సంగీత సాహితీ సంకీర్తనం

250 చిత్రాలు, 9 నంది బహుమతులు, జీవితంలో ఊహించని మలుపులు, మలుపులన్నీ గెలుపులే. సామాన్యమైన భారతీయ పల్లెలో మొదలైన ప్రయాణం, దేశ సరిహద్దులు దాటి సంగీత సామ్రాజ్యంలో నింగిని తాకిన నేపధ్యం. ఎంత ఎదిగితే అంత ఒదిగి ఉండే మనస్తత్వం. తన పాట నలుగురూ విని ఆనందించాలన్న తాపత్రయం. ఆ తాపత్రయంలోనే పరవశించి పోవాలన్న ఆశయం. జనపదాల జానపదుల జయకేతనం. స్వరమధుర సంగీత సౌరభాల సాహితీ సంకీర్తనం. మానవత్వం మూర్తీభవించిన వ్యక్తిత్వం. నిలువెత్తునా కొలవలేని వినయం. ఆస్ట్రేలియాలో వందేమాతరం .

సంగీతమంటే శ్రీ వందేమాతరం శ్రీనివాస్ గారికి ప్రాణం అని వేరే చెప్పక్కర్లేదు. చిన్నతనంలో యాదృచ్చికంగా ఒక సంగీత పోటీకి వెళ్లి అంచలంచెలుగా ఎదిగి తాను పాడిన ఒక పాటనే ఇంటి పేరుగా మార్చుకున్న శ్రీ నివాస్ గారు ఆస్ట్రేలియాలోని బ్రిస్బేన్, సిడ్నీ మరియు మెల్బోర్న్ నగరాలలో స్వయంగా సంగీత విభావరిని నిర్వహించడం జరిగింది. కార్యక్రమానికి వచ్చిన వారంతా ఎంతో ఆనందించారనడంలో సందేహం లేదు. తాను సంగీత స్వరకల్పన చేసిన కొన్ని పాటలు, స్వయంగా పాడిన పాటలు, శ్రీ అందెశ్రీ మరియు గోరేటి వెంకన్న వంటి ప్రముఖ జానపద గీత రచయితలు వ్రాసిన పాటలు పాడి ప్రేక్షకుల్ని సంగీత సాగరంలో ముంచెత్తారు..

“నీ పాదం మీద పుట్టుమచ్చనై చెల్లమ్మా”, “వరుస మారుతున్న వందేమాతరం “, “పల్లె కన్నీరు పెడుతోందో, నా తల్లీ బందీ అయ్యిందో” ఇలా కొన్ని ప్రజల నాలుక మీద ఎప్పుడూ కదలాడి గుండెలోతుల్లో అణగారి ఉన్న భావాలకు అద్దంపట్టే ప్రాచుర్యం పొందిన గేయాలతో పాటు కొన్ని యుగళ గీతాలు పాడారు. ఎంతో ఓర్పు, సహనంతో షుమారు 4 గంటల కార్యక్రమాన్ని నిర్వహించిన శ్రీ వందేమాతరం గారు ఆదర్శ పురుషులు. క్రొత్తగా సినిమా రంగానికి వస్తున్న యువకులు వీరిని చూసి నేర్చుకోవలసింది ఎంతో వుంది.

శ్రీ వందేమాతరం గారు తనతో పాటుగా ఇక్కడ పాటలు పాడే కళాకారులను ప్రోత్సహించి తనతో పాడడానికి అవకాశం కల్పించడం ఎంతో శ్లాఘనీయం.

శ్రీ వందేమాతరం గారితో పాటుగా శ్రీ మిమిక్రీ శ్రీనివాస్ గారు కూడా వచ్చి తన మిమిక్రీ కళతో అందరినీ మెప్పించారు. వారు చేసిన వెంట్రిలాక్విజం ముఖ్యంగా పిల్లలను ఆకట్టుకుంది. అయితే మిమిక్రీ శ్రీనివాస్ గారు ద్విపాత్రాభినయం చేసారనడం సమంజసం. వారికి తెలుగు భాషా సాహిత్యంపై వున్న అభిమానంతో పోతన, శ్రీనాధుడు, పాల్కురికి సోమనాధుడు, పెద్దనామాత్యుడు మొదలైన మహా కవులను గుర్తు చేసే కొన్ని పద్యాలు చక్కగా పాడి సాహిత్యభిమానులను అలరించారు.

సిడ్నీ తెలుగు అసోసియేషన్ – 7-11-2015
సిడ్నీ తెలుగు అసోసియేషన్ అధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఈ క్రింద పేర్కొన్న స్థానిక రాజకీయ నాయకులు పాల్గొన్నారు
1. Ms. JULIA Dorothy FINN Member of Legislative Assembly, Granville
2. Dr. Geoff Lee, Member of Legislative Assembly, Parramatta
3. Dr. Hugh McDermott, Member of Legislative Assembly, Prospect
4. Sravya Abbineni – Strathfield electoral officer representing Jodi Mckay, Strathfield MP

ఈ కార్యక్రమంలో వనితా మండలి తరఫున శ్రీమతి శోభ వెన్నెలకంటి గారు కాన్సెర్ కౌన్సిల్ అఫ్ ఆస్ట్రేలియా వారికి $2500.00 అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి శ్రీమతి ప్రియా జూలూరు మరియు మాధవి ముదునూరి గార్లు వాచస్పతులుగా వ్యవహరించారు.

మెల్బోర్న్ – 15-11-2015
శ్రీ అనిల్ బైరెడ్డి గారి అధ్వర్యంలో మెల్బోర్న్ నగరంలో ఈ శ్రీనివాస్ ద్వయం సంగీత విభావరి మరియు హాస్యవల్లరి నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆస్ట్రేలియా తెలంగాణా సంఘం మరియు మెల్బోర్న్ తెలంగాణా ఫోరం అతిధులను ఘనంగా సత్కరించడం జరిగింది. శ్రీ వందేమాతరం శ్రీనివాస్ మరియు మిమిక్రీ శ్రీనివాస్ గార్లు ఇక్కడి తెలుగు భాషాభిమానులు మరియు సంగీతాభిమానులు చూపిన ఆతిధ్యానికి మంత్రముగ్డులై పేరు పేరునా కృతజ్ఞతలు తెలుపుకున్నారు.

స్థానిక సంగీత కళాభిమానులు శ్రీమతి రమణి బొమ్మకంటి, శ్రీమతి లలిత చింతలపాటి, శ్రీమతి లత చిగురాల శ్రీ రమణారెడ్డి కంజుల, అమరేందర్ రెడ్డి అత్తాపురం, శ్రీ మురళి ధర్మపురి శ్రీ శ్రీనివాస్ గారితో పాటలు పాడారు.

 

 

Send a Comment

Your email address will not be published.