'స్వాతి ముత్యం' అస్తమయం

శంకరాభరణం చిత్రంతో నాకు ఇంకో కొత్త తొడుగు వచ్చినట్టయ్యింది ….ఏడిద నాగేశ్వర రావు గారి స్థానం భర్తీ కానిది
– దర్శకుడు కె. విశ్వనాథ్

విలువలున్న చిత్రాలు తీశారు. సిరిసిరిమువ్వలో హీరోగా చేశాను. ఆయన మరణం తీరని లోటు. – నటుడు చంద్ర మోహన్

ఏడిద నాగేశ్వర రావు గారు నిర్మించిన చిత్రాల్లో నేను పాడనిచిత్రం లేదు. శంకరాభరణం, సాగర సంగమం చిత్రాలకు జాతీయ అవార్డులు పొందాను. చిత్రసీమ ఓ మంచి నిర్మాతను కోల్పోయింది – గాయకుడు ఎస్ పీ బాలసుబ్రమణ్యం

నేను నటుడు కావాలన్నది ఆయన కోరిక….నాలో తనను చూసుకోవాలనుకున్నారు….అందుకే నేను ఆర్టిస్ట్ అయినప్పుడు చాలా ఆనందపడ్డారు – తనయుడు శ్రీరాం

– ఇలా ఎందరెందరితోనో నాలుగు మంచి మాటలు అనిపించుకున్న మంచి నిర్మాత ఏడిద నాగేశ్వర రావు ఇక లేరు. సెప్టెంబర్ 19వ తేదీన వాంతులై క్రమంగా ఆరోగ్యం క్షీణించి అపస్మారకస్థితిలోకి వెళ్ళిపోయి చివరికి అక్టోబర్ నాలుగో తేదీ సాయంత్రం హైదరాబాద్ లోని స్టార్ ఆసుపత్రిలో ఏడిద నాగేశ్వర రావు తుది శ్వాస విడిచారు. ఆయన లేరన్న వార్తతో టాలీవుడ్ ప్రపంచం శోకతప్తమైంది.

సినీ నిర్మాణ సంస్థ పూర్ణోదయ మూవీ క్రియేషన్స్ బ్యానర్ పై మంచి విలువలున్న చిత్రాలు నిర్మించి సకుటుంబంగా చూసేలా చేసిన ఏడిద నాగేశ్వర రావు 1934 ఏప్రిల్ 24 వ తేదీన గోదావరి జిల్లాలో పుట్టి పెరిగారు. ఆయన తల్లిదండ్రులు స‌త్తిరాజు నాయుడు, పాప‌ల‌క్ష్మీ. 1954 ఏప్రిల్ 24వ తేదీన జయలక్ష్మితో వివాహమైంది. ఆయనకు భార్య, ముగ్గురు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు.

కాకినాడలో డిగ్రీ చదువుతున్న రోజుల్లో అయన దృష్టి నాటకాలపై మళ్ళింది. అనుకున్నదే తడవుగా ఆయన కళాప్రపూర్ణ రాఘవ కళాసమితి అనే సంస్థను ఏర్పాటు చేసారు. అయన వేదికపై వేసిన మొదటి నాటకం లోభి. అందులో ఆయన ఓ ఆడ వేషంలో నటించారు. కప్పలు అనే నాటకంలో ఆయన ఓ వృద్ధ పాత్రలో నటించగా ఉత్తమ నటుడు అవార్డు దక్కింది. ఆ తర్వాత సినీ పరిశ్రమపై మోజుతో ఆయన మద్రాస్ వెళ్ళారు.

నాటకాలు వేస్తున్న సమయంలోనే ఆయనకు వీ బీ రాజేంద్రప్రసాద్ తో పరిచయమేర్పడింది. ఆయన ప్రోత్సాహంతో ఆయన సినీ రంగంలోకి అడుగుపెట్టారు.

ఆకాశవాణిలో ఏ గ్రేడ్ ఆర్టిస్టుగా కొంతకాలం ఉండటం ఆయనకు సినీ పరిశ్రమలో డబ్బింగ్ ఆర్టిస్టుగా ఉండటానికి తోడ్పడింది. దాదాపు వంద సినిమాలకు డబ్బింగ్ చెప్పారు. అలాగే ఆ త‌ర్వాత సినిమాల్లోనూ మెల్ల‌మెల్ల‌గా వేషాలు వేశారు.`ఆత్మ‌బంధువు`లో ఓ వేషం వేశారు. 1962 నుంచి 1974 సంవత్సరాల మధ్య 30 సినిమాలలో నటించారు.

ఈ నేపధ్యంలోనే ఆయన త‌ల్లీకొడుకులు, ప‌సిడి మ‌న‌సులు అనే సినిమాలకు సంబంధించి ప్రొడ‌క్ష‌న్ ప‌నుల‌ను కూడా చూశారు. ఆ త‌ర్వాత గీతాకృష్ణ కంబైన్స్ కు ప‌ది పైస‌ల వాటాతో ఎగ్జిక్యూటివ్ నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రించిన ఆయన త‌న తోడ‌ల్లుడు, ముగ్గురు బావ‌మ‌రుదుల‌తో క‌లిసి పూర్ణోద‌యా ఆర్ట్ క్రియేష‌న్స్ ను మొద‌లుపెట్టారు. దేవ‌తలారా దీవించండి అనే చిత్రాన్ని తీశారు. ఆ తర్వాత 1978లో సిరిసిరి మువ్వ‌, 1979లో ఆయ‌న త‌న పూర్ణోద‌యా సంస్థ‌పై రూపొందించిన తొలి సినిమా తాయార‌మ్మ బంగార‌య్యను సోలో నిర్మాత‌గా రూపొందించారు.

అనంతరం శంకరాభ‌ర‌ణం, సీతాకోక చిలుక‌ సాధించిపెట్టిన వ‌రుస విజయాలతో ఆయన వెనుతిరిగి చూసుకోవాల్సిన అవ‌స‌రం లేక‌పోయింది.

సితార‌, సాగ‌ర‌సంగ‌మం, స్వాతి ముత్యం, స్వ‌యంకృషి, స్వ‌ర‌క‌ల్ప‌న‌, ఆప‌ద్బాంధ‌వుడు వంటి గొప్ప సినిమాల‌ను రూపొంచి ఉత్తమ అభిరుచి గల నిర్మాతగా పేరుప్రఖ్యాతులు పొందిన ఏడిద మృతి తెలుగు సినిమాకు తీర‌ని లోటు అని సినీ ప్ర‌ముఖులు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తదితరులు తమ తీవ్ర సంతాపాన్ని వ్య‌క్తం చేశారు.

Send a Comment

Your email address will not be published.