స్వామివారి బ్రహ్మోత్సవాలు

Brahmotsavamతిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో ఏటా జరిగే శ్రీ స్వామివారి బ్రహ్మోత్సవాలు మళ్ళీ వచ్చాయి. స్వామివారి బ్రహ్మోత్సవాలను నిర్వహించింది సృష్టికర్త అయిన బ్రహ్మ అని భవిష్యోత్తర పురాణంలో ఓ మాట ఉంది. బ్రహ్మదేవుడు స్వయంగా ఈ ఉత్సవాలను నిర్వహించడంతో వీటిని ‘బ్రహ్మోత్సవాలు’ అని వ్యవహరిస్తున్నారు. అయితే మరి కొందరు దానికి సంబంధం లేదని, నవాహ్నిక దీక్ష మేరకైతే నవ బ్రహ్మలు తొమ్మిది రోజులు జరిపే ఉత్సవాలు కనుక వీటిని బ్రహ్మోత్సవాలు అనడం సముచితమని అంటున్నారు.

ఏది యెట్లా ఉన్నా తిరుమలలో ప్రతిసారి ఈ బ్రహ్మోత్సవాలు పెద్దయెత్తున జరుగుతున్న మాట వాస్తవం.

శ్రీవారి బ్రహ్మోత్సవాలు మొత్తం తొమ్మిది రోజులు ఘనంగా జరుగుతుంటాయి. ఈ ఉత్సవాల సమయంలో బేడి ఆంజనేయ స్వామి ఆలయం నుంచి రాష్ట్ర ప్రభుత్వ ముఖ్యమంత్రి పట్టు వస్త్రాలను శ్రీహరి ఆలయానికి తీసుకు వెళ్లి సమర్పించి స్వామిని దర్శించడం ఆనవాయితి.

ఒక్క తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా వివిధ ప్రాంతాల నుంచి భక్తులు భారీగా తరలి వచ్చి స్వామివారిని దర్శించుకుని బ్రహ్మోత్సవాలను భక్తి పారవశ్యంతో కళ్ళారా తిలకించి తరిస్తారు.
స్వామివారి బ్రహ్మోత్సవాలు ‘అంకురార్పణ’తో ప్రారంభమవుతాయి. శ్రీవారి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను శ్రీవారి సేనాధిపతి అయిన విష్వక్సేనుడు పర్యవేక్షించే కార్యక్రమమే అంకురార్పణ. వైఖానస ఆగమోక్తంగా ఈ వేడుక నిర్వహించి బ్రహ్మోత్సవాలకు శ్రీకారం చుట్టడం సంప్రదాయం. విష్వక్సేనుడు నిర్ణీత పుణ్య ప్రదేశంలో భూమిపూజతో మట్టిని సేకరించి ఛత్రచామర మంగళ వాయిద్యాలతో ఊరేగుతూ తిరిగి ఆలయంలోకి చేరుకుంటారు. యాగశాలలో ఆ మట్టితో నింపిన తొమ్మిది పాళికలలో నవదాన్యాలతో అంకురార్పణ చేస్తారు.

ఈ కార్యక్రమానికి చంద్రుడు అధిపతి. అందుకే ఈ వేడుకలన్నీ శుక్లపక్షంలో జరుగుతాయి. పాళికలలో వేయగా మిగిలిన మట్టితో యజ్ఞకుండాలను నిర్మిస్తారు. తర్వాత పూర్ణకుంభ ప్రతిష్ఠ జరుగుతుంది. పాళికలలో వేసిన నవధాన్యాలకు నిత్యం నీరుపోసి, అవి పచ్చగా మొలకెత్తేలా చూస్తారు. అంకురాలను ఆరోపింపజేసే కార్యక్రమం కనుకే ఇదే ‘అంకురార్పణ’ అయింది.

