స్తబ్దత (Depression)

విచారం, వ్యాకులత, నిరాశ, నిస్పృహ చెందడం సర్వసామాన్యం. అయితే స్తబ్దత మనఃస్థితి మరియు కొన్ని ఇతర లక్షణాలపై ఆధారపడి ఉంటుంది. ఆ లక్షణాలు మిక్కిలి ప్రభలమైనవి, వ్యాప్తి చెందెడివి, దీర్ఘకాలికమైనవి గా వుండి వ్యక్తిపై దుఃఖకరమైన ప్రభావం చూపిస్తూ దైనందిన జీవితంలోనూ మరియు సంబంధ బాంధవ్యాలలో తేడా తెచ్చే అవకాశం వుంటుంది.

కారణాలు:

స్తబ్దతకు గల కారణాలు అనేకమై ఉండవచ్చు. అవి జన్యు సంబంధం కలవి, కుటుంబ చరిత్ర, మానసిక, ఆవేశం, అవయవ కణాలకు సంబందించి ఉదాహరణకు: మెదడులో అసమతౌల్యం, నిర్వాహికగ్రంథులు, వ్యాధి నిరోధక శక్తి తగ్గడం, అతిపెద్ద సంఘటనతో కూడిన ఒత్తిడి.

స్తబ్దత అనేది ఇతర వ్యాధులవలన ఉదాహరణకు కాన్సెర్, హృద్య సంబంధమైన వ్యాధుల వలన రావచ్చు. నాడీ గ్రంధ నాళాల్లో కలిగిన మార్పులవలన కూడా ఈ వ్యాధి వచ్చే అవకాశం వుంటుంది.

రకాలు:

స్తబ్ధత అన్ని వయసులవారికీ – పిల్లలు, యుక్త వయసు వారు, పెద్దలు అందరికీ వచ్చే అవకాశం వుంటుంది.

బహు విస్తారమైన స్తబ్దత (Major depression):

దీన్ని రోగ స్తబ్దత (clinical depression) లేక, అవ్యవస్థ (depressive disorder), ఏకధ్రువ స్తబ్ధత (unipolar depression) అంటారు. మానసికావస్థలో హెచ్చుతగ్గులు, దైనందిక కార్యకలాపాలలో అశ్రద్ధ చూపడం వంటి లక్షణాలు కనపడతాయి. షుమారుగా అన్ని రోజుల్లో ఇదే ప్రవర్తన కనబడుతూ రెండు వారాలకు పైగా ఈ లక్షణాలు వుంటాయి. దీనివలన తాను చేసే పని, సాంఘిక సహజీవనం, సంబంధ బాంధవ్యాలలో చాలా మార్పులు కనిపిస్తాయి. స్తబ్దత తీవ్రంగానూ, మితంగానూ, అమితంగానూ, విషాదభరితంగానూ, మనోవిక్షిప్తంగానూ కూడా ఉండవచ్చు.

ఋతు సంబంధమైన అవ్యవస్థ (Seasonal Affective Disorder):

సంవత్సరంలోని కాలము, ఋతువు, వాతావరణ పరిస్థితులపై ఈ స్తబ్ధత ఆధారపడి వుంటుంది.

ప్రసవానంతర స్తబ్దత (Postpartum Depression):

స్త్రీలలో ప్రసవానంతరం ఈ స్తబ్దత వచ్చే అవకాశం వుంటుంది.

మతిభ్రమతో స్తబ్దత (Depression with Psychosis):

కొన్ని సందర్భాలలో తీవ్రమైన స్తబ్దత వలన వ్యక్తి వాస్తవానికి దూరమౌతూ భ్రమ, భ్రాంతిలో తనను తాను ఊహించుకుంటూ మానసికంగా తీవ్రమైన అస్తవ్యస్తానికి గురౌతారు.

Dysthymia:

తగుమాత్రమైన మనఃస్థితి లక్షణాలతో స్తబ్దత కలిగే అవకాశం వుంటుంది.

లక్షణాలు:

స్తబ్దత వలన తనకి తానుగా విశ్లేషించు కోవడంలో వ్యక్తి ఎంతో మధనపడుతూ వుంటాడు. నిద్రలేమి, అతి నిద్ర, కావలసినంత శక్తిని చేకూర్చుకోలేకపోవడం, తనపై తాను శ్రద్ధ చూపకపోవడం, సరదాగా గడిపే క్షణాల కోసం ఎదురు చూడకపోవడం, ఏకాగ్రతను కోల్పోవడం, కోపానికి గురౌవడం వంటి ఎన్నో లక్షణాలు దీనికి నిదర్శనం.

రెండు వారాలకంటే ఎక్కువగా స్తబ్దతకు గురైతే ఈ క్రింద నుదహరించిన కొన్ని లక్షణాలు కనిపించే అవకాశం వుంది.

అందరూ ముఖ్యంగా కొన్ని లక్షణాలకు గురి అయ్యే అవకాశం వుంది. అందుకని స్తబ్దతకు గురైనట్లు కాదు. అలా అని స్తబ్దతకు గురైన వ్యక్తికి ఈ క్రింది లక్షణాలు ఉంటాయనీ చెప్పలేము.

