శాస్త్రీయసంగీత పితామహుడు

“మాయామాళవగౌళ” రాగాన్ని ఆవిష్కరించి కర్నాటక సంగీతానికి ప్రప్రధమ సంగీత విద్వాంసులుగా నోచుకున్న మహనీయులు…

స్వరావళులు, జంట స్వరాలు, అలంకారాలు, లక్షణ గీతాలు, ప్రబంధాలు, కృతులు వంటి అంశాలతో
సశాస్త్రీయ సంగీతానికి ఓ తీరూ తెన్నూ రూపొందించిన ఘనులు.

Purandaradasaతన జీవితకాలంలో అయిదు లక్షల కృతులు అందించాలని లక్ష్యంగా పెట్టుకుని 4,75,000 వరకే సమర్పించిన పుణ్యపురుషులు….
ఈ విషయాన్ని ఆయన తమ కృతుల్లో అక్కడక్కడా పేర్కొన్నారు కూడా. ఆయన కీర్తనలలో ఎక్కువ భాగం కన్నడంలోనివే. కొన్ని కీర్తనలు సంస్కృతంలో రాసారు. అయితే మొత్తం మీద ఓ వెయ్యి కృతులు మాత్రమే ఇప్పుడు అందుబాటులో ఉండటం గమనార్హం. వీటిలో రెండువందలకుపైగా విశేష ప్రాచుర్యం పొందాయి.

ఇంతకూ ఈ మాటలన్నీ ఎవరి గురించో ప్రత్యేకించి చెప్పక్కరలేదనుకుంటాను….ఆయనే సంగీత దాసు శ్రీ పురందరదాసు.

తన కృతులలో విష్ణుమూర్తిని కీర్తిస్తూ ‘పురందర విఠలా’ అనే మాటలతో పరిచయం చేసిన వాగ్గేయకారుడు, కర్నాటక సంగీత పితామహుడు అయిన పురందరదాసు 1484 లో మహారాష్ట్ర పరిధిలోని పూనా దగ్గరలో గల ఒక పల్లెలో వరదప్ప నాయక్ దంపతులకు జన్మించారు. తల్లిదండ్రుల ఇష్ట దైవం శ్రీ వేంకటేశ్వరుడు. అందుకే వారు తమ కొడుక్కి ముద్దుగా పెట్టిన పేరు శ్రీనివాస నాయక్. ఆయన తండ్రి ఓ వడ్డీ, ముత్యాల వ్యాపారి.

పురందర దాసు చిన్నప్పుడు సంస్కృతం, కన్నడం చదువుకున్నారు. ఆయనకు సరస్వతీ బాయితో పెళ్లి చేసారు. తండ్రి మరణానంతరం పురందర దాసు కూడా తండ్రి అడుగుజాడలోనే వ్యాపారం చేస్తూ వచ్చారు. ఎంతసేపూ డబ్బూ డబ్బూ అంటూ లెక్కలేనంత డబ్బు గడించారు. కానీ ఏం లాభం? ఎవ్వరికీ చిల్లిగవ్వ ఇచ్చి సాయపడినట్టు చరిత్ర లేదు. డబ్బే లోకం అనుకుని మిగిలినవన్నీ పక్కన పెట్టేసారు.

ఆతర్వాత ఒకసారి ఆయనకు భార్య ద్వారా పరమేశ్వరుడు కళ్ళు తెరిపించాడు. ఆ సంఘటన చూద్దాం….

