సర్వమంగళ శుభప్రద వరలక్ష్మి వ్రతం

మెల్బోర్న్ నగరంలో మన తెలుగువారు అత్యంత భక్తీ శ్రద్ధలతో చేసే పూజల్లో “వరలక్ష్మి వ్రతం” ఒకటి.  ప్రతీ సంవత్సరం తూ. చ. తప్పకుండా ఈ వ్రతాన్ని పాటిస్తున్న వారిలో గ్లెన్ వావేర్లీ లోని తెలుగు కుటుంబాలు ముందుంటాయి.  అయితే ఈ సంవత్సరం కొన్ని కుటుంబాలు సామూహికంగా శ్రీ ప్రసాద్ పిల్లుట్ల గారి గృహంలో జరుపుకోవడం అత్యంత ఆనందదాయక మైన విషయం.  ఈ సందర్భంగా తెలుగుమల్లి ప్రత్యెక వ్యాసం.

శ్రీ వరలక్ష్మీ నమస్తు వసుప్రదే సుప్రదే
శ్రీ సారసపదే రసపదే
సపదే పదే పదే
శ్రీ వరలక్ష్మీ నమస్తుభ్యం
భావజా జనక ప్రాణ వల్లభే
సువర్ణాభే భానుకోటి సమాన ప్రభే సులభే
సేవక జనపాలినీ శ్రిత పంకజమాలినీ
కేవల గుణశాలినీ కేశవహృత్కేళినీ
శ్రావణ పౌర్ణమి పూర్వస్థ శుక్రవారే
చారుమతే ప్రభ్రుతిభిహ పూజితాకారే
దేవాది గురుగుహ సమర్పిత మణిమయ హరే
దీనజన సంరక్షణ నిపుణ కనక దారే
భావనా భేద చతురే సన్నుత వరే
కైవల్య వితరణ పరే కామ్క్షిత ఫలప్రదకరే
– ఇది ముత్తుస్వామి దీక్షితుల వారు వరలక్ష్మీ వ్రతం మీద రాసిన కృతి.

లక్ష్మీ దేవిని నిండు మనసుతో పూజించే వ్రతం స్త్రీలకు ప్రత్యేకించి చెప్పబడినది. శ్రావణ మాసంలో చేసే ఈ వరలక్ష్మి వ్రతం పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారం నాడు జరుపుకుంటారు. అయితే శ్రావణ మాసంలో వచ్చే నాలుగు శుక్రవారాల్లోనూ ఏ ఒక్క శుక్రవారమైనా ఈ వ్రతాన్ని చేసుకోవచ్చు. సాధారణంగా శ్రావణ మాసంలో రెండో శుక్రవారం నాడు ఈ వ్రతాన్ని ఎక్కువ మంది చేసుకుంటారు. ఆ రోజు కుదరని పక్షంలో మిగిలిన శుక్రవారాల్లో కూడా ఈ వ్రతాన్ని ఆచరించవచ్చు. వరాలిచ్చే వరలక్ష్మి వ్రతాన్ని దక్షిణాదిలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణా, కర్నాటక, తమిళ నాడు రాష్ట్రాలలో ఘనంగా నిర్వహిస్తారు. మహాలక్ష్మి ఉపదేశాన్ని పొందిన చారుమతీ దేవి ప్రచారానికి తెచ్చిన వ్రతమిది.

వరలక్ష్మి వ్రతాన్ని ముఖ్యంగా పెళ్ళైన మహిళలు కుటుంబ సభ్యుల సంక్షేమం కోసం, అందులోను తమ తమ భర్తల సౌభాగ్యం, సిరిసంపదల కోసం చేస్తారు. ఆ రోజు వరలక్ష్మిని పూజించడం అంటే అష్ట లక్ష్మిని కొలవడంతో సమానమని అంటారు. అష్ట లక్ష్ములు అంటే ధన లక్ష్మి, ధాన్య లక్ష్మి, ధైర్య లక్ష్మి, రాజ్య లక్ష్మి, జయ లక్ష్మి, జ్ఞాన లక్ష్మి, సంతాన లక్ష్మి, శౌర్య లక్ష్మి. శోర్య లక్ష్మినే వీర లక్ష్మి అని కూడా అంటారు.

