సంక్రాంతి సంబరాలు

సంక్రాంతి సంబరాలు

18 సంవత్సరాల ప్రయాణంలో తన ఉనికిని తనకు తానుగా నిలబెట్టుకుంటూ ఎన్నో శిఖరాలు అధిరోహించి రెండు పదుల చీరకట్టు సింగారానికి సిద్ధమౌతోంది న్యూ జిలాండ్ తెలుగు సంఘం.  ఈ ప్రయాణంలో ఎంతోమంది తమ అమూల్యమైన కాలాన్ని వెచ్చించి తెలుగు వారంటే అభిమానంతో, తెలుగు భాషంటే మమకారంతో అందరినీ ఒకే త్రాటిపై నడిపించి అనన్య సామాన్యమైన సేవలందించారు.  ఇందుకు సమానంగా మరెంతోమంది తమ చేయూతనిచ్చి తెలుగు వారిని ప్రేమతో ఆదరించారు.

న్యూ జిలాండ్ క్రొత్తగా వెళ్ళినపుడు అప్పటి పరిస్థితులను బట్టి నేను వ్రాసిన కవిత(1997):

“తూర్పు వైపున వున్న పడమటి దేశం
భూతలానికి తలమానికం
కనుచూపు మేర పచ్చదనం
ఎటు చూసినా కనిపించరు జనం.

కనువిందైన పర్వత శ్రేణులు
వినుసొంపైన వీరుల గాధలు
విదివంచితులైన విదేశీ పౌరులు
విద్యార్ధులుగా మారిన దంపతులు

సామాన్య జీవనానికి ఇస్తారు భ్రుతి
నిండైన జీవితానికి లేదు శ్రుతి
వర్ణింప శక్యము కాని ప్రకృతి
ఇదే పలువురు పాలిటి వికృతి

కరుడుగట్టిన శీతాకాలం
దీనికి తోడు వర్షం
వేసవి కోసం ఎదురు చూసే జనం
మరల రాదనుకుంటున్నారు శీతలం”

ఇప్పుడు పరిస్థితులు వేరు.  కాలానుగుణంగా ఎన్నో ఒడిదుడుకులకు తట్టుకొని అక్కడి తెలుగువారు మేము సైతం ఈ ప్రపంచానికి దారి చూపగలం… అంటూ తెలుగువారి పతాకాన్ని ఎగురవేసి ఇతర ప్రాశ్చాత్య దేశాల్లోని తెలుగువారికి ఏమాత్రం తీసిపోకుండా ప్రతీ ఏటా సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహిస్తూ తరువాతి తరానికి తమవంతుగా మన సంస్కృతీ సంప్రదాయాలను అందించడంలో కృతకృత్యులైనారు.  ప్రస్తుతం తెలుగు బడిని సిలికానాంధ్ర మన బడి వారి సౌజన్యంతో నడపడం విశేషం.

శ్రీ డి.మధుసూదన రెడ్డి గారితో ప్రారంభమైన తెలుగువారి ప్రస్తానం నేటి జగదీశ్వర రెడ్డి పొట్లాల వరకూ నిరంతరం కొనసాగుతూ వస్తూంది.  ఈ ప్రస్థానంలో మొన్నటి సంక్రాంతి పండగ పర్వదినాన్ని పురస్కరించుకొని తెలుగువారి ప్రాభవాన్ని పరి పరి విధాలా చాటి చెప్పే ముగ్గుల పోటీలు నిర్వహించడం ఎంతో ముదావహం.  ఈ పోటీల్లో గెలుపొందినవారికి బహుమతులిచ్చి మంచి విందు భోజనంతో కార్యక్రమాన్ని ముగించి సంక్రాంతి పండగకు సాంప్రదాయ రీతిలో పతంగులెగురవేసి  క్రొత్త సంవత్సరానికి ఘన స్వాగతం పలికారు.

తెలుగు సంఘ నూతన అధ్యక్షులు శ్రీ జగదీశ్వర రెడ్డి పొట్లాల గారికి మరియు వారి కార్యవర్గానికి శుభాభినందనలు.  వారి అధ్వర్యంలో గత ఏడాది శ్రీ మగతల జగదీశ్వర రెడ్డి కార్యవర్గం లాగానే మరిన్ని భాషా ప్రాతిపదిక గల కార్యక్రమాలను నిర్వహించి తెలుగువారి బావుటాని మరింత ఉన్నత స్థితికి తీసుకేల్లగాలరని ఆశిద్దాం.

రెండు పదుల యుక్త వయస్సుకు దగ్గర పడుతున్న ఈ తెలుగు సంఘానికి మనందరం అభినందిద్దాం.

Send a Comment

Your email address will not be published.