ఓమారు పరమేశ్వరుడు ఓ పేద బ్రాహ్మణుడి రూపంలో వచ్చి తన కొడుక్కి ఉపనయనం చెయ్యడానికి ధనసహాయం చెయ్యమని వేడుకుంటాడు. కానీ పురందర దాసు పట్టించుకోరు. కాలం గడుస్తోంది. అయినా ఆ వృద్ధ బ్రాహ్మణుడు ఆగడు. అదేపనిగా వెంట పడతాడు. దానితో ఒకరోజు పురందర దాసు ఆ పెద్దాయనతో ఒక్కటంటే ఒక్క నాణెం ఇస్తూ మళ్ళీ ఎప్పుడూ కనిపించకు అని పంపేస్తారు. ఆయన కరకు మాటలకు వృద్ధ మనిషి మనస్సు చివుక్కుమంటుంది. ఆ పెద్దాయన పురందర దాసు దుకాణం నుంచి తిన్నగా పురందర దాసు ఇంటికి వెళ్తాడు. పురందర దాసు భార్య సరస్వతిని అర్దిస్తాడు. ఆమెది జాలి గుండె. తన భర్త పిసినారితనానికి బాధపడుతుంది. ఆమెకు ఆ పెద్దాయనకు ఎలాగైనా సహాయం చెయ్యాలనే ఉంటుంది. కానీ ఆమె చేసే స్థితిలో లేదు. కారణం ఆమె ఒక్క పైసా ఖర్చు చేయాలన్నా భర్త పురందర దాసుని అడగాల్సిందే. కనుక భర్త ఇంట్లో లేడని చెప్తుంది.

అయితే అప్పుడు పెద్దాయన ఆమెతో “మీ పెళ్ళప్పుడు మీ పుట్టింటి వాళ్ళు నీకు ఎంతో కొంత ఏదో ఒకటి ఇచ్చి ఉంటారు కదా…అందులో నుంచి సహాయం చెయ్యవచ్చుగా” అని అడుగుతాడు.

అప్పుడు ఆమెకు తమ తల్లిదండ్రులు ఇచ్చిన ఆభరణాల్లో ఒక ముక్కు పుడక తీసి ఆయనకు ఇస్తుంది. అలా ఇస్తున్నప్పుడు ఆమె అది కృష్ణ భాగవానుడికే ఇచ్చినట్టు అనుభూతి చెందుతుంది. పెద్దాయన దానిని తీసుకువెళ్లి నేరుగా పురందర దాసు దుకాణానికి వెళ్తాడు. అయితే ఆ పెద్దాయన ను చూడటంతోనే పురందరదాసుకు ఎక్కడా లేని కోపం వస్తుంది. మళ్ళీ తన వద్దకు వచ్చిన ఆ వృద్ధుడిని పురందర దాసు కసురుకుంటారు.

అప్పుడు పెద్దాయన తాను బిక్షకు రాలేదని, ముక్కుపుడకను తాకట్టుపెట్టుకుని కొంత డబ్బు అప్పుగా ఇవ్వమని అడుగుతాడు.

అయితే పురందర దాసుకి ఆశ్చర్యం వేస్తుంది. పెద్దాయన దగ్గర ఉన్న ముక్కుపుడక ఏమిటో చూడాలనుకుని అదేదో చూపమంటారు.

పెద్దాయన తన వద్ద ఉన్న ముక్కుపుడక ఇస్తాడు. పురందరదాసు అది చూసి విస్తుపోతాడు. అది తన భార్యదే అయి ఉండాలనుకుని ఎక్కడిది ఆ ముక్కపుడక అని అడుగుతారు పురందరదాసు.

“అయితే తన మీద నమ్మకం లేదా ? అని అడుగుతూ ఎక్కడైనా దొంగిలించి తెచ్చాననుకున్నావా?” అని అడుగుతాడు వృద్ధ మనిషి. తనకు మీలాంటి ఓ పెద్ద మనిషి అది కానుకగా ఇచ్చారని చెప్తాడు.

పురందర దాసు ఆ ముకుపుడక తీసుకుని ఆ పెద్దాయనకు డబ్బులు అప్పిచ్చి దానిని ఒక పెట్టెలో పెట్టి దుకాణానికి తాళం వేసి ఇంటికి చేరుకుంటారు.

ఇంటికి వెళ్ళడంతోనే పురందర దాసు భార్యను చూసి “ఏదీ నీ ముక్క పుడక? ఎందుకు పెట్టుకోలేదు?” అని అడుగుతారు.

