శ్రీరామా, నీ నామం బహు రుచిరా

హిందువుల ఆరాధ్య దైవం శ్రీరాముడు. రాముడిని ఆంధ్రుల దౌహిత్రుడని అంటారు. రామాయణంలో రామచంద్రుని తత్వాన్ని గురించి మొదటిసారిగా చెప్పినతను మారీచుడనే రాక్షసుడు. శ్రీరాముడిని మూర్తీభవించిన ధర్మవిగ్రహమని ఆదికవి వాల్మీకి రామాయణంలో రామో విగ్రహవాన్ అనే శ్లోకంలో పలికిస్తాడు. రామచంద్రుని సర్వ అవయవాలు ధర్మాన్నే ఆచరిస్తాయని ఈ శ్లోకార్ధం.మహావిష్ణువు దశావతారాలలో శ్రీరామావతారం ఏడవది.
రామ అనే రెండక్షరాల మాట తరతరాలుగా భారతీయుల నాలుకలపై నర్తిస్తోంది. నర్తిస్తుంది. శ్రీరాముడు మానుష రూపంలో ఉన్న దేవుడు. నరుడికీ – నారాయుణుడికీ మధ్య ఉన్న తేడాను, దూరాన్ని చెరిపేసిన  దైవం శ్రీ రాముడు. ” రా ” అంటే పురుషుడు. “మ “అంటే ప్రకృతి. పురుషుడు, ప్రకృతి కలిస్తేనే సమస్త విశ్వం ఏర్పడింది. అందుకే త్యాగరాజ స్వామి శివ మంత్రానికి “మ” జీవం, కేశవ మంత్రానికి “రా” జీవం అని అన్నాడు. రామ అనే రెండక్షరాలు గొప్ప తారక మంత్రం. రామ అనే మాటలో “ర” కారం ఆత్మలోని ప్రధాన అంశమైన  అగ్నిని, “ఆ” కారం ఆత్మ నిత్యత్వాన్ని. “మ” కారం జన్మ పరంపరను సూచిస్తాయి.
ఆధ్యాత్మ రామాయణంలో రామ నామ మహిమను వివరించే ఘట్టం ఒకటుంది. శివుడు పార్వతీ దేవికి బోధించిన శ్రీరామ కథలో సదాశివుడు ధ్యాననిమగ్నుడై  జపించిన  మంత్రాన్ని తారకమంత్రం అని అంటారు.
శ్రీరామ రామ రామేతి
రమే రామే మనోరమే
సహస్రనామ తత్తుల్యం
రామ నామ వరాననే
” మనస్సును రంజింప చేసే పార్వతీ…శ్రీ రామ రామ రామ అని రామునిలో నేను లీనమై ఆనందిస్తున్నా. రామ నామం విష్ణుసహస్ర నామాలతో సమానం” అని శివుడు రామనామ విశిష్టతను ఈ శ్లోకంలో  చెప్పుకొచ్చాడు.
అంతటి మహిమాన్వితుడైన శ్రీరామచంద్రుడి జననం, సీతారామ కల్యాణం కూడా రామనవమి రోజునే జరిగాయి. చైత్ర శుద్ధ నవమి, పునర్వసు నక్షత్రం మధ్యాన్నం వేళ వచ్చినట్లయితే దానిని శ్రీరామ జయంతిగా  విశిష్ట తిథిగా  చెప్పుకుంటారు. అలాగే వసంత రుతువులో చైత్ర శుద్ధ నవమి గురువారం పునర్వసు నక్షత్రం కర్కాటక లగ్నంలో సరిగ్గా అభిజిత్ ముహూర్తంలో అనగా మధ్యాన్నం 12 గంటల వేళలో త్రేతాయుగం చివర్లో శ్రీరాముడు దశారధుని కుమారునిగా కౌసల్య గర్భాన  రఘువంశాన జన్మించాడు. ఈ విషయం వాల్మీకి రామాయణంలో స్పష్టంగా ఉంది. అందుకే ఈ పుణ్య దినాన్ని శ్రీ రామనవమిగా జరుపుకోవడం కద్దు. చైత్రశుద్ధ నవమి ఎంతో పవిత్రమైనది. ఇక్కడో విషయం చెప్పుకోవలసి ఉంది. శ్రీరాముడి కల్యాణం, శ్రీరాముడు రావణుని వధించి సీతాసమేతుడై అయోధ్యకు వచ్చినది కూడా ఈ నవమి నాడే. మరుసటి రోజు దశమి నాడు శ్రీరామ పట్టాభిషేకం వైభవంగా జరిగింది.
అందుకే కల్యాణోత్సవం, పట్టాభిషేక ఉత్సవం కూడా శ్రీరామనవమినాడే నిర్వహించడం అనాదిగా వాడుకలో ఉన్నదే.
శ్రీరామనవమి రోజు రాత్రి జాగరణ చేసి రామ భజనతోను, సంకీర్తనలతోను గడిపి మరుసటి రోజు ఉదయం మళ్ళీ రామచంద్రుని పూజ చేస్తే రామనవమి వ్రతాన్ని ఆచరించినట్లే అవుతుంది.
ఉగాది పాడ్యమి మొదటి రోజు మొదలుకుని శ్రీరామనవమి వరకు రామాయణ పారాయణ చేయటం శ్రేష్టం. ఈ తొమ్మిది రోజులను వసంత నవరాత్రులని అంటారు. రామ మందిరాలలో, రామాలయాలలో రామాయణ కాలక్షేపం చేస్తుంటారు. కొన్ని చోట్ల రామలీల అనే అభినయమూ నిర్వహిస్తారు. మన  ఖమ్మం జిల్లాలోని భద్రాచలంలో పూజాపునస్కారాలతో శ్రీరామనవమిని ఎంతో ఘనంగా నిర్వహిస్తారు. మహారాష్ట్రలోని దేవాలయాలలో శ్రీరాముని పుట్టుక వరకు గల రామాయణ కథను కీర్తనల రూపంగా గానం చేస్తుంటారు. ఉత్తర భారతంలో శ్రీరాముని జననం పురస్కరించుకుని జయంతి ఉత్సవాన్ని వైభవంగా జరుపుతారు.
యస్య రామాయణం వక్తే
యశ్య రామాయణం శ్రుతే
నైతాఖ్యా మప లోధన్యో
విద్యతే భువనత్రయే
– ఈ శ్లోకం రామాయణ మహిమను చెప్తుంది. ఎవరి నోట రామాయణం పలుకబడుతుందో, ఎవరిద్వారా రామాయణ కథ వినబడుతుందో వారి కంటే ధన్యులు ఈ చరాచర జగత్తులో మరొకరు ఉండరని దీని భావం.
నిత్యం రామనామ స్మరణకు భక్తి ప్రపత్తులతో వందనం చేసినా, రాముని గుణగణాలను కీర్తించినా, పట్టాభిరాముని భజించినా కలిగే పుణ్యం ఇంతా అంతా కాదు.
శ్రీరామనవమికి మిరియపు పొడి కలిపి చేసిన బెల్లపు పానకం నివేదించి స్వీకరించడం, నలుగురికీ ఇవ్వడం ఎంతో మంచిది. మరి రామనామ వైభవాన్ని వేనోళ్ళ కీర్తించి పానక ప్రసాదాన్ని సేవించి తరిద్దాం అందరం.
– నీరజా చంద్రన్

Send a Comment

Your email address will not be published.