అది మగధ రాజ్యం. ఆ రాజ్యంలోని కుండిన అనే పట్టణంలో చారుమతి అనే స్త్రీ ఉండేది. ఆమె వివాహిత. కుటుంబం పట్ల ఆమెకున్న భక్తికి మెచ్చి మహాలక్ష్మి కలలో ప్రత్యక్షమై “వర లక్ష్మి”ని పూజించమని చెబుతుంది. వరలక్ష్మి అంటే అష్ట ఐశ్వర్యాలకు ప్రతీక. మరుసటి రోజు పొద్దున్నే చారుమతి నిద్రలేచీ లేవడంతోనే కుటుంబసభ్యులకు వారు అందించిన ప్రోత్సాహంతో వరలక్ష్మి పూజ చేస్తుంది. పట్టణంలోని ఎందరో మహిళలు ఆమెతో కలిసి లక్ష్మీ పూజ చేస్తారు. లక్ష్మీదేవికి సద్భక్తితో వ్రతమాచరిస్తారు. తీపి పదార్ధాలు నైవేద్యం పెడతారు. సాధారణంగా కలశం చేసి అందులో పసుపు పూసి కుంకుమనే నేత్రాలుగా చేసి బొట్టు పెట్టిన ఓ కొబ్బరి కాయ ఉంచి ఆ కలశానికి చీర కడతారు. పువ్వులతో, ఆభరణాలతో అలంకరిస్తారు. పూజ చేసే వారందరూ తప్పని సరిగా తోరం కట్టుకుంటారు. పూజ అయిన తర్వాత ఇరుగు పొరుగు స్త్రీలకు తాంబూలాలు ఇస్తారు. ముఖ్యంగా సెనగలు ఇవ్వడం ఆనవాయితి.

ఇక్కడే ఓ కథ చెప్పుకోవడం కద్దు. ఓ సారి పార్వతీపరమేశ్వర్లు పరమపథం ఆడుతుంటారు. నిబంధల ప్రకారం ప్రతి సారి పార్వతీ దేవి గెలుస్తూ ఉంటుంది. అయితే పరమేశ్వరుడు ప్రతి సారి తనదే విజయమని చెప్పుకుంటూ ఉంటాడు. దాంతో పార్వతి ఒక న్యాయనిర్ణేతను ఏర్పాటు చేసుకుని గెలుపెవరిదో చూద్దామని చెబుతుంది. అప్పుడు పరమేశ్వరుడి సృష్టి అయిన చిత్రనేమి న్యాయనిర్ణేతగావ్యవహరిస్తాడు. అయితే చిత్రనేమి ఎప్పుడూ పరమేశ్వరుడి వైపే మాట్లాడుతాడు. దాంతో పార్వతికి కోపం వస్తుంది. చిత్రనేమిని శపిస్తుంది. కుష్టురోగిగా అవస్థలు పదాలని శపిస్తుంది. చిత్రనేమి తనను క్షమించమని ప్రాదేయపడతాడు.
అప్పుడు పార్వతి దేవి శాంతించి వరలక్ష్మి వ్రతం చేస్తే కుష్టు నయమవుతుందని ఓ మార్గం చెబుతుంది. అప్పుడు చిత్రనేమి లక్ష్మి పూజ చేసి విముక్తి పొందినట్టు ఓ కథ వాడుకలో ఉంది.

వెంకట పార్వతీశ్వర కవులు శ్రావణ శుక్రవార వ్రతం పురస్కరించుకుని ఓ పద్యంలో ఇలా చెప్పారు …

శ్రీల జెలు వొందుటకు సువాసినులొనర్చు
శ్రావణీశుక్రవార పూజలకు నలరు
నమ్మహాలక్ష్మి శుభ దృష్టి నవతరించు
నమృత వీచికల శుభంబు నార్చుగాత …

శ్రావణ వరలక్ష్మి పూజ కొత్త నగతో చేసే సంప్రదాయముంది. కొత్తగా పెళ్ళైన మహిళలకు అత్తవారింట శ్రావణ తగవు అని ఆభరణాలు ఇస్తారు. కొన్ని ప్రాంతాలలో దీనిని శ్రావణ పట్టీ అని కూడా అంటారు.

ఈ శ్రావణ మాసంలో శుక్రవారం నాడు ఆచరించే వ్రతంతో పాపాలు పోతాయి. లక్ష్మీ ప్రసన్నం కలుగుతుంది.

Send a Comment

Your email address will not be published.