సినిమాలే క్లాస్ రూములు, పాత్రలే గురువులు

“తుది శ్వాస విడిచే వరకు నటిస్తానని” చెప్పుకున్న దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత, పద్మ విభూషణ్ అక్కినేని నాగేశ్వర రావు అక్షరాలా ఆ మాటను నిజం చేసారు. ఆయన చివరగా నటించిన చిత్రం మనం. ఇది వంద రోజులు పూర్తి చేసుకున్న చిత్రం కావడం మరో విశేషం. ఆయన ఎన్నో అవార్డులూ, రివార్డులూ అందుకున్న మహానటులు.

వ్యక్తిగా నటుడిగా ఆయన ఘన విజయం సాదించారు. ఆయన జీవితాన్ని ప్రేమించారు. కీర్తిని ప్రేమించారు. డబ్బుని ప్రేమించారు. సుఖాన్ని ప్రేమించారు. ఆనందాన్ని ప్రేమించారు. వాటితో ఆయన సరాగాలాడారు. నటనకు ఆయన ఒక కొత్త వొరవడి పెట్టుకుని నటించారు. కళారాధన ద్వారా ఆనందం పొందిన అక్కినేని అనేక మంచి కార్యాలకు తన వంతు సహాయం చేసారు. మాంగల్య బలం, జయభేరి, పెళ్లినాటి ప్రమాణాలు, ఇల్లరికం, కాళిదాసు, భార్యాభర్తలు, జయదేవ, గుండమ్మ కథ, బాటసారి, ప్రేమ నగర్ వంటి అనేక చిత్రాలు ఆయనకు ఎనలేని కీర్తిప్రతిష్టలు తెచ్చిపెట్టాయి.

1924 సెప్టంబర్ 20వ తేదీన కృష్ణా జిల్లాలోని వెంకటరాఘవాపురంలో (దీనినే ఇప్పుడు రామాపురం అని అంటున్నారు) ఒక సామాన్య కుటుంబంలో పుట్టి పెరిగిన ఏ ఎన్ ఆర్ ఐదో తరగతి వరకే చదువుకున్నారు. ఆయన తల్లిదండ్రులు పున్నమ్మ, అక్కినేని వెంకటరత్నం. లైలా మజ్ను చిత్రం తీసే రోజుల్లో ఆయనకు పెళ్లి అయ్యింది. దెందులూరు నివాసి అయిన కొల్లిపర వెంకట నారాయణ గారి కుమార్తె అన్నపూర్ణను ఆయన పెళ్ళాడారు. 2014 జనవరి 22న ఆయన కన్నుమూసారు. ఆయన సినీ జీవితం డెబ్భై అయిదేళ్ళు సాగింది. హైదరాబాదులో ఆయన అన్నపూర్ణా స్టూడియో నిర్మించారు. ఆయన ఈ స్టూడియో ఆవరణలోనే ఫిలిం, మీడియా స్కూల్ నెలకొల్పారు.

చిన్నప్పటినుంచే ఆయనకు నాటకాలంటే ఎంతో ఇష్టం. ఆయనకు పెద్దన్నయ్య రామబ్రహ్మం చెప్పింది శిలాశాసనం లాంటిది. ఆయన ఏది చెప్తే అది చేసేవారు. అక్కినేని పదో ఏటనే ఆయన తల్లి, అన్నయ్య నటనే ఆయన వృత్తి అని ఒక నిర్ణయానికి వచ్చి ఎంతగానో ప్రోత్సహించారు. పెదవిరివాడ, కుదరవిల్లి, ముదినేపల్లి, గుడివాడలలో గురువుల దగ్గర, తోటి నటీనటుల దగ్గర, భాద్రాచారి, శ్రీరామమూర్తి, మధుసూదనరావు, అచ్చయ్య, దైతా గోపాలం, పెండ్యాల తదితరుల దగ్గర నటనకు సంబంధించి అనేక విషయాలు తెలుసుకుని వాటిని అనుసరించి అమలుచేసారు అక్కినేని. స్థానం నరసింహారావు వంటి ప్రముఖుల నాటకాలు చూసి మెళకువలు దిద్దుకున్నారు.

