హుదూద్ హూంకారంతో ఉత్తరాంధ్రా విలవిల

ఉత్తరాంధ్ర ఉలిక్కిపడింది. హుదూద్ సృష్టించిన బీభత్సంతో బెంబేలెత్తింది. పెను తుఫానో ఉప్పెనో విలయమో అణువంత ప్రళయమో ఏదైతేనేం అన్నీ కలిసి ఉత్తరాంధ్రను గడగడలాడించింది. ముఖ్యంగా విశాఖపట్నం అల్లకల్లోలమైంది. గంటకు 190 కిలోమీటర్ల వేగంతో ఈడ్చికొట్టిన గాలులు… చెవులు చిల్లులు పడేటట్లు పెను శబ్దాలు…దబదబా కొట్టుకుంటున్న తలుపులు…ఉరుములూ…పిడుగులూ…విశ్వరూపం చూడంతో జనం ఇళ్ళల్లోనే బిక్కుబిక్కుమంటూ గడిపారు. తిండీ తిప్పలు మాని ప్రతి క్షణం ఒక యుగంలా గడిపారు. ఇంట్లోనే క్షేమంగా ఉండగలమా అనే భయానక క్షణాలతో గడిపారు. బయటికి వెళ్తే ఏం జరుగుతుంది అని వణికిపోయారు. రహదారులన్నీ చెల్లా చెదురయ్యాయి. భారీ చెట్లు వేళ్ళతో సహా కుప్ప కూలాయి. రోడ్లకు అడ్డంగా విద్యుత్ స్తంభాలు పడిపోయాయి. ఇళ్లు బీటలు వారాయి. రవాణా వ్యవస్థ స్తంభించింది. హోర్డింగులు ఎగిరిపోయాయి. పెట్రోల్ బంకుల పైకప్పులు లేచిపోయాయి. శాస్త్ర విజ్ఞానం ప్రాణ నష్టాన్ని నివారించగలిగింది కానీ ఆస్తి నష్టాన్ని అడ్డుకోలేకపోయింది. పోర్టు సిటీ విశాఖ ఓ విధ్వంసక నౌకలా మారిపోయింది.
జాతీయ విపత్తుగా ప్రకటించి తక్షణ సాయంగా రెండు వేల కోట్ల రూపాయలు ఇవ్వాలని ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్ర బాబు నాయుడు ప్రధానిని కోరారు.

మోడీ పరిశీలన
ప్రధాని నరేంద్ర మోడీ హుదూద్ తుఫాను కారణంగా దెబ్బ తిన్న ప్రాంతాల్లో సహాయ పునరావాస చర్యలు చేపట్టడానికి తక్షణ సాయంగా వెయ్యి కోట్ల రూపాయలు ప్రకటించారు. సర్వే అయిన తర్వాతా పూర్తి స్థాయి సాయం అందిస్తామని ఆయన హామీ ఇచ్చారు. విద్యుత్తు, తాగునీరు సరఫరా, సమాచార వ్యవస్థ పునరుద్ధరించడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆయన తుఫాను తాకిడికి ధ్వంసమైన విశాఖ పట్టణాన్ని పరిశీలించిన తర్వాత ముఖ్యమంత్రితో చెప్పారు.

ప్రధాని మోడీ భారతీయ వాయుసేన విమానంలో విశాఖకు వచ్చారు. ఆయనకు రాష్ట్ర గవర్నర్ నరసింహన్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కేంద్ర మంత్రులు వెంకయ్యనాయుడు, అశోక్ గజపతి రాజు, రాష్ట్ర మంత్రులు యనమల రామకృష్ణుడు, కామినేని శ్రీనివాస్, గంటా శ్రీనివాస రావు తదితరులు స్వాగతం పలికారు. ఆతర్వాత ప్రధాని తుఫాను పీడిత ప్రాంతాలలో నెలకొన్న స్థితిగతులను పరిశీలించారు. చంద్రబాబు, వెంకయ్య నాయుడు కలిసి ప్రధానికి తుఫాను వల్ల కలిగిన నష్టాన్ని వివరించారు.

సినీపరిశ్రమ చేయూత
ఇలా ఉండగా సినీపరిశ్రమ తుఫాను బాధిత ప్రాంతాల వారిని ఆదుకోవడం తమవంతు ఆర్ధిక సాయం చేస్తోంది. నటుడు పవన్ కళ్యాన్ సి ఎం నిధికి యాభై లక్షల రూపాయలు ఇస్తున్నట్లు ప్రకటించారు. నిర్మాత డీ రామానాయుడు కూడా యాభై లక్షల రూపాయలు ఇచ్చారు. జూనియర్ ఎన్టీఆర్ , రామ్ చరణ్, బ్రహ్మానందం, తదితరులుకూడా ఆర్ధికసాయం అందించారు. ఉత్తర అమెరికా తెలుగు సంఘం తానా దాదాపు 62 లక్షల రూపాయ ఆర్ధిక సాయాన్ని ప్రకటించింది.

Send a Comment

Your email address will not be published.