సంగీత సమారోహం

Ragaamrutha 2
Ragaamrutha

రాగామృత వార్షికోత్సవాలు

భాషా, మతం, రంగు, రూపు, పరిధి, కాలం, కల్మషం లేనిది సంగీతం. పేరులోనే “స” అంటే మంచి “గీతం” అంటే ఆలాపన (పాట) వుండి మధుర స్వరాలతో మంచిని, మమతను ఎల్లలులేని మానవతా ప్రపంచానికి గీతాల రూపంలో అందివ్వడమే ధ్యేయం. భారతీయ శాస్త్రీయ సంగీతంలో కలికితురాయి కర్ణాటక సంగీతం బాణీగా ఎంచుకొని మన పూర్వీకులు అన్నమయ్య, త్యాగయ్య, దీక్షితార్, రామదాస అందించిన కీర్తనామృతాలు రాగామృతంగా, రమణీయంగా మెల్బోర్న్ పశ్చిమ ప్రాంతంలోని పాయింట్ కుక్, టార్నీట్, విందం వేల్ మొదలైన ప్రదేశాలలో నివసిస్తున్న మన తెలుగువారే కాకుండా భారతీయ సంతతికి చెందిన అనేక మంది పిల్లలకు అందిస్తున్న సమృద్ధి భాండాగారం రాగామృత సంగీత కళాశాల.
Ragaamrutha 5బహుళ సంస్కృతీ సంప్రదాయాల పుట్టినిల్లు ఆస్ట్రేలియా దేశంలో ప్రవాసీయులు తమ సంస్కృతిని మరు తరానికి అందివ్వాలంటే కత్తి మీద సామే. రోజుకి షుమారు ఎనిమిది గంటలు ఇక్కడ బడులలో కాలం గడిపి ఇంట్లో మన సంస్కృతిని నిలుపుకోవాలన్న తలిదండ్రుల తపనను చూసి అదే తరహాలో కొంత సమయాన్ని కేటాయించడం పిల్లలకు జోడెడ్ల బండిని నడిపే సవాలు. ఈ సవాలుని సంయమనంతో ఎదుర్కొని వారితో సంగీత సాధన చేయించడం తలిదండ్రులకు విషమ పరీక్ష. “నేనెందుకు నేర్చుకోవాలి?” అన్న ప్రశ్న ప్రతీ విద్యార్ధి అడగడంలో తప్పు లేదు. దానికి సమాధానంగా వారు చేసే సాధన పలువురు మెచ్చుకోవడానికి అవకాశం ఇవ్వడానికే రాగామృత వారు ప్రతీ ఏటా వారి సంగీత సమారోహం జరుపుకుంటారు. ఇప్పటికి ఐదు వసంతాలు నిండుకొని నిండైన సాంప్రదాయ సంగీతానికి నందనవనంలా రూపు దిద్దుకుంది. పిల్లలు పాడిన మోహన వర్ణం ప్రేక్షకులను మంత్ర ముగ్దుల్ని చేసింది.

ఈ కార్యక్రమానికి ప్రముఖ సంగీత విద్వాంసులు శ్రీ మురళీ కుమార్ ముఖ్య అతిధిగా విచ్చేసారు. గురు శిష్య పరంపర సంగీత స్వర మాధుర్యంతో అనిర్వచనీయమైన రీతిలో కొనసాగిస్తున్న శ్రీమతి మాధురీ వాస గారిని శ్రీ కుమార్ గారు అభినందించారు.

విక్టోరియన్ ముల్టీ కల్చరల్ కమీషనర్ శ్రీ చిదంబరం శ్రీనివాసన్ ఈ కార్యక్రమానికి ప్రత్యెక అతిధిగా విచ్చేసారు.

విందం సిటీ కౌన్సిల్ నుండి శ్రీ పీటర్ మేనార్డ్, శ్రీమతి హీధర్ మార్కస్ మరియు కౌన్సిలర్ శ్రీ బాబ్ ఫెయిర్ క్లో కూడా అతిధులుగా హాజరయ్యారు. మెల్బోర్న్ లోని ఎంతోమంది సంగీత కళాకారులు, విద్వాంసులు కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

అతిధులందరూ పిల్లల ప్రతిభాపాటవాలను మెచ్చుకుంటూ శ్రీమతి మాధురీ వాస గారి కృషి ఎంతో ప్రశంసనీయమని భారతీయ సంగీత సంస్కృతీ సాంప్రదాయాలు, విలువలు కాపాడుకుంటూ ముందు తరాలవారికి స్పూర్తినిస్తున్నారంటూ కొనియాడారు.

ఇందులో పాల్గొన్న పిల్లలకు మరియు అతిధులకు జ్ఞాపికలు అందజేసారు.

ఈ కార్యక్రమానికి చేయూతనిచ్చిన ఎంతోమంది కళాకారులు, స్వచ్చంద సేవకులకు, వ్యాపారవేత్తలకు, పిల్లలకు మరియు వారి తలిదండ్రులకు శ్రీ దీపక్ వాసా గారు కృతజ్ఞతాభినందనలు తెలియజేశారు. ఈ శతాబ్దంలో సంగీతం ప్రముఖ పాత్ర వహిస్తుందని, ఈ దిశగా రాగామృత కళాశాల తనవంతు కృషి చేస్తుందని వివరించారు.
Ragaamrutha 6

Send a Comment

Your email address will not be published.