ఆంద్ర ప్రదేశ్ కి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక హోదా ఇస్తుందనే భావిస్తున్నాను అని జన సేన అధినేత పవన్ కళ్యాన్ ఆశాభావం వ్యక్తం చేసారు. ఈ విషయమై మరికొంత కాలం ఆగి చూద్దాం అని అన్నారు. ఒకవేళ అప్పటికీ కేంద్రం నుంచి సానుకూల స్పందన లేకపోతే ఎలా సాధించుకోవాలో ఆలోచిద్దాం అని చెప్పారు.
పవన్ కళ్యాన్ ఆగస్ట్ 28వ తేదీన హైదరాబాదులో భూసేకరణ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కొంత విరామం ఇచ్చినందుకు ధన్యవాదాలు చెప్పారు. రాజధాని ఏర్పాటులో భూసేకరణ దిశలో అడుగులు వేస్తున్నందుకు మంత్రులు ప్రత్తిపాటి పుల్లారావు, నారాయణ, మరికొందరు మంత్రులకు పవన్ కృతజ్ఞతలు తెలిపారు. పైగా రైతుల మనోభావాలను సానుభూతితో పరిశీలించిన ముఖ్యమంత్రి నారా చంద్ర బాబు నాయుడికి ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. సేకరణ కాకుండా భూ సమీకరణ అంశంలో రైతులను ఒప్పించేలా ప్రయత్నిస్తే బాగుంటుందని పవన్ అభిప్రాయపడ్డారు.
ఇదిలా ఉండగా, రాజధాని ప్రాంత రైతులకు నష్టం రాకుండా, రాజధాని నిర్మాణానికి అడ్డంకులు రానివిధంగా పవన్ అటు ప్రభుత్వం, ఇటు రైతుల మధ్య మధ్యవర్తిత్వం వహించే వీలున్నట్టు వార్తలు వస్తున్నాయి.