సత్వ- రజో గుణాలు

వేల ఏళ్ళ క్రితం ఈ కార్తికమాసం లోనే జరిగిన అంబరీషుడి కధ తెలియనిది ఎవరికీ? దానిలో నేర్చుకునే విషయాలే తేలీదు మనలో చాల మందికి.కధ క్లుప్తంగా:

మధువనంలో ఒక ఎడాది పాటు శ్రీహరి గూర్చి వ్రతం ఆచరించిన అంబరీషుడు, కార్తిక శుద్ధ ద్వాదశి నాడు పారణ (పవిత్ర భోజనం) తో ముగించనున్నాడు. సరిగా అదే సమయానికి దూర్వాసుడు వస్తే, “భొజనానికి రండి” అని పిలిచాడు అంబరీషుడు….
దూర్వాసుడికి అనుమానం – ‘పిలవాలని పిలిచాడా? లేక అలా పోతూంటే పిలిచాడా?’ అని. పైకి మాత్రం – “ఆ! అలాగే. ఇదిగో, స్నానం చేసి వస్తా” అని, తన ప్రాణాయామ విద్యతో యమునలో ములిగి కూర్చున్నాడు దూర్వాసుడు. ఎంతకీ బయటకి రాకపొయేసరికి అంబరీషుడు సంకటం లో పడ్డాడు. “వచ్చిన వాడు అతిధి. అందులోనూ దూర్వాసుడు. ఆయనకి భోజనం పెట్టకుండా తాను తింటే ఇక అంతే! తిధి దాటితే, ఓ ఎడాది పాటు చేసిన వ్రతం అంతా వృధా! ఎలా?” అని.ఇక 24 నిమిషాలలో ద్వాదశి ఘడియలు ముగుస్తూఉంటే, అంబరీషుడు తన చుటూ ఉన్న ఋషులని “ఎం చెయ్యాల”ని అడిగాడు.

“కేశవ నామాలని పఠిస్తూ 3 సార్లు ఆచమనం చేస్తే, అటు తిన్నట్లూ కాదు – ఇటు తిననట్లూ కాదు” అని చెప్పారు. “అలాగే” అని ఆచమనం చెయ్యగానే దూర్వాసుడు రానే వచ్చాడు.

“అతిధిని, నన్ను పిలిచి, నాకు పెట్టకుండా భొంచేస్తావా! నన్ను అవమానిస్తావా!!” అని తన జఠ ని నేలమీద కోపంగా కొట్టగా దాంట్లొంచి ‘కృత’ అనే రాక్షసి అంబరీషుని మీదకి రాసాగింది. శ్రీమహావిష్ణు సుదర్శనం ‘కృత’ ని చంపి, దూర్వాసుని వెంటపడింది. పరిగెత్తి త్రిమూర్తులని ప్రార్థ్హించాడు. “లాభం లేద”అన్నారు. తిరిగి అంబరీషుని కాళ్ళ మీద పడ్డాడు. విష్ణువుని ప్రార్థించి సుదర్శనాన్ని వెనక్కితగ్గమని, అంబరీషుడు దూర్వసుడిని రక్షించాడు.

తెలుసుకొవలిసింది ఏంటి?
1. సత్వగుణంతో ఉండాల్సిన బ్రాహ్మణుడు రజోగుణం తో నష్టపొయాడు.
2. రజోగుణంతో ఉండాల్సిన క్షత్రియుడు సత్వగుణం వల్ల లాభించాడు.
3. విష్ణువుని సరిగా ఆరాధిస్తే, ఆయన తన ఆయుధాన్నే మనకి ఇచ్చేస్తాడు.
4. ఆ సత్వ గుణానికే మెచ్చి విష్ణువు సుదర్శనాన్ని అంబరీషునికి ఇస్తే, అవసరం వచ్చినా వాడుకొనివాడు అంబరీషుడు; అవసరం లేకపొయినా, అవసరాన్ని తెచ్చుకొని మరీ ఇబ్బంది పడింది దూర్వాసుడు.
5. విష్ణుభక్తుణ్ణి పరీక్షిస్తే, పరీక్షించినవాడు పరాజ్యం పాలౌతాడు.గెలుపు ఖత్చితంగా అంబరీషునిదే! అంటే సత్వ గుణానిదే!

దూర్వాసుని వైపునుండి చూద్దాం.
దూర్వసునికి వ్రతం తరువాత ‘పారణ’ గురించి తెలియదా? తెలుసు.
తిధి ఎప్పుడు ముగుస్తుందో తెలియదా? తెలుసు.
3 సార్ల ఆచమనం గురించి తెలియదా? తెలుసు.
అంబరీషుడు పరమ విష్ణుభక్తుడని తెలియదా? తెలుసు.
అతని దగ్గర సుదర్శనం ఉందని తెలియదా? తెలుసు.
మరి ఎందుకు అలా చేసాడు?

కోపం. విపరీతమైన కోపం.
ఏం మాట్లాడుతున్నామో,
ఎంత మాట్లాడుతున్నామో,
ఎవరితో మాట్లాడుతున్నామో,
ఎందుకు మాట్లాడుతున్నామో తెలియనంత,
“తర్వాత చూసుకుందాం” అనుకునేంత,
పట్టలేనంత, తానూ పట్టుకొలేనంత… కోపం. కోపం. కోపం.

ఎందుకొచ్చిందీ కోపం? అనుమానం తో, అవమానం తో.

అంబరీషుడు అనుమానించాడా? లేదే!
అంబరీషుడు అవమానించాడా? లేదే!
అన్నీఉన్న విస్తరి లా అణిగిమణిగి ఉన్నాడు. మరి?

తనకి తాను అంబరీషుడిని అనుమానించి, తనకి తాను అంబరీషుడు అవమానించాడనీ తనకి వచ్చిన కోపం. అదే.. ‘తన కోపం’.

“హట్ట్… ఢాం… ఢీం… నువ్వెంత?? నీ వాళ్ళెంత?? నేను తలుచుకుంటే… అంతే! నేనేమిటొ చూపిస్తా!” అనే ‘దూర్వాసులు’ మన చూట్టూ ఉన్నారు. మన ఇంట్లో వాళ్ళో, లేక మనమే అవ్వచ్చు కూడా!

సత్వగుణం వల్ల సాధించేది “ఎంతో మిన్న”, కోపం వల్ల సాధించేది…”నిండు సున్న” అని కోపం తగ్గాక నెమ్మదిగా ఈ విశ్లేషణతో చెప్పండి. పైసారికైనా జాగర్త పడగలరు.

(Article by : Mylavarapu Srinivasa Rao)

1 Comment

  1. శ్రీనివాస రావు గారు, అద్భుతమైన వివరణ గలిగిన పురాణ ఇతిహాస నేపధ్యాన్ని తెలియపరచిన మీకు ధన్యవాదాలు… సదా మీరు ఇంటువంటి విషయాలను మాతో తెలుగు మల్లి ద్వారా పంచుకొంటారని ఆశిస్తున్నాము… రుద్ర, కాన్బెర్ర.

Send a Comment

Your email address will not be published.