సామాజిక సేవకు ఉన్నత పురస్కారం

వలస రావడం సాధారణం, కలిసి పోవడం అపూర్వం. అందుకు సాధన చేయడం అద్భుతం. సమన్వయ పరచడం ఒక సమరం. తోటివారిని ఏకం చేయడం గొప్పతనం. సమజాభివృద్ధికి పునఃరంకితమవ్వడం విశేషం. సమస్యలను అధిగమించడం సమున్నతం. ఇన్ని లక్షణాల సమ్మిళితం బహుళ సంస్కృతి పురస్కారం.

ఒక మహోన్నతమైన భాషా సంస్కృతులకు వారసులమై కాలగమనంలో ఖండాంతర నివాసాలు ఏర్పరచుకొని మన సాంప్రదాయ విలువల్ని కాపాడుకుంటూ వలస దేశంలోని బహుళ సంస్కృతీ విలువలతో మమేకం అవ్వడం రెండువైపులా పదునున్న కత్తి మీద సాము లాంటిది. భారతీయ అస్త్రేలియనా? ఆస్ట్రేలియన్ భారతీయుడా అన్న మీమాంసతో కొంత కాలం కొట్టుమిట్టాడటం షరా మామూలే!

ఆస్ట్రేలియాలో శుభారంభం…
అందరిలాగే 20 ఏళ్ల క్రితం ఆస్ట్రేలియా సకుటుంబంతో వలస వచ్చి ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తూ క్రొత్తగా వచ్చినవారికి తగిన సహాయం చేస్తూ మన తెలుగువారి అభివృద్ధికే కాకుండా భారతీయులందరూ ఆస్ట్రేలియా లోని ఇతర సంస్కృతుల వారితో కలవడానికి ఎంతో కృషి చేసి స్పూర్తిప్రదాతగా నిలిచిన శ్రీ కృష్ణ నడింపల్లి గారికి ఆస్ట్రేలియా కాపిటల్ టెర్రిటరీ ముల్టీ కల్చరల్ కమిషన్ వారు అడ్వోకసి పురస్కారంతో సత్కరించారు.

వివిధ సంస్థల అనుబంధం…
పదేళ్ళ క్రితం కాన్బెర్రా తెలుగు సంఘం సంస్థాపక సభ్యునిగా ప్రస్థానం మొదలిడి తోటివారిని తోడ్కొని అంచలంచెలుగా ఎదిగుతూ ఫెడరేషన్ అఫ్ ఇండియన్ అసోసియేషన్ ఇన్ ACT (FINACT) కి కార్యదర్శి గానూ, అధ్య్క్షునిగానూ పదవీ బాధ్యతలను చేపట్టి మన భారతీయులతో పాటుగా స్థానిక సంస్థల అభిమానాన్ని చూరగొన్న ప్రజ్ఞాశాలి శ్రీ కృష్ణ గారు. తెలుగు సంఘం అధ్యక్షులుగా, FINACT అధ్యక్షులుగా, కాన్బెర్రా హిందూ మందిరం సంస్థాపక అధ్యక్షులుగా, Confederation of Indian Associations of Australia (CIAA), Executive Member గా ఎన్నో పదవులను ఒకేసారి నిర్వహించి సవ్యసాచిగా అభివర్ణింపబడ్డారు.
సమాజసేవే పెన్నిధి. కార్యసాధనే పరమావధి. సమన్వయంతో సమస్యలను ఎదుర్కోవడం. పరిష్కరించడం ఒక అవధానం.

క్రికెట్ క్రీడా వేదిక …
భారతీయ సంఘాలన్నిటినీ ఒకే త్రాటిపై తీసుకురావడానికి FINACT, Cricket ACT, ICC World Cup and ACT Sports సంస్థలతో సంప్రదించి మినీ క్రికెట్ వరల్డ్ కప్ నిర్వహించారు. 2013 ఫిబ్రవరి 28 వ తేదీన మొట్టమొదటి కమ్యూనిటీ హార్మొనీ డేని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి చాలామంది స్థానిక రాజకీయనాయకులు ఇతర సంస్థల సభ్యులు హాజరయ్యారు.

తెలుగు – కమ్యూనిటీ భాషగా…
గత సంవత్సరం తెలుగు భాషని ఆస్త్రేలియాలో కమ్యునిటీ లాంగ్వేజ్ గా గుర్తింపు పొందడానికి శ్రీ కృష్ణ గారు ఫెడరల్ ప్రభుత్వ ప్రతినిధులతో సంప్రదింపులు జరిపి తొలిమెట్టునధిగమించారు. ఈ విషయాన్ని జాతీయ ప్రభుత్వంతో ఒప్పించడానికి ఆస్ట్రేలియాలోని తెలుగు సంఘాలన్నిటినీ సమన్వయ పరచి ఒక తెలుగు జాతీయ సమాఖ్యను స్థాపించి దానికి అధ్యక్షునిగా పనిచేస్తున్నారు.

కాన్బెర్రా తెలుగుబడి…
మూడేళ్ళ క్రితం కాన్బెర్రాలో తెలుగుబడిని మొదలుపెట్టి నిర్విఘ్నంగా నడపడం, “రాగం, తానం, పల్లవి” కార్యక్రమం నిర్వహించి చిన్న పిల్లలకు వారి ప్రతిభను ప్రదర్శించడానికి ఒక వేదికను అందించారు. కాన్బెర్రా తెలుగు సంఘం నిర్వహించే ఉగాది కార్యక్రమంలో పిల్లలకు తప్పనిసరిగా పాల్గొనటానికి అవకాశం కల్పించాలని శ్రీ కృష్ణ గారు అధ్యక్షునిగా వున్నప్పుడు నిర్ణయించారు.

భవిష్యత్తులో భారత – ఆస్ట్రేలియా సంబంధాలు మరింత బలపడి ఇరు దేశాల ప్రజలకు ఆర్ధిక, వ్యాపార, విద్యా, పర్యాటక రంగాలలో లాభదాయకమైన కార్యక్రమాలు చేపట్టడంలో శ్రీ కృష్ణ గారు క్రియాశీలక పాత్ర నిర్వహించగలరని తెలుగుమల్లి ఆశిస్తోంది.

Send a Comment

Your email address will not be published.