హైదరాబాద్ లో వాల్మార్ట్

walmartప్రపంచంలో ప్రసిద్ధి పొందిన కంపెనీలన్నీ తమ విస్తరణ ప్రణాళికలో హైదరాబాద్ నగరానికి అగ్ర తాంబూలం ఇస్తున్నాయి. ప్రభుత్వ పారిశ్రామిక విధానాలు, పెరిగిన జీవన నాణ్యతా ప్రమాణాలు, భద్రత, పౌరుల కొనుగోలు శక్తికి అంతర్జాతీయ సంస్థలు ఫిదా అయిపోతున్నట్టు కనిపిస్తోంది. తాజాగా అంతర్జాతీయ వాల్ మార్ట్ సంస్థ హైదరాబాద్ నగరంలో పెద్ద ఎత్తున తన కార్యకలాపాలు ప్రారంభించింది. ఇప్పటికే తన కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకున్న ఈ సంస్థ అతి త్వరలో నగరంలో ఏకంగా 10 క్రయ విక్రయ కేంద్రాలను ఏర్పాటు చేయడానికి సన్నాహాలు ప్రారంభించింది. నగరంలోని రాజేంద్ర నగరంలో తన కార్యాలయాన్ని కేంద్రంగా చేసుకుని ఈ సంస్థ దసరా లోపల తన మొదటి కేంద్రాన్ని ఆరంభించాలనే సంకల్పంతో ఉంది. ఈ అంతర్జాతీయ రిటైల్ సంస్థ 95 శాతం స్థానిక ఉత్పత్తులతో వ్యాపారం నిర్వహిస్తామని చెబుతోంది. ముంబై, కోల్కతా, బెంగళూరు, చెన్నై ల కంటే తాము ఈ నగరానికే ప్రాధాన్యం ఇవ్వదలచినట్టు సంస్థ కార్య నిర్వాహక అధికారులు వెల్లడించారు.

ఇది ఇలా ఉండగా, డి మార్ట్, ఐకియా, అమెజాన్ వంటి అంతర్జాతీయ సంస్థలు కూడా నగరంలో తమ కార్యకలాపాలు మరింతగా పెంచుకోవాలని చూస్తున్నాయి. హై టెక్ సిటీ సమీపంలో ఐకియా తన కార్యాలయాన్ని వెయ్యి కోట్ల వ్యయంతో ఏర్పాటు చేసుకోబోతోంది. ఈ అంతర్జాతీయ సంస్థ దేశవ్యాప్తంగా ఇరవై అయిదు కేంద్రాలను ప్రారంభిస్తోంది.

Send a Comment

Your email address will not be published.