శివారెడ్డితో దసరా దీపావళి

క్వీన్స్ లాండ్ తెలుగు సంఘం మొట్టమొదటిసారిగా సినీ హాస్య నటుడు మరియు మిమిక్రీ విద్యలో ఆరితేరిన శ్రీ శివారెడ్డి గారిని ప్రత్యేకంగా దసరా దీపావళి సంబరాల సందర్భంగా బ్రిస్బేన్ నగరానికి రప్పించి సత్కరించింది.  శ్రీ శివారెడ్డి గారి హాస్యపు జల్లుల్లో చాలా మంది  తెలుగు సంఘం సభ్యులు తడిసి ముద్దయి కడుపుబ్బా నవ్వుకున్నారు.  ఈ కార్యక్రమంలో స్థానిక కళాకారులు, తెలుగు సంఘంలోని పెద్దలు మరియు క్వీన్స్ లాండ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధులు పాల్గొని షుమారు 4 గంటల పాటు రంగస్థలం పై ఎంతో చక్కని కార్యక్రమం నిర్వహించడం ముదావహం.  శ్రీ శివారెడ్డి గారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా విచ్చేసి తన సహజ నటనా కౌశలం మరియు మిమిక్రీ లతో ప్రేక్షకులని మంత్ర ముగ్దుల్ని చేశారు.  కేవలం ఇతర సినిమా నటులు, రాజకీయ నాయకులను  అనుకరించటమే  కాకుండా ఒక స్త్రీ పాత్రను అభినయించి అందరినీ ఆకట్టుకున్నారు.

అతిధులకు, తెలుగు సంఘ సభ్యులకు అందరికీ తెలుగు సంఘం కార్యదర్శి శ్రీ ప్రభాకర్ గారు స్వాగత వచనాలు పలకడంతో సభా కార్యక్రమం ప్రారంభం అయింది.

 

ఈ కార్యక్రమానికి ముందుగా క్వీన్స్ లాండ్ పార్లమెంట్ సభ్యులు ఫ్రేయ ఒస్తోపోవిష్ మరియు తాన్య స్మిత్ (Asst. Minister for child safety) జ్యోతిని వెలిగించారు.  మిస్ తాన్య స్మిత్ మాట్లాడుతూ క్వీన్స్ లాండ్ రాష్ట్రంలో బహుళ సంస్కృతీ సంప్రదాయానికి పెద్ద పీట వేస్తున్నామనీ ఈ రాష్ట్రంలో 220 భాషలకి పైగా మాట్లాడే ప్రజలున్నారనీ తెలిపారు.  క్వీన్స్ లాండ్ ప్రభుత్వం భారతీయుల సంప్రదాయాలకు కట్టుబాట్లకు ఎక్కువ విలువనిస్తూ వారికి తగినన్ని సహాయ సహకారాలన్దిస్తుందనీ తెలిపారు.  శ్రీ అయ్యలరాజుల కామేశ్వర రావు గారు, శ్రీ నెల్లిమర్ల ప్రకాష్ రెడ్డి గారు అమరియు శ్రీ డేనియల్ గారు వీరిద్దర్నీ శాలువాలతో సత్కరించారు.

శ్రీమతి నోరి కామేశ్వరి గారు దసరా దీపావళి పండగల ప్రాశస్త్యాన్ని ప్రేక్షకులందరికీ వివ్వరించారు.

క్వీన్స్ లాండ్ తెలుగు సంఘం అధ్యక్షులు అతి తక్కువ కాలంలో ఈ కార్యక్రమం ఇంత పెద్ద ఎత్తున నిర్వహించినందుకు కార్యవర్గ సభ్యులందరికీ మరియు ఆర్దిక సహాయన్నందించిన వ్యాపారవేత్తలకు కృతజ్ఞతలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో షుమారు 4 ఏళ్ల పిల్లలు నుండి 60 ఏళ్ల నడి వయస్సు గలవారు పాల్గొని వివిధ రకాల ప్రదర్సనలతో పాటు పాటలు పాడటం, నృత్యం చేయటం ఎంతో సందడిగా వుంది.  శ్రీమతి జననీ గణపతి చేసిన భరత నాట్యం చాలా బాగుంది.  శ్రీమతి సీత మహాలక్ష్మి మరియు పద్మ ప్రియ పాడిన “గోవింద..గోవింద” జుగల్బందీ పాట,  ప్రేక్షకుల కరతాళ ధ్వనులను అందుకుంది.  శ్రీ హరీష్ చిలకలపూడి గారు చేసిన దుర్యోధన ఏకపాత్రాభినయం అందరికీ నచ్చింది.  ఇటువంటి ఆహార్యంతో జానపదాలు కానీ, పౌరాణిక నాటకాలు కానీ ఈ మధ్య కాలంలో కార్యక్రమాలు జరగడం లేదనే చెప్పాలి.

తరువాత సినిమా పాటల మెడ్లీ చాలా హిట్ అయింది.  శ్రీ శివారెడ్డి గారు కొన్ని పాటలు పాడటంతో కార్యక్రమం ముగిసింది.

తెలుగుమల్లి వారి పెదబాల శిక్ష

క్వీన్స్ లాండ్ తెలుగు సంఘం మరియు తెలుగుమల్లి సౌజన్యంతో ముద్రించబడిన తెలుగుమల్లి వారి పెదబాల శిక్ష పుస్తకాన్ని శ్రీ శివారెడ్డి గారు ఆవిష్కరించడం జరిగింది.  ఈ పుస్తకాన్ని తెలుగు సంఘ సభ్యులందరికీ అందజేస్తామని శ్రీ కృష్ణారావు గారు తెలిపారు.  అయితే సభ్యులందరూ తెలుగుమల్లి న్యూస్ లెటర్ కి సబ్ స్క్రిబ్ చేయాలని తెలుగుమల్లి సంపాదకులు శ్రీ కొంచాడ మల్లికేశ్వర రావు గారు కోరారు.  తెలుగుమల్లి వెబ్సైటు ద్వారా ఆస్ట్రేలియా మరియు న్యూ జిలాండ్ లోని తెలుగువారందరూ వార్తా విశేషాలను పంచుకోగలరని శ్రీ మల్లికేశ్వర రావు గారు అభిలషించారు.

ఈ కార్యక్రమానికి శ్రీ రవిశంకర్ జొన్నలగడ్డ గారు వాచస్పతిగా వ్యవహరించి చివరి వరకూ  ఎంతో చక్కగా నిర్వహించారు.

Send a Comment

Your email address will not be published.