ప్రవర్తనా సంబంధమైన లక్షణాలు:

 • బయటకు వెళ్ళకుండా వుండడం
 • బడిలోగానీ, పనిలోగానీ పనులు సక్రమంగా చేయకపోవడం
 • కుటుంబ సభ్యులు, స్నేహితులకు దూరంగా వుండడం
 • మద్యం మరియు మాదక ద్రవ్యాలకు బానిసవ్వడం
 • ఆహ్లాదకరమైన అలవాట్లు ఆపివేయడం
 • ఏకాగ్రతను కోల్పోవడం

ఆలోచనలు:

 • నేను ఓడిపోయాను
 • నాదే తప్పు
 • మంచి అనేది నా జీవితంలో జరగదు
 • నేను పనికిరాని వాడిని
 • జీవించడం వృధా
 • నేను లేకుంటే మిగతావాళ్ళంతా హాయిగా వుంటారు

భావాలు:

 • ఎప్పుడూ అలసిపోయినట్లు వుండడం
 • అన్యమనస్కంగా వుండడం
 • తలనొప్పి మరియు కండరాల నొప్పులు రావడం
 • కడుపులో త్రిప్పడం
 • నిద్రలేమి
 • ఆకలి కలుగకపోవడం
 • ఎక్కువ బరువు తగ్గడం

సహాయం కోరడం చాలా అవసరం

స్తబ్దత లక్షణాలు కనపడినపుడు సహాయం కోరడం చాలా అవసరం. లేకపోతే తెలియకుండానే ఈ వ్యాధి కొన్ని నెలలు లేక సంవత్సరాల వరకు బయటపడే అవకాశం వుండదు. ఎంత త్వరగా చికిత్స పొందగలిగితే అంత తొందరగా బయటపడే అవకాశం వుంటుంది. దీన్ని తక్కువగా అంచనా వేయకూడదు.

సరియైన సమయంలో చికిత్స అందకపోతే వ్యక్తి జీవితంపై ప్రతికూల ప్రభావాలు పడి మద్యం, మాదకద్రవ్యాలు, ఉద్యోగం, కుటుంబ సమస్యలు, సంబంధ బాంధవ్యాలు అస్తవ్యస్తం అయ్యే అవకాశం వుంటుంది.

చికిత్స:

సాధారణంగా ఔషధ చికిత్స, మనఃసంబంధమైన విద్యాబోధనలు, మనోచికిత్స, విద్యుచ్చుంబకము వంటి చికత్సలను జరిపి వ్యాధి నివారణ చేయవచ్చు. స్తబ్దత నుండి నివారణ చెందడానికి ఒక నిరూపితమైన మార్గము ఏదీ లేదనే చెప్పవచ్చు. అయితే కొన్ని రకాలైన చికిత్సలు, ఆరోగ్య నిపుణుల సలహాలు పాటిస్తే ఈ వ్యాధి నుండి తప్పించుకునే అవకాశం వుంటుంది. సరియైన కాలంలో స్తబ్దతకు గురౌతున్నామన్న గుర్తింపు చాలా ముఖ్యము. అప్పుడు సరియైన చికిత్స తీసుకోవడం మరియు ఆరోగ్య నిపుణులను సంప్రదించడం చాలా ముఖ్యం.

అందుబాటులోనున్న సహాయ కేంద్రాలు:

 • Your doctor
 • Local community health centre
 • Beyondblue Support Service Tel. 1300 22 4636
 • Lifeline Tel. 13 11 14
 • Kids Helpline Tel. 1800 55 1800
 • Suicide Line Tel. 1300 651 251
 • SANE Australia Helpline Tel. 1800 18 SANE (7263)
 • Australian Psychological Society – Find a psychologist service Tel. 1800 333 497(outside Melbourne) or (03) 8662 3300 (in Melbourne)

ముఖ్యంగా గమనించవలసిందేమిటంటే స్తబ్దత సాధారణమైనది మరియు సరియైన చికిత్సతో నయం చేయవచ్చు. ప్రతీ వ్యక్తి జీవితంలోని సంఘటనలు, పరిణామాలు విభిన్నంగా ఉండవచ్చు. అందులో ఒకటి గానీ అంతకంటే ఎక్కువ గానీ పరిణామాలు ఈ స్తబ్దతకు కారణాలు కావచ్చు. నిష్ణాతులైనటువంటి ఆరోగ్య నిపుణులను అతి త్వరగా సంప్రదించి సమయోచితమైన చికిత్స పొందితే స్తబ్దతను నివారించవచ్చు. మీరు గానీ మీకు తెలిసిన వారు గానీ స్తబ్దతకు గురైనట్లు అనుకుంటే వెంటనే వైద్యుణ్ణి గానీ ఆరోగ్య నిపుణులను గానీ సంప్రదించడం మంచిది.

Dr.Sridevi Kolli
Clinical Psychologist | Aged Persons Mental Health Team | Monash Health

Send a Comment

Your email address will not be published.