సొంత ఊళ్ళల్లో సంక్రాంతి

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్య మంత్రి నారా చంద్రబాబు నాయుడు చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలంలోని తన సొంత ఊరు నారావారి పల్లెలో సంక్రాంతి సంబరాలు జరుపుకున్నారు. కాగా తెలంగాణా ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు మెదక్ జిల్లా జగదేవ్ పూర్ మండలంలో ఉన్న తన ఫార్మ్ హౌస్ లో సంక్రాంతిని జరుపుకున్నారు. నారావారి పల్లెకు భోగి రోజునే అంటే 14వ తేదీనే చేరుకున్న చంద్రబాబు తన బంధువులు, చిన్న నాటి స్నేహితులతో ఆటా పాటలతో సంబరాలు చేసుకున్నారు. సంక్రాంతి ఉదయం పల్లె లోని ఎన్టీఆర్ విగ్రహారానికి పూల మాల వేసి నివాళులు అర్పించిన తరువాత ఆయన తన తండ్రి నారా ఖర్జూర నాయుడు, తల్లి అమ్మన్నమ్మ సమాధుల వద్ద పూజలు జరిపారు. ఇంటింటికీ వెళ్లి గ్రామస్తులను పలకరించాలని ఆయన మొదట భావించినా భద్రతా కారణాల దృష్ట్యా    చివరి క్షణంలో

దాన్ని రద్దు చేసుకున్నారు. గ్రామస్తులనే తన ఇంటికి పిలిపించుకుని వాళ్ళ కష్ట సుఖాలు అడిగి తెలుసుకున్నారు. సాయంత్రం స్థానిక మహిళలు ఆయన ముందు జానపద నృత్యాలను ప్రదర్శించారు. ఆయన కూడా వారితో కలిసి నృత్యం చేసారు.  కోలాటం కూడా వేశారు.

ఈ ఏడాది సంక్రాంతి వేడుకలను పచ్చటి ప్రకృతి మధ్య జరుపుకోవాలని తెలంగాణా ముఖ్యమంత్రి భావించారు. సంక్రాంతి ముందు రోజే తన ఫార్మ్ హౌస్ కు వెళ్లిపోయిన  చంద్రశేఖర్ రావు అక్కడ కొందరు బంధువులు, కుటుంబ సభ్యులతో కలిసి వేడుకలు జరుపుకున్నారు. ఇది ఇలా వుండగా, నటుడు, హిందూపురం శాసనసభ్యుడు అయిన నందమూరి బాలకృష్ణ కృష్ణా జిల్లాలోని తమ స్వగ్రామం నిమ్మకూరులో సంక్రాంతి వేడుకలను జరుపుకున్నారు. అక్కడి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఏర్పాటయిన గోదా దేవి కళ్యాణ మహోత్సవంలో కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొన్నారు. అనతరం బంధువులు, స్నేహితులతో కలిసి భోజనాలు చేశారు.

Send a Comment

Your email address will not be published.