శ్రీపాద కథల అల్లిక

తండ్రి బలవంతంతో వైదిక విద్య నేర్చుకున్న శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి వారాలూ గట్రా చేసుకుంటూ అగ్రహారాలలో పండితుల వద్ద సంస్కృతం అభ్యసించారు.

తెలుగువారే తెలుగు పుస్తకాలను నిరసించిన విషయం తెలుసుకుని ఏదేమైనా తెలుగు పుస్తకాలను చదవాలనీ తెలుగులో పుస్తకాలు రాయాలని పట్టుదల పెంచుకున్నారు. తాను విన్న కథలనే ఆధారంగా చేసుకుని మంచి కథలు అల్లాలని శ్రీపాదలో ఓ కోరిక కలిగింది.

ఒక వృద్ధ వితంతువుకి ఆయన ఒకప్పుడు మదన కామరాజు కథలు చదివి వినిపిస్తుండే వారు. ఆ సమయంలో ఆయనకు కథలపై ఆసక్తి పెరిగింది. ఆ కోరికే తర్వాతి రోజుల్లో ఆయనతో కథలు రాయించసాగింది.

పద్యాలలో కన్నా సరళమైన వచనంలో కథలు చెప్పాలనుకున్న శ్రీపాద కొన్ని పుస్తకాలు చదివి రహస్యంగా రచనలు చేసారు. అయితే ఆయనతో రచనలు మాన్పించాలని ఆయన తండ్రీ, చిన్నన్న ప్రయత్నించినప్పుడు శ్రీపాద వారు ప్రతీకారం తీర్చుకోవాలన్నట్టు రచనపై మరింత ఆసక్తి పెంచుకున్నారు.

ఆ ఆసక్తే ఆయనకు వచన రచనలో ఓ వెలుగునిచ్చింది.

ఆయుర్వేద ఔషధాలు ఒక వైపు తయారు చేస్తూనే రచనలను కొనసాగించిన శ్రీపాద ప్రబుద్ధాంద్ర పత్రికను రెండు భాషలలో తీసుకొచ్చారు. ఈ పత్రికలో పద్య రచనలకు చోటివ్వలేదు. వచన రచనలు మాత్రమే వేసే వారు. హిందీ వల్ల తెలుగు భాసహకు జరుగుతున్నా ప్రమాదాన్ని ఎండగడుతూ తీవ్రమైన విమర్శలు చేసిన శ్రీపాద నాటక రచయితగా కూడా పేరు గడించారు.

స్వీయ చరిత్రను అనుభవాలు – జ్ఞాపకాలు పేరిట తన విషయాలను చెప్పుకున్నారు.

ఆయన మొదటి కథ “ఇరువుర మొక్కచోటికే పోదము”. ఈ కథను శ్రీపాద వారు 1915 నవంబర్ 17వ తేదీన ఒక గంట వ్యవధిలో రాసారు. ఇది ఆంధ్రపత్రిక వారపత్రికలో అచ్చయింది. కోటంరాజు పున్నయ్య గారు శ్రీపాదవారితో ఈ కథ రాయించారు. శ్రీపాద వారి ఆఖరి కథ చలిచీమలు. అది కూడా వారి మరణానంతరం ఆంధ్రపత్రికలోనే అచ్చయ్యింది. 1961-62 ప్లవ సంవత్సరాది సంచికలో అది వెలువడింది.
అయితే ఆయన తొలి రచనగా ఒక నాటకం 1909 లో వెలువడింది. ఆయన తన 17వ ఏట మంత్రిప్రగడ భుజంగ రావు పంతులుగారి వారకాంత చాటు ప్రబంధం చదివి దానిని నాటక రూపంలో రాసారు.

నన్ను బాగా కదిలించివేసిన విషయం శ్రీపాద వారు పురిపండా అప్పలస్వామి గారికి రాసిన ఉత్తరం. ఆ ఉత్తరం ఆయన వీలునామాగా చెప్పుకునే వారు.
అందులోని విషయం …

“ఇవాళ తెల్లవారాటప్పటికి నాకివాళ పక్షవాతం సందేహం కలిగింది. మీరు హైదరాబాద్ నుంచి ఎప్పుడు వస్తారు?

