సంగీత సామ్రాజ్ఞి

ms.subbulaxmi

సంగీత విదుషీమణి ఎం ఎస్ సుబ్బలక్ష్మి శత జయంతి సంవత్సరం ఇది. 1916 సెప్టెంబర్ 16 వ తేదీన మదురై (తమిళనాడు) లో జన్మించారు. 2004 డిసెంబర్ 11న తుదిశ్వాస విడిచారు. ఆమె పూర్తి పేరు మదురై షణ్ముఖ వడివు సుబ్బలక్ష్మి. ఆమె తల్లి షణ్ముఖ వడివర్ అమ్మాళ్ . తండ్రి సుబ్రమణ్య అయ్యర్. తల్లి వీణలో విద్వాంసురాలు. ఆమె బామ్మ అక్కమ్మాళ్ కూడా వయోలిన్ వాయించే వారు. ఆమె తల్లి దేవదాసీ తెగకు చెందిన వారు.
ఆమె సుప్రసిద్ధ సంగీత విద్వాంసురాలు. సంగీత కళాకారిణిగా భారతరత్న పొందిన మొట్టమొదటి మహిళ ఎం ఎస్ సుబ్బలక్ష్మి. అలాగే ఆసియాలో నోబెల్ బహుమతిగా భావించే రామన్ మెగసెసే అవార్డు అందుకున్న తొలి మహిళామణి ఆమె….

పిన్న వయస్సులోనే శాస్త్రీయ సంగీతం నేర్చుకోవడం మొదలుపెట్టిన ఎం ఎస్ సుబ్బలక్ష్మి సెమ్మంగుడి శ్రీనివాస అయ్యర్ దగ్గర తర్ఫీదు పొందారు.MS Subbulakshmi-Sadasivamపండిట్ నారాయణ్ రావు వ్యాస్ వద్ద హిందుస్తానీ సంగీతం అభ్యసించారు. కారైక్కుడి సాంబశివ అయ్యర్, ఎం సుబ్బరామ భాగవతార్, అరియకుడి రామానుజ అయ్యంగార్ తదితరులతో జరిపిన చర్చల ద్వారా కూడా ఆమె తన సంగీత జ్ఞానానికి మరింత మెరుగులు దిద్దారు.

ఆమె తన పదకొండవ ఏట మొదటిసారిగా ఓ సభలో నలుగురి ముందూ పాడారు. అది 1927 నాటి సంగతి. తిరుచిరాపల్లిలోని రాక ఫోర్ట్ ఆలయ ఆవరణలో ఈ సంగీత కార్యక్రమం జరిగింది. మైసూర్ చౌడయ్య వయోలిన్ మీద, దక్షిణామూర్తి మృదంగం మీద వాయిద్య సహకారం అందించారు. ఈ కార్యక్రమాన్ని అప్పటి భారత జాతీయ కాంగ్రెస్ నాయకుడు ఎఫ్ జీ నటేశ అయ్యర్ ఏర్పాటు చేసారు.

1936లో ఆమె మదురై నుంచి మద్రాసుకు మకాం మార్చారు. సినీ రంగానికి కూడా ఆమెను పరిచయం చేసింది కాంగ్రెస్ నాయకుడు ఎఫ్ జీ నటేశ అయ్యరే.

ఆమె పాడిన రికార్డు రూపంలో విడుదల అయ్యే నాటికి ఆమె వయస్సు పదేళ్ళు మాత్రమే.

ఆమె మద్రాస్ మ్యూజిక్ అకాడెమీలో 1929లో మొదటిసారి ప్రోగ్రాం ఇచ్చినప్పుడు ఎం ఎస్ వయస్సు పదమూడు సంవత్సరాలు. అప్పుడు ఆమె కొన్ని భజనలు ఆలపించి హర్షద్వానాలు అందుకున్నారు.
ఆమె లండన్, న్యూయార్క్, కెనడా, తదితర ప్రాంతాలను భారత సాంస్కృతిక దౌత్యవేత్తగా సందర్శించారు.

పందొమ్మిది వందల అరవై ఆరులో ఆమె ఐక్య రాజ్య సమితి సర్వసభ్య సమావేశంలో పాడి అందరినీ మైమరిపించారు.

1947-Meeraపందొమ్మిది వందల అరవై తొమ్మిదిలో ఆమె ఇండియన్ రైల్వేస్ అడ్వైసర్ ఎస్ ఎన్ వెంకర రావు తో కలిసి రామేశ్వరం సందర్శించి అక్కడి ఆలయంలో ప్రతి దైవ విగ్రహం వద్దా అనేక పాటలు ఆలపించారు.
పందొమ్మిది వందల తొంభై ఏడు లో భర్త కల్కి సదాశివం మరణించిన తర్వాత ఆమె బహిరంగ సభల్లో పాడటం మానేశారు.

ఆమె కొన్ని తమిళ చిత్రాలలో నటించారు. ఆమె మొదటిసారిగా 1938 మే రెండో తీదీన “సేవాసదనం” చిత్రంలో నటించారు. ఈ చిత్రంలో కథానాయకుడిగా ఎఫ్ జీ నటేశ అయ్యర్ నటించారు. ఆయన సరసన ఎం ఎస్ నటించారు.

1941లో వచ్చిన సావిత్రి చిత్రంలో ఆమె నారదుడి పాత్రలో నటించారు. ఈ చిత్రం ద్వారా లభించిన డబ్బును ఆమె తన భర్త స్థాపించిన కల్కి అనే తమిళ వార పత్రికకు వినియోగించారు.
1945లో ఆమె మీరా చిత్రంలో మీరా పాత్ర పోషించారు. ఈ చిత్రాన్ని 1947లో హిందీలో పునర్నిర్మించారు.

ఎం ఎస్ సుబ్బలక్ష్మి గురించి పండిట్ జవహర్ లాల్ నెహ్రు ఇలా చెప్పారు –
“నేను వొట్టి ప్రధాన మంత్రిని. ఆమె సంగీతానికి రాణి. సంగీత సామ్రాజ్ఞి ముందు నేను వొట్టి ప్రదానమంత్రినే” అని.

ఆమె ఆలపించిన భజగోవిందం, విష్ణు సహస్ర నామ స్తోత్రం, శ్రీ వెంకటేశ్వర సుప్రభాతం చిరస్మరణీయం.

తిరుమల తిరుపతి దేవస్థానం ఆమెను తమ ఆస్థాన విద్వాంసురాలిగా నియమించుకుంది. తిరుపతి అర్బన్ డెవలప్ మెంట్ అథారిటీ పూర్ణకుంభం సర్కిల్ లో ఎం ఎస్ సుబ్బాలక్ష్మి కాంస్య విగ్రహాన్ని నెలకొల్పగా దానిని 2006లో మే 28వ తేదీన అప్పటి ఆంద్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వై ఎస్ రాజశేఖర రెడ్డి ఆవిష్కరించారు.

Send a Comment

Your email address will not be published.