పెదవిరివాడ స్కూల్ వార్షికోత్సవంలో హరిశ్చంద్ర నాటకంలో మొదటగా నారదుడు పాత్ర వేసారు. అందులో ఆయన నటనను ఓహో అని పొగిడారు. ఆ తర్వాత వెంకటరాఘవాపురంలో స్కూల్ వార్షికోత్సవంలో అక్కినేని గెస్ట్ ఆర్టిస్టుగా హరిశ్చంద్ర నాటకంలో చంద్రమతి వేషం వేశారు. ఈ నాటకాన్ని ఆయన తల్లి కూడా చూసారు.

కనకతార నాటకంలో ఆయన తార అనే పాత్ర పోషించారు.

పదిహేడో ఏట వరకు ఆయన వేసిన పాత్రలన్నీ ఆడ వేషంతో కూడినవే కావడం విశేషం.

నాటకాలు లేక పని లేక ఖాళీగా ఉన్న రోజుల్లో ఒకసారి పెద్దన్నయ్య అక్కినేనికి ఒక పని అప్పగించారు. కాంగ్రెస్ పార్టీలో సభ్యులను చేర్పించే ఉద్యమం జోరుగా సాగుతున్న కాలమది. ఆ సభ్యుల పేర్లు, చిరునామాలు ఒక బుక్కులో రాయాలి. వెయ్యి పేర్లు రాస్తే ఒక రూపాయి ఇచ్చేవారు. ఆ రాసే పని చెయ్యమన్నారు. అందుకు ఒప్పుకుని అక్కినేని రాత్రీ పగలూ పని చేసి అయిదు వేల పేర్లు రాసి అయిదు రూపాయలు సంపాదించారు. ఆ అయిదు రూపాయలు తీసుకుని గుడివాడ బజారుకు వెళ్లి ఒక సిల్కు చొక్కా, సిల్కు లాగు, దొర టోపీ, బూట్లు ఒక స్వెట్టరు, మఫ్లరు, నల్ల కళ్ళజోడు కొనుక్కున్నారు. అవన్నీ అక్కడే వేసేసుకుని చక్కగా ముస్తాబై పాత బట్టలు పట్టుకుని ఇంటికి వచ్చేసారు. ఆయన వేషం చూసి ఇంట్లోని వారందరూ మురిసిపోయారు.

ఆయన ఒక రోజు ఒక రైల్వే స్టేషన్ లో ఓ నాటక బృందంతో ఉన్నప్పుడు ఆయన దశ తిరిగింది. అలనాటి నిర్మాత, దర్శకుడు అయిన ఘంటసాల బలరామయ్య అక్కినేనిని గుర్తించి సినిమాల్లో నటిస్తావా అని అడిగారు. ఆయన మాటకు అక్కినేని ఒకటికి రెండు సార్లు ఆలోచించడం వంటివి చెయ్యక వెంటనే ఆయన వెంట వెళ్ళారు సినిమాల్లో నటించడానికి. నెలకు రెండు వందల యాభై రూపాయల జీతం మీద అక్కినేనిని బుక్ చేసుకున్నారు బలరామయ్య గారు. అందుకే ఆయనకు దేవుడు కన్నా అత్యంత ముఖ్యులయ్యారు ఘంటసాల బలరామయ్య. ఈ మాటను ఆయన అనేకసార్లు చెప్పుకున్నారు. ఆయన గానీ ఆరోజు తనను గుర్తించక పోయుంటే తాను ఓ నటుడిని అయివుండే వాడిని కానని అంటూ ఉండే వారు.

సినిమాలు క్లాస్ రూములని, పోషించిన పాత్రలు గురువులని ఆయన చెప్పుకునే వారు. వాటినుంచి ఆయన ఎన్నో విలువైనవి నేర్చుకున్నారు.

