స్వర్గం...నరకం

మనలో అనేకులు చెప్తుంటారు స్వర్గం, నరకం అని. కానీ స్వర్గం అంటూ విడిగా ఒక ప్రపంచం ఉందా? అలాగైతే అది ఎక్కడ ఉంది? అక్కడికి ఎలా చేరుకోవాలి? నరకం ఎక్కడ? నరకానికి  దారెటు? ఏదైనా కనుచూపుమేరలో ఉందా? వీటికి అనేక రకాల మాటలు చెప్తుంటారు. ఏదేమైనా ఒక్కటి మాత్రం నిజం. స్వర్గం అంటే మంచిది. నరకం అంటే చెడ్డది.

జెన్ సాధువులు ఇందుకు అనేక ఉదాహరణలు కథలు చెప్పారు.

ఒక జెన్ గురువు  వద్దకు ఒకడు వెళ్ళాడు.

“గురువుగారూ, స్వర్గం, నరకం అంటూ ఉంటారు…వీటిని చుట్టు తిరిగి కాకుండా తిన్నగా చెప్పండి…అర్ధం చేసుకుంటాను” అంటాడు.

సరే అని గురువు గారు “నువ్వెవరు?” అని అడిగారు.

“నేను ఒక సైన్యానికి అధిపతిని”

“అలాగా? భోజనానికి ఏం చేస్తున్నావు?”

అప్పుడు సైనికాదిపతి కోపంతో “నేను ఎవరో మీకు చెప్పాను. నేను ఓ సైన్యానికి  అధిపతిని….అర్ధం కావడం లేదా?” అన్నాడు.

“నిన్ను ఏ వెధవ ఆ పదవికి ఎంపిక చేసాడో? వాడికసలు బుద్ధి ఉందా? నా దృష్టిలో నువ్వు ఒక కసాయివాడిలా కనిపిస్తున్నావు…” అన్నారు గురువుగారు.

ఆ మాటలు విని సైనికాదిపతి రెచ్చిపోయాడు.

ఒరలో నుంచి కత్తి తీసి గురువుగారి మీదకు దాడి చేయడానికి ప్రయత్నిస్తాడు.

అయినా  గురువు గారు శాంతంగానే “ఇదే నరకం వాకిలి. ఇలాగే నీ నడవడి ఉంటే నరకంలోకి వెళ్లిపోవచ్చు. వెళ్ళు” అన్నారు.

ఆ మాటలు విని సైనికాధిపతి సిగ్గుతో తలదించాడు.

గురువుగారి కాళ్ళపై పడి క్షమించమని ప్రాధేయపడ్డాడు.

కత్తి ఒరలో పెట్టేసాడు.

“ఇదే స్వర్గం వాకిలి. ఇలాగే నీ ప్రవర్తన ఉంటే నువ్వు స్వర్గంలోకి వెళ్లిపోవచ్చు. వెళ్ళు. ఒకరిమీద అకారణంగా ఆవేశంతో రెచ్చిపోయి దాడి చేయడం నరకం…మన్నించమని అడగడం స్వర్గం” అని చెప్పారు గురువుగారు.

 

సరకులు కల్తీ చేసి వ్యాపారం చేసే ఓ వ్యాపారి వద్దకు ఒక సాధువు వచ్చారు.

“కల్తీ చేస్తే తప్పకుండా నరకం ప్రాప్తిస్తుంది. కల్తీ చేయకుండా సరకులు అమ్మితే  స్వర్గం ప్రాప్తిస్తుంది. నువ్వు ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నావు? ” అని సాధువు అడిగారు.

వ్యాపారి చెప్పిన జవాబు –

“ఎక్కడ వ్యాపారం బాగా జరుగుతుందో అక్కడికి వెళ్తాను” అని.

ఇదెలా ఉంది?

ఏదేమైనా స్వర్గమో నరకమో అవి ఎవరైనా చూసారో లేదో వేరే విషయం. కోపం లేకుండా ఉండటం ప్రధానం అన్నది జెన్ గురువుల హితబోధ.

– నీరజ, కైకలూరు

Send a Comment

Your email address will not be published.