హేవళంబిలో మీ రాశి ఫలం

images

ఆదాయం వ్యయం రాజపూజ్యం అవమానం
మేషం 8 14 4 3
వృషభం 2 8 7 6
మిధునం 5 5 3 6
కర్కాటకం 14 2 6 6
సింహం 2 14 2 2
కన్య 5 5 5 2
తుల 2 8 1 5
వృశ్చికం 8 14 4 5
ధనుస్సు 11 5 7 1
మకరం 14 14 3 1
కుంభం 14 14 6 1
మీనం 11 5 2 4

హిందూ సంస్కృతి సంప్రదాయాలకు ఆచారాలకు మన పండగలు చక్కటి నిదర్శనాలు.
హిందువుల పండగలు స్థూలంగా మూడు రకాలు. అవి, రుతు, దేవతా, మహాపురుషుల జన్మ ప్రధానమైనవి.
ఉగాది, సంక్రాంతి వంటివి రుతుప్రదానమైనవి.

ఏటా వచ్చే పండగలలో మొదటిది ఉగాది. దీనినే సంవత్సరాది అని కూడా అంటారు. అంటే సంవత్సరానికి ఆరంభ దినం అని అర్థం. ఉగాదిని యుగాది అని చెప్పడం కూడా కద్దు. యుగం అనేది కాల భేదానికి, సంవత్సరానికి సంకేతం. కనుక యుగ + ఆది అయ్యింది.

ధర్మసిందు అనే పుస్తకం ప్రకారం చైత్ర శుద్ధ పాడ్యమి నాడు ఉగాది అని, అది పూర్తిగా దక్షిణాది వారి పండగ అని తెలుస్తోంది. ఈ ఉగాది పండగను కొన్ని చోట్ల వైశాఖ మాసంలోను, మరికొన్ని చోట్ల కార్తీకంలోను, ఇంకొన్ని చోట్ల ఫాల్గుణంలోను జరుపుకుంటున్నారు. ఇలా వివిధ ప్రాంతాలలో వివిధ మాసాలలో సంవత్సరాదులు రావడానికి కారణం కాలమానాన్ని అనేక రీతులలో లెక్కించడమే.

పూర్వులు కాలమానాలు తొమ్మిది విధాలుగా ఉన్నాయని చెప్పారు. అవి – సౌరమానం, చాంద్రమానం, నక్షత్ర మానం, బార్హస్పత్య మానం, సావన మానం, ప్రాజాపత్యమానం, పిత్రుమానం, దివ్యమానం, బ్రహ్మమానం. వీటిలో సౌర, చంద్ర, బార్హస్పత్య మానాలే వాడుకలో ఉన్నాయి.

సౌరమానం అంటే సూర్యుడు 12 రాశులలో సంచరించే కాలం. ఒకసారి 12 రాశులలో సూర్యుడు సంచరిస్తే అది ఒక సౌర సంవత్సరమవుతుంది. సౌరమానానికి 365 – పావు రోజులుంటాయి. ఈ మానాన్ని తిరుపతికి దక్షిణంగా నివసిస్తున్న వారు పాటిస్తారు. ఉదాహరణకు తమిళులు, కేరళీయులు. వంగ, పంజాబు, సింధు, అస్సాం వాసులు కూడా ఈ కాలమానాన్ని పాటిస్తారు.

