండటం జరుగుతోంది.

అయితే గురుపూర్ణిమ రోజున వేదాంత సూత్రాలు రాసిన వ్యాస భగవానుడిని పూజిస్తారు. మన దేశంలో ఈ పూజను ఎక్కువగా సాదువులే చేస్తూ వస్తున్నారు.

కృష్ణుడు ఆచార్యుడిగా గీతను ఉపదేశించాడు. అతను పదో అధ్యాయంలోని 37 వ శ్లోకంలో నేను రుషులలో వ్యాసుడిని అని చెప్పుకున్నాడు.

ద్వాపర యుగాంతంలో కలియుగ ఆరంభంలో (దాదాపు అయిదు వేల సంవత్సరాలకు పూర్వం) వ్యాస మహర్షి వేదాన్ని నాలుగు భాగాలుగా విభజించాడు. ఉత్తర మీమాంస, పద్దెనిమిది పురాణాలు, భారతం తదితరాలు కూడా ఆయనే రాసారు.

వేదం అంతటిని అధ్యయనం చేయడం అంత సులభం కాదు. అయితే ఆ పనిని వ్యాసుడు చేసి చూపించాడు. వ్యాసుడు రాసిన బ్రహ్మ సూత్రం, హిందూ మతానికి ఒక గొడుగులాటిది. దీనికి ఆదిశంకరులవారు, రామానుజ చార్యులవారు, మధ్వాచార్యులు భాష్యం రాసారు.

ఇలా ఉండగా వ్యాసుడికి అక్కడక్కడా ఆలయాలు ఉన్నాయి. తమిళనాడులోని కాంచీపురంలో వరదరాజ ఆలయంలో అమ్మవారి సన్నిధిలో వ్యాసుడి విగ్రహం చూడొచ్చు. ఆయనకు ఎదురుగా ఆది శంకరుల వారి రూపాన్ని ఒక స్తంభంలో చూడవచ్చు.

వ్యాసుడు కాంచీపురంలో ఉండి శివుడిని పూజించినట్టు చరిత్ర చెబుతోంది. హరిద్వార్ లోను వ్యాస మందిరం ఒకటుంది. అక్కడ కూడా ఘనంగా ఉత్సవాలు చేస్తుంటారు. ఏదేమైనా ఈ వ్యాసపూర్ణిమ మనకు విశేషమైన పండగగా చెప్పుకోవాలి.
– జగదీశ్ యామిజాల

Send a Comment

Your email address will not be published.