మొదటి రోజు ధ్వజారోహణం, పెద్ద శేష వాహన సేవా ఉంటాయి. ఉదయం స్వామివారికి సుప్రభాత, తోమాలసేవలు జరిగిన తర్వాత శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామికి ఏకాంతంగా తిరుమంజన ప్రక్రియ చేసి, నైవేద్యం సమర్పిస్తారు. ఆలయసన్నిధిలోని ధ్వజస్తంభంమీద పతాకావిష్కరణ చేస్తారు. రాత్రి పెద్ద శేష వాహనంపై శ్రీదేవి, భూదేవి సమేత మలయప్ప దర్శనమిస్తారు. ఈ పెద్ద శేష వాహనాన్ని ఆదిశేషుడికి ప్రతీకగా భావిస్తారు.
రెండవ రోజు ఉదయం ఉత్సవమూర్తిని ఐదు తలలుండే చిన్న శేషవాహనం మీద ఊరేగిస్తారు. ఈ చిన్న శేషవాహనాన్ని ‘వాసుకి’కి ప్రతీకగా పరిగణిస్తారు. సాయంత్రం స్వామివారిని హంస వాహనంమీద వూరేగిస్తారు. ఈ హంసవాహనం మీద స్వామి విద్యాలక్ష్మిగా వూరేగటం గమనించదగ్గ అంశం.

మూడవ రోజు ఉదయం స్వామివారు వజ్రఖచిత కిరీటంతో, సకల ఆభరణాలతో అలంకృతమై సింహ వాహనంపై ఊరేగి భక్తులకు దర్శనమిస్తారు. రాత్రి స్వామివారు తన ఉభయ దేవేరులతో కలిసి, అచ్చమైన భోగశ్రీనివాసునిగా ముత్యాలపందిరి వాహనంపై తిరువీధులలో ఊరేగుతారు.

ఇక నాలుగవ రోజు ఉదయం స్వామివారు తన కల్పవృక్ష వాహనంలోను, సాయంత్రం సర్వభూపాల వాహనంమీద ఊరేగి భక్తులను కనువిందు చేస్తారు.

అయిదో రోజున, స్వామివారు మోహినీ అవతారంలో దర్శనమిస్తారు. ఈ మోహినీ అవతార వూరేగింపు శ్రీవారి ఆలయం నుంచీ పల్లకీపై ప్రారంభమవుతుంది. మోహినీ అవతారంలో ఉన్న స్వామి వజ్రాలు, రత్నాలు పొదిగిన హారాన్ని ధరిస్తారు. అలాగేస్వామివారి కుడిచేతిలో చిలుకను చూడవచ్చు. రాత్రి గరుడవాహన సేవ ఉంటుంది. ఈ గరుడ వాహనసేవలో స్వామి సరసన దేవేరులు కనిపించరు.

ఆరవ రోజు స్వామివారు గజ వాహనం మీద తిరువీధులలో ఊరేగుతూ భక్తులను తన్మయులను చేస్తారు. ఈ ఊరేగింపు భాగవతంలోని గజేంద్రమోక్ష ఘట్టాన్ని తలపింప జేస్తుంది.

ఏడవ రోజు మలయప్ప స్వామి సూర్యప్రభ వాహనంలోను, సాయంత్రం చంద్రప్రభ వాహనంమీద ఊరేగుతారు. చంద్రప్రభ వాహనంమీద వచ్చే స్వామి శ్వేత వస్త్రాలు, తెల్లని పుష్పాలు, మాలలు ధరించి దర్శనమిస్తారు.
ఎనిమిదవ రోజు రథోత్సవానికి అత్యంత వైభవంగా జరుగుతుంది. రథాన్ని అధిరోహించిన మలయప్పస్వామి తిరువీధుల్లో ఊరేగి భక్తులను మైమరిపిస్తారు.

చివరి రోజైన తొమ్మిదవ రోజు స్వామివారికి చక్రత్తాళ్వార్‌ రూపంలో చక్రస్నానం చేయిస్తారు. అంతకుముందు వరాహస్వామి ఆలయ ఆవరణలో శ్రీదేవి, భూదేవితో సహా అభిషేకసేవలు నిర్వహిస్తారు. అనంతరం సుదర్శన చక్రానికి స్వామి పుష్కరిణిలో పుణ్యస్నానం చేయిస్తారు. దీనినే ‘చక్రస్నాన ఉత్సవం’ అంటారు. ఈ చక్రస్నానం జరిగే సమయంలో స్వామి పుష్కరిణిలో స్నానాలు చేస్తే పాపాలు నశిస్తాయనన్నది ఆస్తికుల నమ్మిక.
ఇక చక్రస్నానాలు అయిన తర్వాత ఈ రోజు సాయంత్రం శ్రీవారి ఆలయ ధ్వజ స్తంభం మీద ఆరోహణ చేసిన గరుడ పతాకాన్ని అవరోహణం చేస్తారు. అంటే పతాకాన్ని కిందకు దించుతారు. ఈ అవరోహణంతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి.

Send a Comment

Your email address will not be published.