అవును, జాతిపిత గాంధీజీ జీవితం అన్నివిధాలా ఆదర్శప్రాయమే. ఇక్కడ ఒకటి రెండు సంఘటనలు చెప్పుకుందాం.
మన దేహంలో పుండు లేనంత వరకు నీ మీద ఒకరు ఉప్పు చల్లినా మండేది లేదు. మన మీద తప్పు లేనప్పుడు ఇతరుల విమర్శలకు మనం బాధ పడాల్సిన అవసరం లేదు అని చెప్పడానికి ఈ సంఘటన చూడండి…
గాంధీజీ సబర్మతి ఆశ్రమంలో ఉన్నప్పుడు ఇద్దరు యువతుల భుజాల మీద చేతులు వేసుకుని నడిచేవారు. ఈ దృశ్యాన్ని చూసిన పలువురు అనేకరకాలుగా విమర్శించారు. ఆ విమర్శలకు గాంధీజీ మనసు నొచ్చుకుంది.
“న మనసులో ఏ విధమైన దురభిప్రాయమూ లేదు. నాకు మనవరాలిలాంటి వయసున్న ఆ అమ్మాయిల భుజాల మీద చేతులు వేసుకుని నడవడాన్ని వాళ్ళు తప్పుగా అర్ధం చేసుకున్నారు కదా” అని గాంధీజీ బాధ పడ్డారు.
తన మానసిక బాధను తెలుపుతూ గాంధీజీ రాజాజీకి (భారత దేశ చివరి గవర్నర్ జనరల్) కు ఒక ఉత్తరం రాశారు.
ఆ ఉత్తరాన్ని చదివిన రాజాజీ గాంధీజీకి ఇలా రాశారు –
“మీరు ఎంత నిజాయితీపరులో, పరిశుద్ధ మనస్కులో ఇతరుల కన్నా మీకే బాగా తెలుసు. ఇతరులు తప్పుడు విమర్శలకు మీరు బాధ పడాల్సిన అవసరం లేదు. ఒకవేళ మీరు ఆ విమర్శలకు విలువ ఇచ్చి బాధ పడితే వాళ్ళు చెప్పింది నిజమే అని అనిపిస్తుంది. కనుక ఎదుటి వారి తప్పుడు విమర్శలను అసలు పట్టించుకోకండి…”
రాజాజీ చెప్పిన విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఆ రోజు నుంచి ఇతరుల విమర్శలను గాంధీజీ పట్టించుకోలేదు. ఇతరుల విమర్శలను తలచుకుని మీరు బాధ పడితే ఒక్క రోజు కూడా మీరు సంతోషంగా ఉండలేరు అనేదే ఈ సంఘటన చెప్తోంది.
మరొక సంఘటనకొద్దాం….
గాంధీజీ దక్షిణాఫ్రికాలో ఉన్న రోజుల్లో జరిగిన సంఘటన….
ఒకరోజు ఆయన రైలు ఎక్కడం కోసం వేగంగా వస్తున్నారు. ఆయన పరిగెత్తుకుంటూ వచ్చి రైలు ఎక్కేటప్పుడు ఎడం కాలి చెప్పు జారి కింద పడిపోయింది. రైలు వేగంగా పోతోంది. గాంధీజీ ఏ మాత్రం ఆలస్యం చెయ్యకుండా కుడి కాలి చెప్పు కూడా తీసేసి తను ఎక్కడైతే ఎడమ కాలి చెప్పు కోల్పోయారో దానికి దగ్గరలో ఆ రెండు చెప్పునీ విసిరేశారు.
రైలు బోగీలో ఆయనతో పాటు ప్రయాణిస్తున్న వారికి గాంధీజీ చర్య విచిత్రంగా అనిపించింది.
ఒక ప్రయాణీకుడు ఉండబట్టలేక ఆయన దగ్గరకు వెళ్లి “మీరు రెండో చెప్పు అలా ఎందుకు విసిరారు?” అని అడిగారు.
