శతవిధ కావ్య నిధి

10298665_nవైవిధ్యభరితమైన ఎన్నో కవితలను తెలుగుమల్లి పాఠకులకు అందించిన కవయిత్రి శ్రీమతి కామేశ్వరి బమిడిపాటి గారు. ప్రకృతి, ప్రేమ, సంస్కృతీ సాంప్రదాయాలు, మనవ సంబంధాలు, మమతానుబంధాలు, సామాజిక స్పృహ, తెలుగు భాష, హుడుద్ తుఫాను, మోడీ దగ్గరనుండి చంద్రబాబు వరకు రాజకీయనాయకులు, మన పండగలు – ఇలా ఎన్నెన్నో విషయాలపై తన హృదయ స్పందనలను సరిక్రొత్త పదకూర్పుతో కవితా కవనాలతో అలరించిన పద కూర్పరి శ్రీమతి కామేశ్వరి బమిడిపాటి.

భావ వ్యక్తీకరణలో ఉన్నత విలువలను పాటించి విషయాన్ని ఘంటాపధంగా చెప్పగలిగిన శ్రీమతి కామేశ్వరి గారు అమెరికాలో స్థిరపడి షుమారు 40 ఏళ్లయినా మన భాషపై మమకారాన్ని, మన సంస్కృతిపై వ్యామోహాన్ని వదులుకోలేదు.

శ్రీమతి కామేశ్వరి గారు గత నెల 16వ తేదీన అమెరికాలో పరమపదించారు. వారు అంతిమ శ్వాస వరకూ ప్రతీ దినం ఏదో ఒక వైవిధ్యమున్న విషయం ఎంచుకొని రచనలు చేస్తూనే వున్నారు. వారి చివరి ఘడియల్లో కుటుంబ సభ్యులందరూ తనతోనే వుండడం వారు చేసుకున్న పుణ్యమనే చెప్పాలి. శ్రీమతి కామేశ్వరి గారి ఆత్మకు శాంతి చేకూరాలని నిర్వికారుని ప్రార్ధిస్తూ వారు వ్రాసిన కొన్ని కవితలు ఇక్కడ ప్రచురిస్తున్నాం.

వారు వ్రాసిన కవితలు చదివి అర్ధం చేసుకోవడానికి పండితులై ఉండక్కరలేదు. సామాన్య జనానికి అర్ధం అయ్యేలా వాడుక భాషనుపయోగించి కొన్ని మండలీకాల్లో యాసను అన్వయించి పదప్రయోగంలో తనకు తానే నిర్వచించిన కొన్ని కవితలు:

సంక్రాంతి లక్ష్మి:
మంచువలువలు కట్టి,
పచ్చని పంట చేలపై విహరించి,
పాడి పంటల పండించి
గాదెలు గల్లాపెట్టెలు నింపు
ధన ధాన్య లక్ష్మిగా అరుదెంచు,
సంక్రాంతి లక్ష్మికి స్వాగతం…

దాంపత్య సుధ:
జిలిబిలి పలుకులు
గల గల నవ్వులు వలపుల కులుకులు ,
తళుకు బెళుకుల జల్లులు
అరమరికలు లేని ,ఏ ఎల్లలు లేని
సరస సరాగాల విరాజిల్లి మైమరచి పోవు
అనురాగబంధం దాంపత్య బంధం

అరక్షణం ప్రణయకలహం
మరుక్షణం విరహతాపం ,
మరింత తీపి కలయికల
మృదు మధుర దీపికలు
దాంపత్య జీవిత శుభారంభ స్వర్ణక్షణాలు,
అరుదౌ దివారాత్రులు…

మైత్రీ బంధం:
కులమత బెధమేరుగని
స్త్రీ పురుష బేదములు లేని నిస్వార్ధ
మైత్రీ బంధం అపురూపం .
కలిమిలేముల నెంచబొదు
సమయా సమయములనక
మంఛి ,చెడులు ,దూర భారముల
చూడక అసలైన
మైత్రి కష్టసుఖాల కలిసి మెలిసి
ఆదుకొను అపురూప వరం…

ఎల్లి పరుగు లెందుకే:
పంట సేను గట్లంట లేడి కూనల్లె ,
పరుగు లెందుకే ఎల్లి, నా బంగారు యెల్లి,
పరుగు లెందుకే .
పట్టుకు దొరక వెందుకే

పిక్క బలం సూపించు మాంవా
పచ్చని సేలని సూసి
పంట పొలమై పోవాలనుంది మాంవా ,
పైరు పాటల్ల కలసి పోవాలనుంది ,
అందుకే మాంవ అందుకే ఈపరుగులన్దుకె…