సూర్యచంద్రులు 12 భాగాల (డిగ్రీలు) దూరంలో ఉన్నట్లయితే ఒక తిది అవుతుంది. అటువంటి 30 తిధులు కలిపితే ఒక మాసం అవుతుంది. 12 మాసాలైతే ఒక చంద్ర సంవత్సరం అవుతుంది. దీనినే చాంద్రమానం అంటారు. దీనికి 354 రోజులు ఉంటాయి. ఆంధ్రులు ఈ కాల పరిమాణంగానే సంవత్సరాన్ని లెక్కిస్తున్నారు.
గురువు ఒక్కొక్క రాశిలో ఒక్కొక్క సంవత్సరం ఉంటాడు. అలా నివసించే సమయాన్ని బార్హస్పత్య మానం అని అంటారు. ఈ మానానికి సంవత్సరానికి 361 రోజులు ఉన్నాయి. దీనిని వింధ్య పర్వతానికి ఉత్తరాన ఉన్న వారు వాడుతున్నారు. గుజరాతీలు, మార్వాడీలు, ఈ కాల మాన ప్రకారం పండగలు చేసుకుంటారు.
కాలం లెక్కను శకములలో కూడా మన వాళ్ళు లెక్కిస్తూ వచ్చారు. ఒకరోజు పరిపాలనాకాలం నుండి గాని, ఒక మత ప్రవక్త కాలం నుండి గాని లేదా చరిత్రలో జరిగిన ఒక గొప్ప సంఘటన నుండి గాని లెక్కిస్తూ వచ్చారు. దానికే శకం అని అంటారు. అవి యధిష్ట, విక్రమార్క, శాలివాహన, జయాభినందన, నాగార్జున, క్రీస్తు, ఫసలీసస్, హిజరీస్, శంకరాచార్య, రామానుజాచార్య, కాళీ – శాకములు ఇటువంటివే. వీటిలో ఎవరి మతం వారు వారి శకాన్ని ఆచరిస్తున్నారు. కాని ఎక్కువ వాడుకలో ఉన్నది మాత్రం క్రీస్తుశకం.
ఉగాది పండుగ అనేక విధాలుగా ప్రశస్తమైనది. చైత్ర మాసి జగత్ బ్రహ్మ ససర్ణ ప్రధమే అహని అనే ప్రామాణిక ప్రాచీనోక్తి ద్వారా అసలు బ్రహ్మదేవుడు ఈ ఉగాది నాడే జగత్ కాల సృష్టిని చేశాడని అర్థమవుతోంది. కాల కల్ప యుగ విభజన సైతం ఉగాది నుండే ప్రారంభమైంది.

సంవత్సరం అనేది వసంత కాలంలోనే మొదలవుతుంది. ఆ రోజుల్లో మాధవం, మధువు అనేవి చలామణిలో ఉన్న మాసాల పేర్లని చెప్తారు.

శ్రీరాముడు సీతాసహితంగా అయోధ్యకు ఈరొజులొనె తిరుగుప్రయాణం అయ్యాడని చెప్తారు. ఇన్ని విశేషాలున్న ఈ పండగ చాలా ప్రశస్తమైనదీ , ప్రాచీనమైనది.

ఇన్ని విధాల గణనకెక్కిన ఈ పర్వాచరణ విధానాలను ధర్మసిన్ధువు నూతన సంవత్సర కీర్తనాద్యారంభం ప్రతి గృహ ధ్వజారోహణం – నింబ పుష్పాశనం వత్సరాది శ్రవణం నవరాత్రారంభం అని చెబుతోంది. ఈ వాక్యాన్ని అనుసరించి ఏ పండుగకు మామిడి తోరణాలు కట్టకపోయినా ఉగాది నాడు మాత్రం మామిడి తోరణాలు తప్పక చేయాలని, వేప ప్రసాదం తినాలని పంచాంగ ఫలం తప్పక వినాలని చెబుతోంది. ఉగాది మొదలు శ్రీరామ నవమి వరకూ నవరాత్రోత్సవం జరపడం ప్రాచీన కాలం నుండి వస్తున్న ఆచారం అని తెలుస్తోంది.

వీటినే వసంత నవరాత్రులని, శ్రీరామ నవరాత్రులని అంటారు.

చాలా ప్రాంతాలలో ఈ రోజు నుండి చలివేంద్రాలు ప్రారంభిస్తారు.

ఈ పర్వదినం నాడు బ్రహ్మ ముహూర్తాన లేచి అభ్యంగన స్నానం చేసి నూతన వస్త్రాలు ధరిస్తారు. భగవంతుడిని పూజించి వేపపువ్వు పచ్చడిని (దీనినే ఉగాది పచ్చడి అని అంటారు) నివేదిస్తారు. దానిని ప్రసాదంగా ఇంట్లో ఉన్న వారందరూ స్వీకరిస్తారు. ఈ పండగ ప్రత్యేక తయారీ వేపపువ్వు పచ్చడే. ఈ పచ్చడిలో అన్ని రుచులూ కలిసి ఉంటాయి. దీనిలో కొత్త చింతపండు, కొత్త బెల్లం, మామిడి ముక్కలు, ఉప్పు మొదలైన పదార్ధాలు వాడతారు. షడ్రుచులు గల ఈ పచ్చడి మనిషి నిత్య జీవితంలో ఎదుర్కొనే వివిధ అనుభూతులకు ప్రతీకగా ఉంటుంది. అన్ని రకాల అనుభూతులను సమానంగా స్వీకరించాలన్న వేదాంత భావనను జ్ఞప్తికి తెస్తుంది.