అప్పుడు గాంధీజీ ఇలా జవాబిచ్చారు –
“అయ్యా, రైలు ఎక్కుతున్నప్పుడు నా ఎడమ కాలి చెప్పు జారి పడి పోయింది. దానిని నేను కిందకు దిగి తియ్యలేను. అప్పుడు నేను కుడి కాలు చెప్పు మాత్రం నా దగ్గర ఉంచుకోవడం అర్ధంలేనిది. ఉపయోగం లేనిది. కనుక చేజార్చుకున్న చెప్పు దగ్గరే ఈ రెండో చెప్పు కూడా వదిలేస్తే ఆ దారిలో వచ్చే వారెవరికైనా ఆ రెండు చెప్పులూ కనిపిస్తే వాళ్ళకైనా అవి వేసుకుని నడవటానికి ఉపయోగపడతాయి కదా …” అని.
ఇతరులకు ఉపయోగపడాలన్న ఆలోచనే ఆయనను మహాత్ముడిగా నిలిపింది.
ఇంకొక సంఘటన…
ఇది కూడా ఆయన దక్షిణాఫ్రికాలో ఉన్నప్పుడు జరిగిన విషయమే…
ఒకసారి ఆయన జుత్తు కత్తిరించుకోవడానికి సెలూన్ కి వెళ్ళారు. ఆ సెలూన్ లో జుత్తు కత్తిరించే వ్యక్తి శ్వేత జాతీయుడు. దానితో ఆయన భారతీయుడైన గాంధీజీకి క్రాఫ్ చేయడానికి తిరస్కరించారు.
శ్వేత జాతీయుడి చర్యతో నొచ్చుకున్న గాంధీజీ శ్వేత జాతీయుల వర్ణ వివక్ష అహంకారం రూపుమాపే వరకు దక్షిణాఫ్రికాలో క్రాఫ్ చేసుకోకూడదని మనసులో అనుకున్నారు.
అంతేకాదు, వెంటనే ఒక దుకాణానికి వెళ్లి జుత్తు కత్తిరించుకోవడానికి ఒక కత్తెర కొన్నారు.
ఇంటికి వచ్చి అద్దం ముందు కూర్చుని తనకు తానే క్రాఫ్ చేసుకున్నారు. అయితే జుత్తు ఎగుడు దిగుడుగా కత్తిరించుకున్నారు. అందుకు ఆయన బాధపడలేదు.
మరుసటి రోజు ఆయన అలాగే న్యాయస్థానానికి వెళ్ళారు. గాంధీజీ తలను చూసి అందరూ పగలబడి నవ్వారు.
ఒక న్యాయవాది అవహేళన చేస్తూ “ఏమిటి గాంధీ, నిన్న రాత్రి ఎలుకల వలలో తలపెట్టుకుని పడుకున్నారా ఏమిటీ? ఎలుకలు మీ జుత్తుని ఇష్టమొచ్చినట్టు కొరుక్కు తిన్నట్టున్నాయి. జుత్తు చూసుకోలేదా అద్దంలో.” అని నవ్వాడు.
ఆయన మాటలు విన్న గాంధీజీ “నేను భారతీయుడినని క్రాఫ్ చేయడానికి ఓ శ్వేత జాతీయుడు తిరస్కరించారు. కనుక నేనే ఇంట్లో క్రాఫ్ చేసుకున్నాను. జాత్యహంకారంతో ఏర్పడిన అవమానం కన్నా ఇలా అడ్డదిడ్డంగా కత్తిరించుకున్న జుత్తు వల్ల కలిగే అవమానం నాకు పెద్దగా అనిపించలేదు…” అని జవాబిచ్చారు.
అవమానం చెందాల్సింది జాత్యహంకారంతో ప్రవర్తిస్తున్న వాళ్ళే తప్ప ఇంట్లో జుత్తు కత్తిరించుకున్న నేను కాదు అని గాంధీజీ చెప్పిన మాట ఆలోచనలో పడేసింది అక్కడున్న వారిని.
పోరాటమే జీవితం….నకిలీ గౌరవం దేనికీ? సత్యమే నిజమైన సంస్కృతి, ఆయుధం అని గాంధీజీ తన జీవితంలో ఆచరించి చూపిన ఇలాంటి సంఘటనలు లెక్కలేనన్ని ఉన్నాయి. అందుకే ఆయన జీవిత చరిత్రకు అంత ప్రాధాన్యం వచ్చింది.