సమ్మె ఎటు పోతోంది?

ఆంధ్రప్రదేశ్ విభజనపై కేంద్రం నిర్ణయం తీసుకున్న తరువాత నుంచీ రాష్ట్రం సీమాంధ్ర ప్రాంతంలో సమైక్యాంధ్ర కోరుతూ ప్రారంభమయిన ఆందోళన 70వ రోజుకు చేరుకుంది. ఈ ఆందోళనలో విద్యుత్ ఉద్యోగులు కూడా చేరడంతో ప్రజల పరిస్థితి మరీ అధ్వానంగా తయారయింది. విద్యుత్తు లేనందువల్ల ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే రైళ్లకు ఇబ్బందులు మొదలయ్యాయి. ఈ సమస్యను త్వరగా పరిష్కరించాలని కోరుతూ కేంద్రం వద్దకు రాయబారం వెళ్ళే వారి సంఖ్యా పెరిగింది.

ఇది ఇలా ఉండగా, రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు డిల్లీలో ఆమరణ నిరాహార దీక్ష ప్రారంభించారు. ఆయనకు పోటీగా వై.ఎస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి కూడా హైదరాబాదులో దీక్ష మొదలుపెట్టారు. ఏపీ ఎన్జీవోల సంఘం అధ్యక్షుడు అశోక్ బాబు హడావిడిగా ముఖ్యమంత్రిని కలిసి సమ్మెను విరమించడంపై చర్చించారు. ప్రస్తుతం రాష్ట్ర ప్రజలందరి దృష్టీ సమ్మె మీద ఉందనీ, సమ్మెను విరమిస్తే ప్రజల దృష్టి చంద్రబాబు నాయుడు, జగన్మోహన్ రెడ్డిల మీదకు వెడుతుందని ముఖ్యమంత్రి ఆయనకు చెప్పారు. ఫలితంగా సమ్మెను కొనసాగించడానికే అశోక్ బాబు నిర్ణయించారు. దీక్షల్ని విరమించిన తరువాత సమ్మెను విరమించే అవకాశం ఉంది.

కాగా, ఇటీవల ముఖ్యమంత్రి కేంద్రంపై ప్రశ్నలు సందిస్తుండడం కేంద్రాన్ని ఇబ్బంది పెడుతోంది. నదీ జలాలు, సహజ వనరుల పంపకం వంటి విషయాలను ముందుగా తేల్చిన తరువాతే, విభజన సంగతి ఆలోచించాలని ముఖ్యమంత్రి మళ్ళీ కేంద్రానికి సూచించారు. అప్పటి నుంచి కేంద్రం ఆయనను మార్చే ఆలోచన చేస్తోంది. ఈరోజు జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ పై చర్చ జరిగిందనీ, అయితే కేంద్రం ఈ చర్చల వివరాలను బయటపెట్ట వద్దని నిర్ణయం తీసుకుందనీ తెలిసింది. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించడం గురించి ఈ సమావేశంలో కొద్దిపాటి చర్చ జరిగినట్టు ఎస్. జైపాల్ రెడ్డి మాటలను బట్టి తెలుస్తోంది. బహుశా వారం రోజుల్లో దీనిపై తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధి, ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధి ఆంధ్రప్రదేశ్ సమస్య పరిష్కారం మీద పూర్తిగా జైపాల్ రెడ్డి సహాయ సహకారాలే తీసుకుంటున్నట్టు రాష్ట్ర మంత్రులు చెబుతున్నారు. రాష్ట్ర విభజనకు సోనియాను ఒప్పించింది ఆయనేనని చెబుతున్నారు. ఇప్పుడు కూడా ఆయనే రాష్ట్రపతి పాలనకు కేంద్రం మీద, అంటే సోనియా గాంధీ మీద ఒత్తిడి తెస్తున్నట్టు తెలిసింది.

Send a Comment

Your email address will not be published.