హుసేన్ సాగర్ ప్రక్షాళన

హైదరాబాద్ నగరం నడి బొడ్డున ఉన్న హుసేన్ సాగర్ చెరువును ప్రక్షాళన చేసే బృహత్తర కార్యక్రమం మరి కొద్ది రోజుల్లో ప్రారంభం కాబోతోంది. దీని మీద తెలంగాణా ప్రభుత్వం ప్రారంభ దశలో సుమారు వంద కోట్ల రూపాయలు ఖర్చు చేయబోతోంది. ఈ కార్యక్రమం పూర్తి కావడానికి ఏడాదికి పైగా పడుతుందని అంచనా. సాగర్ లోని నీటిని తోడేసి, అందులోని వ్యర్థాలను దూర ప్రాంతానికి తరలించి, చెరువులో కొత్త నీటిని పారించాలనేది ఇంజనీర్ల ఉద్దేశం. సాగర్ నీటిని శుభ్రం చేసి, తాగు నీటిగా మార్చిన తరువాత, చెరువు చుట్టూ ఆకాశ హర్మ్యాలు నిర్మించాలని, మాల్స్, కార్యాలయాలు, ఉద్యానాలు ఏర్పాటు చేయాలని తెలంగాణా ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు  సంకల్పించారు. కాగా, హుసేన్ సాగర్ చెరువును ప్రక్షాళన చేయడం, వ్యర్థాలను దూరంగా పారేయడం, అందులో తాగు నీటిని నింపడం అంత తేలికయిన విషయం కాదని పర్యావరణ వేత్తలు అభ్యంతరం చెబుతున్నారు. ఈ నీటిని, ఇందులోని వ్యర్థాలను ఎక్కడికి తరలించబోతున్నారో తెలపాలని, ఆ కలుషిత నీరు, వ్యర్థాలు ఎక్కడికి వెళ్ళినా  అక్కడ భయంకర వ్యాధులు చుట్టూ ముట్టడం ఖాయమని వారు హెచ్చరిస్తున్నారు. నగరంలోని వివిధ నాలాల  ద్వారా హుసేన్ సాగర్ లోకి మురికి నీరు ప్రవహిస్తోంది. ముందు ఆ నాలాలను మూసేసి, ఆ తరువాత ప్రక్షాళన చర్యలు చేపట్టాలని ప్రభుత్వం భావిస్తోంది.

Send a Comment

Your email address will not be published.