శ్రీకృష్ణ లీలలు చిత్రానికి ఎనభై ఏళ్ళు

తెలుగు పౌరాణిక చిత్రాల్లో ఒకటైన శ్రీకృష్ణ లీలలు చిత్రానికి ఎనిమిది పదుల వయస్సు. అంటే 1935 లో మొదటిసారిగా శ్రీకృష్ణ లీలలు చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చిందన్న మాట.

పినపాల వెంకట దాసు నిర్మించిన ఈ చిరానికి చిత్రపు నరసింహా రావు దర్శకత్వం వహించారు.
ఈ చిత్రానికి సాహిత్యం పింగళి నాగేంద్ర రావు అందించారు. రచనకు ఏ టీ రాఘవా చారి కూడా సహకరించారు.

ఈ చిత్రంతోనే ప్రముఖ సంగీత దర్శకులు సాలూరు నాగేశ్వర రావు సినీ రంగప్రవేశం చేసారు. బాలకృష్ణుని పాత్రలో ఆయన నటించారు. అప్పటికి ఆయన వయస్సు పదమూడు సంవత్సరాలు మాత్రమే.

ఎప్పటికి ప్రముఖ రంగస్థల నటుడిగా నిలిచిపోయే వేమూరి గగ్గయ్య కంసుడి పాత్రలో తమ విశ్వరూపాన్ని ప్రదర్శించారు. అయన పద్యాలను రాగయుక్తంగా ఆలపించడంలో పెట్టింది పేరు. ఈ చిత్రంలో “ధిక్కారమును సైతునా…” అంటూ సాగే పద్యాన్ని ఆయన పాడి వినిపించారు. ఆ పద్యం ఆయన నోటంట వింటున్నంతసేపూ ఒళ్ళు జలదరించంకమానదు.

ఇతర పాత్రల్లో రామతిలకం, శ్రీరంజని, పారుపల్లి సత్యన్నారాయణ, పారుపల్లి సుబ్బారావు, లక్ష్మీరాజ్యం, మాస్టర్ అవధాని తదితరులు నటించారు. లక్ష్మీరాజ్యం రాధ పాత్రను పోషించారు. ఆమెకు ఈ చిత్రం అంటే ఎంతో ఇష్టం. (అందుకోసమే ఆమె 1959 ప్రాంతంలో ప్రారంభించిన తన రాజ్యం పిక్చర్స్ పై కృష్ణలీలలు అనే చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రానికి కొంత షూటింగు సి పుల్లయ్య దర్శకత్వం వహించగా మరి కొంత భాగానికి జంపన చంద్రశేఖర రావు దర్శకత్వ బాధ్యతలు చేపట్టారు)

ఈ చిత్రానికి సంగీతం సమకూర్చింది గాలిపెంచల నరసింహా రావు.

భాగవతంలోని శ్రీకృష్ణుడి బాల్య పరువాన్ని ప్రధానంగా తీసుకుని ఈ చిత్రాన్ని సమర్పించారు. కృష్ణుడి వల్ల తన ప్రాణానికి ముప్పు ఉందన్న కారణంగా కంసుడు కృష్ణుడిని సంహరించడానికి చేసిన ప్రయత్నాలను ఈ చిత్రంలో చిత్రీకరించారు. అంతేకాదు, కంసుడి వధ, గోపమ్మలతో కృష్ణుడి సల్లాపాలు కూడా ఈ చిత్రంలో రసరమ్యంగా చూపించారు.

బాక్స్ ఆఫీస్ దగ్గర ఆరోజుల్లోనే సూపర్ హిట్ కొట్టిన ఈ చిత్రానికి సంగీతం సమకూర్చిన గాలిపెంచల గురించి ఒకటి రెండు మాటలు చెప్పుకోవాలి. శ్రీ సీతారాముల కల్యాణం చూతము రారండి అని సాగే గ్రామ్ ఫోన్ రికార్డు వినని ఆంధ్రుడు ఉండరంటే అతిశయోక్తి కాదు. ఈ పాటకు స్వరకర్త గాలిపెంచలే… ఆ పాట సీరామకల్యానంలోనిదే. ఈయనే పంతులమ్మ చిత్రానికి దినకర రావుతో కలిసి సంగీతం అందించారు. శ్రీ సీతారాముల కల్యాణం చూతము రారండి …అనే పాటను సముద్రాల రాశారు. సుశీల గానం చేసారు. గీతాంజలి పై ఈ పాటను చిత్రీకరించారు.

– యామిజాల జగదీశ్