సీతారామ జననం, మాయా లోకం, ముగ్గురు మరాటీలు చిత్రాల్లో ఆయన నటనతోపాటు నేపధ్య గాయకుడిగాను మన్ననలందుకున్నారు. సీతారామ జననంలో ఆయన రాముడి పాత్రలో నటించారు. అయితే ఆయన గొంతు అమ్మాయి గొంతులా ఉండేదట. దానితో ఆయన కొంత సిగ్గు పడ్డారు కూడా. అయితే సంగీత దర్శకులు ప్రభల సత్యనారాయణ, ఒగిరాల రామచంద్ర రావు వంటి వారు అప్పట్లో ఇచ్చిన సలహాలు ఆయనకు ఎంతో స్థయిర్యాన్ని ఇచ్చాయి. సీతారామ జననం కొంత అయ్యేసరికే అక్కినేనికి గూడవల్లి రామబ్రహ్మం నిర్మిస్తున్న మాయలోకం చిత్రంలో నటించే అవకాశం వచ్చింది.

ఎప్పుడైతే గొంతులో మార్పు వచ్చిందో ఆయన ఇక పాటలు పాడనని, ఎవరిచేతనైనా పాడించమని అక్కినేని నిక్కచ్చిగా చెప్పేశారు. అప్పుడు ఆయనకు ఘంటసాల పాడటం మొదలైంది. ఆతర్వాత ఎస్ పీ బీ కూడా ఆయనకు పాటలు పాడారు. బాలరాజు సినిమా నుంచి అక్కినేనికి ఘంటసాల పాటలు పాడారు.
సినీ పరిశ్రమకు రాకముందు నుంచే ఘంటసాలకు, అక్కినేనికి ఒకరికొకరు పరిచయాలు ఉన్నాయి. అయితే ఘంటసాల తనకు సినిమాల్లో పాటలు పాడుతారని అప్పట్లో అనుకోలేదని అక్కినేని అనే వారు.

ఇండియన్ సినిమాలో డ్యాన్స్ చేసిన తొలి హీరో అక్కినేని కావడం విశేషం. సంగీత స్వరాలు వినిపించడంతోనే ఆయన డ్యాన్స్ చేయకుండా ఉండలేకపోయేవారు. అందుకే పాటలకు డ్యాన్స్ చేయాలని ఆయన నిర్ణయించుకున్నారు. ఆయన డ్యాన్స్ ని రాజ్ కపూర్, సునీల్ దత్ వంటి వారు విమర్శించే వారు. డ్యాన్స్ చేయడాని హీరోయిన్లకు విడిచిపెట్టమని వాళ్ళు సలహాలు కూడా ఇచ్చారట. కానీ అక్కినేని డ్యాన్స్ చేయడం మానలేదు.

విప్రనారాయణ చిత్రం ఆయనను కొంత ఇబ్బంది పెట్టకపోలేదు. అప్పుడు ఆయన విశేషంగా గౌరవించే ఒక వ్యక్తి అక్కినేనికి స్నేహరీత్యా హితవు పలికారు. “నాగేశ్వరరావు నువ్వేమో నాస్తికుడివి. నీకు భక్తి అంటే ఏమిటో బొత్తిగా తెలీదు. విప్రనారాయణ పాత్ర ధరిస్తే వెలితిగా ఉండవచ్చు” అని అన్నారట. అప్పుడు అక్కినేని ఓ నవ్వు నవ్వి “నాకు భక్తి ఉండి ఉన్న భక్తిని ప్రదర్శిస్తే నేను నటుడినే కాను. ఒక కళాకారుడిగా ఆ పాత్రను అర్ధం చేసుకుని నటించే ప్రయత్నం చేస్తాను” అని జవాబిచ్చారు. చెప్పినట్టే నటించి ఆయనకు విప్రనారాయణ మంచి పేరు తెచ్చిపెట్టింది. అంతేకాదు రాష్ట్రపతి అవార్డు కూడా దక్కడం విశేషం.

తెలుగు టాకీ 1931 లో ప్రారంభం కాగా అక్కినేని నాగేశ్వరరావు 1940 లో సినీ రంగంలోకి అడుగు పెట్టారు.

