హైదరాబాద్ లో మరో ఫిలిం సిటీ

హైదరాబాద్ నగరంలో మరో ఫిలిం సిటీ నిర్మించాలని తెలంగాణా ప్రభుత్వం యోచిస్తోంది. నగరాన్ని ఫిలిం హబ్ గా మార్చాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు రాష్ట్ర ఐ.టి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి కె.తారక రామా రావు తెలిపారు.

నగరంలో ఇప్పటికే రామోజీ ఫిలిం సిటీ ఉన్న సంగతి తెలిసిందే. కొత్త ఫిలిం సిటీ కోసం స్థల సేకరణలో ఉన్నట్టు ఇక్కడ ఒక కార్యక్రమంలో ప్రకటించారు.

నగరాన్ని స్టూడియోలు, షూటింగ్ హబ్ గా మార్చాలని, అన్ని భాషల చిత్రాలు ఇక్కడే నిర్మించగలగాలని ఆయన అన్నారు. నగరంలో చిత్ర నిర్మాణానికి ఇతర రాష్ట్రాలవారే కాకుండా, విదేశీయులు సైతం క్యూ కడుతున్నారని, డిమాండ్ ఉన్నందువల్లె మరో ఫిలిం సిటీ అవసరమవుతోందని ఆయన వివరించారు. కొత్త ఫిలిం సిటీ నిర్మాణానికి వెయ్యి ఎకరాల భూమి, కనీసం 1200 కోట్ల రూపాయలు అవసరం అవుతాయని ప్రభుత్వం ప్రాథమికంగా అంచనావేసింది. త్వరలో ఇందుకు ప్రతిపాదనలు రూపొందించడం జరుగుతుందని, అయిదేళ్ళలో దీన్ని పూర్తి చేయడం జరుగుతుందని ఆయన తెలిపారు.