స్కైప్ ద్వారా విడాకులు!

భార్య అమెరికాలో… భర్త ఖమ్మంలో. స్కైప్ అప్లికేషన్ (యాప్) ద్వారా విచారణ…. వారిద్దరికీ విడాకులు మంజూరు. ఖమ్మం కోర్టులో ఈ మేరకు తీర్పు వెలువడింది. ఖమ్మం నగరానికి చెందినా నల్లపునేని కిరణ్ కుమార్ కు , ఇదే నగరానికి చెందిన కేతినేని పావనికి 2012 మార్చి 9న వివాహం అయింది. అయితే, కాపురానికి రాకముందే ఈ ఇద్దరి మధ్యా అభిప్రాయభేదాలు మొదలయ్యాయి.
వివాహాన్ని రద్దు చేయాలని కిరణ్ కుమార్ 2012 జూన్ 12న ఖమ్మం సీనియర్ సివిల్ జడ్జి కోర్టులో విడాకుల పిటిషన్ దాఖలు చేశారు. తనను కట్నం కోసం వేధించారని పావని తన భర్త, అతని కుటుంబంపై హైదరాబాద్ సివిల్ కోర్టులో పిటిషన్ వేశారు. ఇరు పక్షాల మధ్య మూడు సంవత్సరాలుగా కేసు విచారణ జరుగుతోంది. అయితే అమెరికాలో ఉద్యోగం చేస్తున్న పావనికి ఖమ్మం కోర్టుకు వచ్చే సమయం లేకుండా పోయింది. ఇలాంటి సమయాల్లో స్కైప్ యాప్ సౌకర్యాన్ని ఉపయోగించుకోవచ్చని గతంలో హై కోర్టు ఒకసారి తీర్పు ఇచ్చింది. ఈ సౌకర్యాన్ని అవకాశంగా తీసుకుని ఉభయపక్షాలు కోర్టును కోరడంతో జడ్జి అంగీకరించారు. చివరికి స్కైప్ ద్వారా విచారణ పూర్తి చేసి, న్యాయమూర్తి విడాకులు మంజూరు చేశారు. స్కైప్ ద్వారా విచారించి, కోర్టు తీర్పు వెలువరించడం రాష్ట్రంలో ఇదే మొదటిసారి.

Send a Comment

Your email address will not be published.