సుశీల గిన్నిస్ రికార్డు

SUSHEELA-Asia jpg

కన్నీళ్ల ఖేద,మోదము
లెన్నింటినినెందరలకొనిచ్చిన గానం
బన్ని యుగములనదినిలుచు !
‘గిన్నీసు’కు గారవమది, కొలువ సుశీలన్
——శ్రీ సూర్యనారాయణ సరిపల్లె

సుప్రసిద్ధ సినీ నేపద్యగాయని పీ (పులపాక) సుశీల మోహన్ గిన్నిస్ బుక్ అఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం సంపాదించారు.

SUSHEELAదాదాపు అయిదు దశాబ్దాలలో 17,695 సోలో , డ్యూయెట్ , కోరస్ పాటలు పాడిన క్రమంలో సుశీలకు ఈ అరుదైన స్థానం దక్కింది.

విజయనగరంలో 1935 నవంబర్ 13వ తేదీన పుట్టిన సుశీల తన గాన మాధుర్యంతో దక్షిణ భారత సినీ సంగీత అభిమానులను మైమరపించారు.

ద్వారం వెంకట స్వామి నాయుడుగారి వద్ద కొంతకాలం తర్ఫీదు పొందిన తమ కూతురుని (సుశీలను) శాస్త్రీయ సంగీతంలో ఎం ఎస్ సుబ్బలక్ష్మిలా చూడాలనుకున్నారు తండ్రి. అయితేనేం ఆమె దక్షిణ భాషా చలన చిత్రం రంగంలో తమ గొంతును పాటల రూపంలో ఎన్నో సంవత్సరాలు ఎందరో అగ్రనాయికలకు అందించారు. ఆమె ఎవరికి పాడితే వారికి ఆ గొంతు అచ్చంగా సరిపోయి సంబంధిత కథానాయికే ఆ పాట పాడుతున్నారా అని అనిపించేలా ఉండేది.

విజయనగరం నుంచి మద్రాసుకి మకాం మార్చిన తర్వాత 1951 ప్రాంతంలో కె ఎస్ ప్రకాశ రావు ఆరంభించిన కన్నతల్లి అనే చిత్రంలో ఒక కోరస్ పాట కోసం రేడియో అన్నయ్య న్యాపతి రాఘవరావు పంపారు. అప్పుడు పెండ్యాల నాగేశ్వర రావు ఆమె గాత్రాన్ని మెచ్చి ఆమెతో ఒక కోరస్ పాడించారు. అలాగే ఒక పద్యం, ఏ ఎం రాజాతో కలిసి ఎందుకు పిలిచావెందుకో ….అనే యుగళగీతం ఆడించి సుశీలతో సినీరంగ ప్రవేశం చేయించారు.

ఆమె తమిళంలో పెట్రత్తాయి అనే చిత్రంలో మొదటి పాట పాడారు.

తన కెరీర్ లో ‘బెస్ట్ ప్లే బ్యాక్ సింగింగ్ ఫీమేల్’ గా అయిదు నేషనల్ అవార్డ్స్ లను సొంతం చేసుకున్న సుశీల భారత ప్రభుత్వం నుంచి 2008లో ‘పద్మభూషణ్’ పురస్కారం అందుకున్నారు.

తెలుగు, తమిళం, కన్నడం, హిందీ, తదితర ఆరు భాషల్లో పాటలు పాడిన సుశీలకు అమెరికాలో బోలెడు మంది అభిమానులు ఉ న్నారు. అక్కడి అభిమానులు సుశీల.ఒఆర్జీ అనే ఒక సైట్ ద్వారా ఆమె పాడిన పాటలపై అధ్యయనం చేయడం విశేషం.

సినిమా పాటలేకాకుండా భక్తిరస గేయాలు కూడా ఆలపించిన సుశీల ఘంటసాల, ఎస్ పీ బాలసుబ్రమణ్యం, పీ బీ శ్రీనివాస్, టీ ఎం సౌందర్ రాజన్ తదితరులతో కలిసి పాడిన యుగళగీతాలు ఎంతో ఆదరణ పొందాయి.

P Susheela garul

సుశీల చెన్నైలో మాట్లాడుతూ తనకు గిన్నిస్ బుక్ లో స్థానం దక్కడం సంతోషం కలిగించినట్టు చెప్పారు. సినిమాలో పాడటానికి ముందు హెచ్ ఎం వీ గ్రామ్ ఫోన్ రికార్డుపై పాడినట్టు చెప్పిన సుశీల తన గొంతు విన్న ఏ వీ మెయ్యప్ప చెట్టియార్ తమ సంస్థలో పాడటానికి ఒప్పందం చేసుకుని ఈ స్థాయికి ఎదగటానికి ముఖ్యకారకులయ్యారన్నారు. సంగీత దర్శకులు ఆశించినట్టు తానూ పాడినట్టు చెప్పిన సుశీల మంచి మంచి పాటలను రాసిన గేయరచయితలను కూడా గుర్తు చేసుకున్నారు. వాళ్లకు కృతజ్ఞతలు చెప్పుకున్నారు.

తన జీవితాన్ని సంగీతానికి అర్పించినట్టు చెప్తూ అంతా దేవుడిచ్చిన వరమని సుశీల అన్నారు. ఆమె తన వారసురాలిగా కోడలు సంధ్యను చెప్పుకున్నారు. ఆమె ఇప్పటికే కొందరు సంగీత దర్శకుల వద్ద పాటలు పాడిందని చెప్పారు.

తనకు మళ్ళీ అవకాశమిస్తే పాడుతానని సుశీల చిన్న నవ్వు నవ్వారు.

Send a Comment

Your email address will not be published.