త్వరలో హైదరాబాద్ నగరానికి వచ్చి ఓ బహిరంగ సభను ఏర్పాటు చేసి, తెలంగాణా ప్రజలకు ప్రత్యేక రాష్ట్రం విషయంలో మరింత స్పష్టమైన హామీ ఇవ్వాలని కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ భావిస్తున్నట్టు తెలిసింది. వాస్తవానికి తెలంగాణా రాష్ట్రాన్ని ఏర్పాటు చేసే విషయంలో రాజ్యాంగబద్ధమైన ప్రక్రియ ఇప్పటికే మొదలయిపోయినప్పటికీ, ఈ ప్రాంత ప్రజల్లో ఇంకా అనుమానాలు తొలగిపోలేదని ఆమె అర్థం చేసుకున్నారు. ఇటీవల రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ హైదరాబాద్ వచ్చినప్పుడు పరిస్థితిని ఆకళింపు చేసుకున్నారు. బహుశా ఆయన సలహా మేరకే ఆమె ఇక్కడికి రాదలచుకుని ఉండవచ్చని కాంగ్రెస్ వర్గాలు భావిస్తున్నాయి. ఇంకా తేదీ ఖరారు కాలేదు కానీ, జనవరిలో ఆమె నగరానికి వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు.
తెలంగాణను ఏర్పాటు చేయడంపై తమ పార్టీ, తమ ప్రభుత్వం ఎంత చిత్తశుద్ధితో ఉందో ఆమె తెలంగాణా ప్రజలకు తేటతెల్లం చేయదలచుకున్నారు. ఈ బహిరంగ సభ నిజాం కళాశాల మైదానంలో జరుగుతుంది. ఈ సమావేశానికి తెలంగాణా రాష్ట్ర సమితి సహాయ సహకారాలు కూడా ఉంటాయి. తెలంగాణా ఏర్పాటు విషయంలో ఇక సాంకేతిక, రాజ్యాంగపరమైన, న్యాయ సంబంధమైన అడ్డంకులేవీ ఉండవని ఆమె ఇప్పటికే తెలంగాణా ప్రాంత నాయకులకు తెలిపారు. సీమాంధ్ర ప్రాంత ప్రజలకు ఆమె ఎటువంటి హామీ ఇవ్వబోతున్నదీ మాత్రం వెల్లడి కావడం లేదు.