ఈ పచ్చడిలో చెడుకు ప్రతీక వేపపువ్వు. ఇది క్రిమిసంహారిణి. చర్మ రోగ నివారిణి.
తీపికి ప్రతీక అయిన బెల్లం శరీర ఉష్ణాన్ని సమంగా ఉండేలా చేస్తుంది. శరీరంలో అధికంగా ఉన్న గంధకపు తీవ్రతను నియంత్రిస్తుంది. తద్వారా వేడి పొక్కులు, మొటిమలు వంటివి రాకుండా నివారిస్తుంది.
పులుపు గుణం ఉండే చింతపండు విరేచానకారి. జీర్ణకోశంలో వాయువు పేరుకొని పోకుండా నియంత్రిస్తుంది. జీర్ణ గ్రంధులను ఉత్తేజ పరచి జీర్ణ క్రియను మెరుగుపరుస్తుంది.

వగరుకి ప్రతినిధి అయిన మామిడి చిన్న ప్రేగులో వచ్చే అలర్జీలను పోగొట్టి రక్తప్రసరణ దోషాలను నివారిస్తుంది. సూర్యరశ్మికి కుమిలిన చర్మాన్ని తిరిగి యధాస్థితికి తేవడానికి ఉపకరిస్తుంది. కారానికి ప్రతి అయిన పచ్చిమిర్చిలో అనేక వ్యాధులను నివారించే గుణాలు ఉన్నాయి. ఉప్పదనానికి ప్రతీక అయిన ఉప్పు స్త్రీలకు వచ్చే అనేక రుతు సంబంధమైన వ్యాధులకు అద్భుతమైన ఔషధం.

ఈ విధంగా ఉగాది పచ్చడి వైద్యరీత్యా ఉత్కృష్టమైనది.

ఇక పంచాంగ శ్రవణం అతి ముఖ్యమైనది. భోజనానంతరం మూడు జాములు గడచిన తర్వాత స్వగృహంలో గానీ గ్రామదేవాలయంలో గానీ చావడిలో గానీ అందరూ సమావేశమై పంచాంగ శ్రవణం జరిపించడం ఆనవాయితీ.

నూతన సంవత్సరంలో సుయోగ దుర్యోగములను తమ తమ కందాయ ఫలాలను ఆదాయ వ్యయాలను స్థూలంగా భావి జీవిత క్రమాన్ని తెలుసుకుని తదనుగుణంగా ప్రవర్తిస్తారు. పంచాంగ శ్రవణం వల్ల దేశ కాల గ్రహస్థితులను కూడా తెలుసుకోవచ్చు.

కృష్ణా, గోదావరి జిల్లా ప్రాంతపు రైతులు ఉగాది నాడు ఏరువాక సాగిస్తారు. ఆనాడు వారు అభ్యంగన స్నానం చేసి నుదుట తిలకం దిద్దుకుని నూతన వస్త్రాలు ధరించి నాగలికి పాత తాళ్ళు తీసి వేసి పసుపు రాసిన కొత్త తాళ్ళను కడతారు. నాగలికి కాడికి రావి మందలు కడతారు. ఎడ్లకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెడతారు. నాగలి లేని రైతులు గడ్డపార పాతి దానికే కొబ్బరికాయ కొడతారు.

ఏరువాక సాగిన తర్వాత మూడు రోజులు ఎడ్లకు ఎలాంటి పనీ పెట్టరు. ఏరువాక సాగనిదే కొత్త సంవత్సరంలో ఎడ్ల చేత మరే వ్యవసాయ పనీ చేయించరు.

తెలంగాణాలోని కొన్ని ప్రాంతాలలో ఉగాది నాటి సాయంకాలం ఊరిలోని ఎడ్ల బండ్లను అన్నింటినీ అలంకరించి వాటికి పోటీ పెట్టి కొంతదూరానికి సాగిస్తారు.

సృష్టికర్త గౌరవాన్ని పొందిన ఈ ఉగాది పండగ సర్వజన ప్రియమైనది. తెలుగువారికి ప్రత్యేకమైనది కూడా.
ఈ హేవళంబి పర్వదిన సందర్భంలో దేశం సుభిక్షంగా ఉండాలని అందరికీ సర్వశుభాలు కలగాలని తెలుగుమల్లి ఆకాంక్షిస్తోంది.

Send a Comment

Your email address will not be published.