ఆ సమయంలో ఏం చెప్పాలో తెలియక ఆలోచించి ఆలోచించి తాను లోపల పెట్టేసానని మెల్లగా చెప్తుంది.

కానీ ఆయనకు భార్య మీద అనుమానం వచ్చి ఏదీ తీసుకురా ముక్కు పుడక అని అరుస్తారు.

దాంతో ఆమె ఏం చెయ్యాలో తెలియక అయోమయంలో పడుతుంది. “ఏం చెయ్యను భగవంతుడా…నువ్వే కాపాడాలి” అని మొరపెట్టుకుంటుంది దేవుడిదగ్గర.

పెద్దాయనకి కానుకగా ఇచ్చానని చెప్పి తాను ఆత్మహత్య చేసుకోవాలనుకుని ఓ కప్పులో విషం పోసుకుని తాగడానికి సిద్ధపడుతుంది.

అప్పుడు ఓ శబ్దం వినిపిస్తుంది. తాను విషం తాగాలనుకున్న కప్పులో ముక్కపుడక ఉంటుంది. ఆమె నమ్మలేకపోతుంది. ఆమె దేవుడికి కృతజ్ఞతలు చెప్తుంది. ఆ ముక్కుపుడక తీసి భర్తకు ఇస్తుంది. కానీ ఆయన కోపం ఆయనదే. ఆ పెద్దమనిషికి ఇచ్చిన ముక్కుపుడక ఇప్పుడు ఇక్కడకు ఎలా వచ్చింది అని అరుస్తారు. ఆమె జరిగినదంతా చెప్తుంది. ఆమె మాటలు విని పురందరదాసు ఆశ్చర్యపోతారు. తన వైఖరికి సిగ్గుపడతారు.

ఆయన నేరుగా దుకాణానికి వెళ్లి ఎక్కడైతే ఉంచారో ఆ పెట్టె తెరచి చూస్తే అందులో ముక్కుపుడక ఉండదు. అప్పుడు ఆయనకు కనువిప్పుకలుగుతుంది. ఇప్పటిదాకా జరిగిన నాటకమంతా దేవుడు ఆడించినట్టు గ్రహిస్తారు. దేవుడే పెద్దాయన రూపంలో తన వద్దకు వచ్చారని తెలుసుకుని ఆ క్షణంలోనే మారిపోతారు. తన పిసినారితనానికి తనను తాను నిందించుకుంటారు. దేవుడిని క్షమించమని ప్రాధేయపడతారు. హరి భక్తుడిగా మారిపోతారు.

జీవితమంటే డబ్బు ఒక్కటే కాదని తెలుసుకుని పురందర దాసు తన దగ్గర ఉన్నదంతా పేదలకు ఇచ్చేసారు. తన స్వభావం మార్చుకుని ఇల్లు విడిచిపెట్టి విజయనగరం చేరుకున్నారు. అక్కడ వ్యాసరాయుల శిష్యుడిగా చేరి ఆ తర్వాత హరినామ సంకీర్తనతో దేశంలోని వివిధ ప్రాంతాలు సందర్శించి భక్తి మార్గాన్ని చూపి ఆదర్శమూర్తులయ్యారు. అంతే తప్ప ఆయన ఏ రాజు ఆశ్రయమూ ఆశించలేదు. రాముడూ కృష్ణుడూ అంటే విపరీతమైన భక్తి భావం కలిగిన పురందర దాసు కృతులు, ఆయన అవలంభించిన పద్ధతి త్యాగరాజుని కూడా ప్రభావితం చేసాయనే వారున్నారు.

పురందర దాసు తన ఎనభయ్యో ఏట అంటే 1564 లో ఆయన తుది శ్వాస విడిచారు. . ఆయన కృతులను ఆలపించి దక్షిణాదిలోనే కాకుండా దేశమంతటా విశేష ప్రాచుర్యం కలిపించిన గాయకురాలు ఎం ఎల్ వసంతకుమారి.

————————————
గండూరి రేణుక , మధురాపురం

Send a Comment

Your email address will not be published.