హైదరాబాదే అడ్డ

తెలంగాణ రాష్ట్రంలో డ్రగ్స్ వినియోగానికి సంబంధించి రోజు రోజుకూ ఆశ్చర్యకర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. హైదరాబాద్ నగరాన్ని కేంద్రంగా చేసుకుని జరుగుతున్న ఈ మత్తు పదార్థాలు వ్యాపారం, వినియోగానికి సంబంధించి పోలీసులు 18 మంది విక్రేతలను ఇంతవరకూ అరెస్ట్ చేసి విచారణ జరుపుతున్నారు. ఈ విక్రేతల విచారణలో బయటికి వచ్చినట్టుగా చెబుతున్న పలువురు సినీ, వ్యాపార, రాజకీయ ప్రముఖులకు పోలీసులు ఇప్పటికే నోటీసులు జారీ చేశారు. ఇందులో పలువురు సినీ ప్రముఖుల పేర్లను విక్రేతలు బయటపెట్టినట్టు సమాచారం. అయితే ఇందులో చాలా మంది పేర్లను విక్రేతలు కేసును తప్పు మార్గం పట్టించి గందరగోళం సృష్టించేందుకు వెల్లడిస్తున్నారని మూవీ ఆర్టిస్టుల సంఘం వ్యాఖ్యానించింది. తాము ఎవరి పేర్లనూ వెల్లడించడం లేదనీ, మీడియా వెల్లడిస్తున్న పేర్లలో ఎక్కువ భాగం ఊహా గానాలేననీ నగర పోలీస్ అధిపతి అకున్ అగర్వాల్ తెలిపారు.

Drugsనగరంలో దాదాపు రెండు లక్షల మంది ఈ మత్తు పదార్థాలు అలవాటుపడినట్టు తెలిసింది. నగరంలోని పదహారు కళాశాలలు, పాఠశాలల్లో ఈ మత్తు పదార్థాలు వినియోగం జరుగుతున్నట్టు తమ ప్రాథమిక విచారణలో బయటపడిందని, మత్తు పదార్థాలు అలవాటుపడిన యువతీ యువకుల నుంచి సమాచారం రాబడుతూనే, వారికి కౌన్సిలింగ్ కూడా ఇస్తున్నామని పోలీస్ అధికారులు చెప్పారు. ఈ విద్య సంస్థలకు చెందిన ప్రిన్సిపల్స్, ప్రధానోపాధ్యులకు కూడా పోలీసులు నోటీసులు ఇచ్చారు. డ్రగ్స్ విక్రేతల్లో ఎక్కువ మంది నైజీరియా దేశస్థులని పోలీస్ అధికారులు చెప్పారు. అంతేకాక మత్తు పదార్థాలు ఎక్కువగా గోవా నుంచి దొంగ రవాణా అవుతున్నాయని కూడా పోలీస్ విచారణలో వెల్లడయింది.

ఒక్క హైదరాబాద్ నగరంలోనే కాక, నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్, మహబూబ్ నగర్ సహా ఎనిమిది జిల్లాల్లో ఈ డ్రగ్స్ వ్యాపారం జరుగుతున్నట్టు పోలీస్ అధికారులు తమ విచారణలో గుర్తించారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో కొద్దీ స్థాయిలో విశాఖపట్నంలో డ్రగ్స్ వ్యాపారం జరుగుతున్నట్టు గుర్తించారు. మొత్తం మీద తెలుగు రాష్ట్రాల్లో ఏటా సుమారు 120 కోట్ల రూపాయల వ్యాపారం జరుగుతున్నట్టు అంచనా. ఇది ఇలా ఉండగా, తెలంగాణ రాష్ట్రంలో మత్తు పదార్థాలు విక్రయం, వినియోగం పెరగడాన్ని కేంద్రం కూడా తీవ్ర విషయంగా పరిగణిస్తోంది. దేశ సరిహద్దులు, విమానాశ్రయాలలో తనిఖీలను ముమ్మరం చేసినట్టు వార్తలు వస్తున్నాయి. మత్తు పదార్థాలు విక్రయాన్ని ప్రధాని తీవ్ర విషయంగా తీసుకున్నారని, హోమ్ మంత్రి రాజనాథ్ సింగ్ ఎప్పటికప్పుడు ఈ కేసు దర్యాప్తుపై ఆరా తెస్తున్నారని కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ వెల్లడించారు.

సినీ రంగంలో దాదాపు మూడు దశాబ్దాల నుంచి మత్తు వినియోగం గురించి వార్తలు వినవస్తున్నప్పటికీ, సినీ ప్రముఖులు మత్తు పదార్థాలు విక్రయంలో ఉన్న విషయం మాత్రం సంచలనం కలిగించే వార్తే. ప్రముఖ హీరో రవితేజ తమ్ముడు భరత్ ఈ వ్యాపారంలో ఉన్నట్టుగా మొదటిసారిగా కొద్దీ నెలల కిందట వెల్లడయినప్పుడు రాష్ట్రం ఉలిక్కిపడింది. భరత్ ఈ మధ్య రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో ఈ వ్యవహారం తాత్కాలికంగా మరుగున పడింది. ఈ సమయంలో అనేక మంది సినీ ప్రముఖులకు ప్రమేయం కల్పిస్తూ వార్తలు గుప్పుమనడం సంచలనం కలిగిస్తోంది.

Send a Comment

Your email address will not be published.