తెలుగు భాషా ప్రాశ స్త్యం:
సిరికిన్ జెప్పడు …… యంచు
శ్రీహరిని గజేంద్ర మోక్షమున ప్రస్తుతించి,
ఎదురుగ నిలిచి ఆక్రొశించు శ్రీవాణి వీణాపాణి,
అజుని రాణిని ‘కాటుక కంటినీరు …………. ఏల ఏడ్చెదో
అని అనునయించిన పరమ భాగవత వేత్త ,
సిరులకాసించక పవిత్ర భాగవతమును ,
రాజుల పరము సేయక ,
అజుని రాణిని ఆనందపరచిన ,
నిస్వార్ధ భక్త బమ్మెరపోతన…
భగ్గుమంటోంది భారతం
సీతా,సావిత్రి అనసూయ ,
సుమతి ఆది ప్రతివ్రతామ తల్లులు ,
ఏక పత్నీ వ్రతుడు ,
శ్రీరామచంద్ర ప్రభువుద్భవించిన
పవిత్ర పుణ్య భూమీనేడు
నైతిక విలువల వీడి
అక్రమబందాల ములిగి,
కన్నబిడ్డ ‘షీరా బొనానే”
కడతేర్చిన కసాయితల్లి,
మధువు మైకాన మనుగడ మరచి,
కన్నతల్లినే కాంక్షించిన,
పుత్రుని అన్య విధాన మరల్చి,
సుద్ధుని గావింపక ఆవేశాన కౄరంగా,
కడతేర్చిన కన్నతల్లి…

ఖండిత–అష్థ విధ శృంగార నాయిక
రేతిరంత ఏడనుంటివొ విభుడా
నాప్రియుడా ,ఏడనుంటివొ ,
నిండు పున్నమీ నీరుగారిపోయే ,
పండు వెన్నెలా మసక బారిపోయే,
ముడిచిన కురుల తురిమిన మల్లె ,జాజి విరులు ,
ముకులించుకు రాలి పోయె…

బండ రాయి

రాయి రాయి బండరాయంటూ
రవ్వ సేయుట గానీ
రాయిజుగూడ గుండె ఉండునని
రవ్వంత యోచించదెందుకీ
రాలుగాయు జనావళి మూర్ఖ మానవాళి ||రాయి రాయి||

ఆక్రుతిలేని ప్రకృతి వరం నేను
ఆ శ్రీరామ పదం సోకిన
పునీత అహల్య సాధ్వి
రూపాంతరమే నేను ||రాయి రాయి||

రాటుదేలిన శిల్పిచేతి ఉలితో
రమ్యసుమనోహర సుందర క్రుతులంది
రసికరాజుల రంజిల్లజేయు
ప్రకృతి వరమ్ము నేను ||రాయి రాయి||

వలువల మలినాలు బాపి మెరపింపజేయు
రాజకుపాలిటి
వరమైన రాతి బండను నేను ||రాయి రాయి||

బండ రాయి, బండ రాయి అంటూ జీవం లేని ఒక ప్రకృతి స్వరూపాన్ని సజీవ రూప కల్పన చేసిన “బండరాయి” కవిత సామజిక స్పృహని ప్రకృతి సమతుల్యానికి ప్రతీ వస్తువు తోడ్పడతాయన్న భావాన్ని కలుగ జేస్తుంది. ఈ “బండరాయి” కవితలోని పద కూర్పు, భావ ప్రకటన నన్ను చలింప జేసాయి. ఈ కవిత చదివిన తరువాత ఉలితో శిలను చెక్కే శిల్పికి సుత్తితో రాయిని బ్రద్దలుకొట్టే పామరుడికి ఉన్న వ్యత్యాసం ఏమిటో అర్ధం అయింది. ఎన్ని తార తమ్యాలున్న సృష్టిలో ప్రతి వస్తువుకీ ఒక గురుతర బాధ్యత ఉంటుందని ఎవరి వారి అవకాశాన్ని బట్టి వారి విధులను నిర్వర్తిస్తూ ఉంటారన్న ఒక గొప్ప భావన కలుగక మానదు. శ్రీమతి భమిడిపాటి కామేశ్వరి గారి రచనల్లో మానవతా మమత, బంధాలు అనుబంధాలు, ప్రేమ ప్రకృతి, సంస్కృతీ సాంప్రదాయాలు ఇలా ఎన్నెన్నో హృదయాన్ని రంజింపజేసే పద కవితలు ఒక నదీ ప్రవాహంల కొన సాగుతూ ఉంటాయి. తల్లికి బిడ్డకి, సూర్యుడుకీ కాంతికి, కలానికి కాగితానికి ఉన్న అనుబంధం నిర్వచనానికి అతీతం. అలాగే శ్రీమతి భమిడిపాటి కామేశ్వరి గారి
కలం నుండి జాలువారిన రచనలకు సమీక్ష వ్రాయడం ఎవరికైనా కత్తి మీద సాము.

మల్లికేశ్వర రావు కొంచాడ

Send a Comment

Your email address will not be published.