సినీ రంగంలోకి ప్రవేశించిన తర్వాత ఆయన వరుసగా 18 చిత్రాలు జానపద, పౌరాణికాలే చేసారు. ఆయన సంసారం అనే చిత్రంలో నటించేటప్పుడు ఆ చిత్రంలో చేయడానికి అతకుముందు తీసుకున్న పారితోషికాలలో రెండువంతులు తగ్గించి తీసుకోవడం విశేషం. కారణం ఆ రోజుల్లో సాంఘిక చిత్రం చేయడం అంటే సాహసంగా భావించడమే అని అక్కినేని చెప్పుకున్నారు. అంతేకాదు, సాంఘిక చిత్రంలో నటించలేదు అనే భావనను తొలగించడానికి ఆయన ఆ చిత్రంలో చేశానన్నారు.

దేవదాసు చిత్రంలో దేవదాసు తాగుబోతు అయి ఆరోగ్యం పాడు చేసుకున్న ఘట్టాలలో నటించడం కోసం దేహస్థితి తోడుకావాలని ఆ చిత్రీకరణ పూర్తయ్యే వరకు అక్కినేని నిద్రాహారాలు మానేశారు. ఈ సినిమాతో ఆయన దశ తిరిగింది.

చక్కటి ముఖం, చక్రాల్లాంటి కళ్ళు, సన్నటి మీసం, చురుకైన చూపులు, ధైర్యం, సంస్కారం, ఇవన్నీ కలిసి రూపొందిన అక్కినేని ప్రేమికుడిగా ప్రేక్షక ప్రపంచాన్ని సమ్మోహితం చేసారు అనేది అక్షరసత్యం. ఆడపిల్లలకు ఆయన స్వప్న సుందరుడు. ఆయనకు ఆడపిల్లలు ఎందరో ఉత్తరాలు రాసారు.

మహాకవి దాశరధి తాను రాసిన అనువాద పుస్తకం గాలిబ్ గీతాలను అక్కినేనికి అంకితమిచ్చారు.
భారతీయ సినీ రంగంలో సహజంగా నటించే అశోక్ కుమార్ అంటే ఆయనకు అమితమైన ఇష్టం. ఆయన నటించిన చిత్రాలను అక్కినేని తప్పకుండా చూసేవారు.

ఎస్వీ రంగా రావు కొన్ని సందర్భాల్లో ఓవర్ యాక్టింగ్ చేసినా చాలా పాత్రలను సహజంగా చేసారని అక్కినేని వ్యక్తిగత అభిప్రాయం.

హీరోయిన్లలో సావిత్రి, వాణిశ్రీ, జయసుధ సహజత్వానికి దగ్గరగా ఉండేటట్టు నటించే సమర్ధత ఉన్నవారని అక్కినేని అభిప్రాయం.

కొసరాజు రాఘవయ్య, ఆచార్య ఆత్రేయ ప్రవేశంతో పాటల రచనలో మార్పులు వచ్చాయని అక్కినేని చెప్పారొకసారి. నిత్య జీవితంలో మనం మాట్లాడుకునే మాటలనే తీసుకుని పాటలు రాసి ఆత్రేయ మెప్పించారని, జానపదుల గీతాలను తీసుకుని చక్కటి పాటలు రాసిన ఘనత కొసరాజుదని అక్కినేని చెప్పే వారు.

సినిమాలో అప్పటికీ ఇప్పటికీ దర్శకుడి భాద్యత తప్పనిసరి. తెలుగు పరిశ్రమకు మొదటినుంచి అనుభవజ్ఞులైన దర్శకులు ఉండటం మన అదృష్టం అన్నది అక్కినేని మాట.

ఆరోజుల్లో నటీనటులకు లౌకిక ప్రపంచ అవగాహన తక్కువ ఉంటె ఈనాటి నటీనటులకు అది పుట్టుకతోనే వస్తోంది. కారణం, ప్రపంచం సాంకేతికంగా అభివృద్ధి చెందడం లేదా తరాలలో వచ్చిన మార్పు కావచ్చు అని చెప్పిన అక్కినేని తెలుగు చిత్రపరిశ్రముకు ఒక వరమని చెప్పుకోవడం అతిశయోక్తి కాదు.

– యామిజాల జగదీశ్

Send a Comment

Your email address will not be published.