నాగేశ్వర రావు గారికి కథలు పుస్తకాలు ఇచ్చెయ్యదలచుకున్నాను. వెనక ఒకమాటు వారు పేజీకి 3-00 మూడు రూపాయలు చొప్పున బేరం చేసి స్థిరపరచుకున్నారు. నేను కథలు పట్టుకు వెళ్లి ఇవ్వబోతే డబ్బు లేదు ఇప్పుడు వద్దన్నారు. ఆ బేరం మొన్న జ్ఞాపకం చేశాను. నిజమే. అప్పుడు డబ్బు లేక పోయింది అన్నారు. ఇప్పుడు ఆ రేటున పైసలు చెయ్యండి. కుదరకపోతే మీ ఇష్టం వచ్చినట్లు పైసలు చెయ్యండి. తక్కిన పుస్తకాలున్నూ ఇప్పించెయ్యండి. వారికి నాలుగు వేల చిల్లర నేను బాకీ. నవలలూ నాటకాలూ వగైరా కాపీరైట్లూ స్టాకు అంతా ఇప్పించండి. మీకు సాధ్యమైన ధరకు ఇప్పించి ఋణం లేదనిపించి అదనంగా ఇస్తే అది నా భార్య చేతికి ఇవ్వండి. నా కుటుంబానికి మీరే సాయం చెయ్యగలరు. కథలు సాపు రాసినవున్నాయి. పేపరు కటింగులున్నాయి. మందు చికిత్సకు తిండికి డబ్బు కావాలి. ఇప్పించండి. ఈ నెల అద్దె ఇవ్వ లేదు. పుస్తకాల వ్యవహారం పూర్తిగా పరిష్కరించి మరీ వెళ్ళాలి మీరు. అనుభవాలు 2 విశాఖపట్టణం పంపాలి. పోషకులకూ తక్కిన వారికీ, రాజమండ్రిలో మైలవరపూ, వింజమూరీ, రామచంద్రాపురంలో దువ్వూరీ, చావలీ, వేపా మాత్రమే ఇచ్చాను. వేపా వారు 116 – ఇస్తామన్నారు. ఇప్పుడు కొంత ఇవ్వవచ్చు. కాకినాడ సాహిత్యవేత్తగారంటే శ్రీ పార్థసారధి గారు. వారికి నా యెడ చాల దయ. మీరు చెపితే నాకు గాని, నా కుటుంబానికి గాని వారేమైనా సాయం చేసి చేయించవచ్చు.
నా కుటుంబం చెట్టు కింద ఉంది. మీరు సాయం చెయ్యండి. విశాఖలో కూడా ఏమైనా వీలవుతుందేమో చూడండి.
గుంటూరిలో చావాలి సూర్యనారాయణ గారు 66-00 ఇవ్వాలి. ప్రయత్నం చెయ్యండి. వారు రామచంద్రాపుర గాంధి డాక్టరుగారున్నూ రామచంద్రాపురం మిత్రుల చేత ఏమైనా చేయించవచ్చు. నెల్లూరు శివరామయ్య గారేమైనా పంపవచ్చు. డాక్టరు కనకరాజుగారున్నూ చెయ్యవచ్చు.
శ్రీ నాగేశ్వర రావుగారి విషయం …వారికి అభ్యుదయం. నా చేతనైనంత కలిగించాలనుకున్నాను. భగవంతుడిలా చేసాడు.
నేను వ్యర్ధుడినయ్యాను. స్నేహితులైనందుకు మీకీ శ్రమ మాత్రం కలిగిస్తున్నాను.
నాగేశ్వర రావుగారి వ్యవహారం మీరే పరిస్కరించదమ్మ్ నా ఆశ. మీరు మిక్కిలీ ఘనంగా సన్మానించారు.
మీకు శ్రమ మాత్రమే కలిగించాను నేను.
శ్రీ సింహాచలం గారి స్నేహం నాకు మహా మేరువు. వారికి నా కృతజ్ఞత సరిగా చూపించలేకపోయాను.
మీకు నేను బరువైనట్టే నిశ్చయం. మీలాగ మనసిచ్చిన వారు నాకు మరొకరు లేరు. మీ ఋణం తీర్చుకోలేను. అది తీర్చుకోడానికైనా మరి జన్మ ఎత్తుతాను. ఒకటి కాదు పది వంద ఎత్తుతాను. ఒక సామాన్యుడికి మీరు సింహాచలం గారూ కనకాభిషేకం చేయించారు. ఇది నాకు పరమేశ్వరుడు చేయించలేనిది.
ఇలాంటి స్థితిలో నేను భారం అయిపోతున్నాను.
అది తీర్చుకోడానికైనా మరో జన్మ ఎత్తుతాను కనక.
నాకేమీ విచారం లేదు. నా భార్య నన్ననేక విధాల కాపాడింది. చిన్నప్పటినుంచి దాన్ని కస్తాపెట్టాను. గానే సుఖపెట్టలేకపోయాను.
ఇప్పుడు ఇక ఆ ఊసే లేదు కదా? నిరర్ధక జన్మ అయిపోయింది.
రచనలైనా సాపు రాసి అన్నీ జాతికి సమర్పిన్చుకోలేకపోయాను.
పరమేశ్వరుడు మీకు సకల సుఖాలు కలిగించాలి. సారస్వత సేవలో మీకు సాఫల్యం పూర్తిగా కలిగించాలి. మీ కలం జాతిని ఉద్ధరిస్తుంది.
– శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి

ఏదేమైనా చిన్న కథలతో ఆంద్ర జాతిలో గొప్ప మార్పు తీసుకురావచ్చు అనే లక్ష్యంతో ఆయన రచనలు చేసి కనకాభిషేక గౌరవం పొందడం కథలనే గౌరవించినట్టు భావించాలి.

– యామిజాల జగదీశ్

Send a Comment

Your email address will not be published.