సమాజ సేవే సాత్వికం

Nandini-ATAప్రవాసంలో నివాసం మలుపులతో కూడుకున్న జీవితం. ప్రతీ మలుపులో ఏదో ఒక క్రొత్తదనం. ప్రతీ క్రొత్తదనం జీవితంలో ఒక సమరం. సమస్యల వలయాన్ని చేదించడంలో అవధులులేని ఆనందం. మరు తరానికి ఒక ఆదర్శం. తెలుగువారి అడపడుచుగా తరతరాల పరంపరకు అభినివేశం. మెల్బోర్న్ నగరంలో తెలుగుబిడ్డ గొప్పతనం.

వేల మైళ్ళ దూరంలో వుండి పరసంస్కృతితో సహజీవనం చేస్తూ మన సంస్కృతికి పట్టంగట్టి “ప్రవాస స్త్రీ శక్తి” పురస్కారాన్ని అందుకున్న కధనమిది.

Nandini ATAబహుళ సంస్కృతీ సాంప్రదాయాలకు పట్టంగట్టే ఆస్ట్రేలియా దేశంలో భారతీయ సంతతికి చెందిన ఎంతోమంది ప్రవాసీయులు సామరస్య జీవనానికి శ్రీకారం చుట్టాలని వచ్చినపుడు ఈతిబాధలు తప్పవుకదా! వచ్చిన క్రొత్తలో ఎవరైనా చేయూతనిస్తే త్వరగా తమ కాళ్ళపై నిలదొక్కుకోవాలన్న ఆశతో ఎదురుచూసే అభాగ్యులు ఎందరో. ఊతమిచ్చి ఊరించే వారు మాత్రం కొందరే. వారిలో పేరు నిలుపుకున్నవారు శ్రీమతి నందిని బిస్కుంద.

2008లో ఆస్ట్రేలియాలోని సుందర నగరం మెల్బోర్న్ చేరుకొని వచ్చిన క్రొత్తలో అందరిలాగే స్థిర నివాసం ఏర్పరచుకోవడానికి కొంత కష్టపడి, కష్టంలో కొన్ని మెలుకువలు నేర్చుకుని ప్రతీ మలుపుని గెలుపుగా మార్చుకొని క్రొత్తవారికి సహాయపడుతున్నారు శ్రీమతి నందిని. అంతేకాకుండా తెలంగాణా సాంప్రదాయ పండగ “బతుకమ్మ” మొదటిసారి కొంతమంది స్నేహితులతో కలిసి మెల్బోర్న్ లో జరపడానికి నాంది పలికిన సుదతి నందిని. అలా మొదలైన బతుకమ్మ ఇప్పుడు మెల్బోర్న్ తెలంగాణా ఫోరం అధ్వర్యంలో మెల్బోర్న్ నగరానికే వన్నె తెచ్చే పూల పండగగా తీర్చిదిద్దుకుంది. దీనికి శ్రీ అనిల్ దీప్ గౌడ్ గారు ఎంతో ప్రోత్సాహన్నిచ్చారని చెప్పారు. మెల్బోర్న్ తెలంగాణా ఫోరం సంస్థాపక అధ్యక్షులు శ్రీ నూకల వెంకటేశ్వర రెడ్డి గారు కూడా చాలా ప్రోత్సాహాన్నిచ్చి మొదటి కార్యవర్గంలోనే సభ్యులుగా స్థానం కల్పించినందుకు శ్రీమతి నందిని గారు కృతజ్ఞతలు తెలిపారు. శ్రీమతి నందిని గారు మెల్బోర్న్ తెలంగాణా ఫోరం ప్రస్తుత కార్యవర్గంలో ఉపాధ్యక్షులుగా వున్నారు. కార్యవర్గ సభ్యులు, శ్రేయోభిలాషులు ఇంకా ఎంతో మంది ప్రోద్భలంతో ఈ పురస్కారం లభించిందని వారందరికీ పేరుపేరునా ధన్యవాదాలు తెలుపుకున్నారు.

అయితే దీనికంతటికీ స్పూర్తి ప్రదాత నాన్నగారు శ్రీ వివేకానంద గారని నందినిగారంటారు. నాన్నగారు చిన్నప్పుడు నూరిపోసిన కొన్ని సుగుణాలు ముఖ్యంగా సమాజ సేవ నరనరాల జీర్ణించుకుపోయి సేవా దృక్పధాన్ని మరింత పెంచింది. తల్లి శ్రీమతి శ్యామల గారు ఉపాధ్యాయ వృత్తిలో తన ధర్మాన్ని నిర్వర్తించి పిల్లలకందించిన “సేవా తత్పరత” సమాజ బాధ్యతను గుర్తెరిగేలా తీర్చిదిద్దిందని తల్లిపైనున్న వాత్సల్యాన్ని మననం చేసుకున్నారు నందినిగారు.

తన కుటుంబంలో చాలామంది విద్యా బోధకులే కావడం వలన “నేను” అనేది జీవితంలో పావు మాత్రమేనని మిగిలిన ముప్పావు సమాజమేనన్న చక్కని విషయాన్ని అందించడంలో కృతకృత్యులయ్యారని నందిని గారు చెప్పారు. దానికి తగ్గట్టుగానే మెల్బోర్న్ లో తనకు దొరికిన ఉద్యోగ బాధ్యతలు కూడా ఈ త్రోవకి చెందినవి కాబట్టి తోటివారికి సాయపడడం అనేది జీవితంలో ఒక భాగమైపోయింది. తెలుగు, ఆంగ్ల భాషలతో పాటు హిందీ తమిళ భాషలు కూడా మాట్లాడగలగడం వలన చాలామంది తెలుగు రాష్ట్రేతరులు సహాయార్ధం వస్తుంటారని వారికి CV తో బాటుగా అనేక రకాలుగా సలహాలిచ్చి సహాయం అందించడం జరుగుతుందని నందిని గారు చెప్పారు.

తన కుటుంబ పరివారంలో శ్రీవారు శ్రీ ప్రవీణ్ కుమార్ గారు ఎంతో ప్రోత్సాహాన్నిచ్చి సహాయసహకారాలందిస్తూ వుంటారు. వీరికి పదిహేనేళ్ళ కొడుకు ఉజ్వల్ ఉన్నాడు.

ఇక ముందు క్రొత్తగా వచ్చేవాళ్ళకు ఉపయోగపడే విషయాలన్నీ ఒక మొబైల్ అప్లికేషనులో ఉంచి వారికి సహాయపడేలా పధకాన్ని రూపొందిస్తున్నట్లు శ్రీమతి నందిని గారు చెప్పారు.

Send a Comment

Your email address will not be published.