హోలీ ...రంగుల నీళ్ళతో సంబరాల హోలీ

నేను పుట్టిపెరిగింది మద్రాస్ లోనే. చదువుకున్నది, ఉద్యోగ పర్వంలో ఎక్కువ కాలం గడిపింది కూడా నాకు ఎప్పటికీ ఇష్టమైన మద్రాస్ లోనే. అయితే అక్కడ హోలీ జరుపుకోవడం తెలిసేది కాదు. గుజరాతీ వాళ్ళు, మార్వాడీలు ఉండే కొన్ని చోట్ల మాత్రం హోలీ పండగ రోజు ఒకరిపై ఒకరు రంగుల నీళ్ళు పోసుకోవడం చూసేవాడిని. వాళ్ళు తమ మధ్యే ఈ వేడుక జరుపుకునే వారు తప్ప మరొకరి జోలికి వచ్చే వాళ్ళు కారు. అయితే నేను 1982 లో  హైదరాబాద్ వచ్చిన మరుసటి సంవత్సరం ఈ పండుగ గురించి తెలుసుకోవాలనే ఆసక్తి కలిగింది. నేను, మా అన్నయ్య, మరో ఇద్దరు మిత్రులు ఒక రూం లో అద్దెకున్నప్పుడు మరి కొందరు మిత్రులు రంగుల నీళ్ళు పట్టుకొచ్చి నా  మీద పొయ్యడానికి వచ్చారు. నేను వెంటనే తలుపు గడియపెట్టి కిటికిలో నుంచి నా మీద రంగు నీళ్ళు పోయ్యనంటే బయటకు వస్తానని చెప్పాను. వాళ్ళు అలాగే అని తీరా నేను బయటకు రావడంతోనే రంగు నీళ్ళు పొయ్యనే పోశారు. నెంత అరిచి గీ పెట్టినా వినిపించుకోలేదు. ఇదంతా క్షణాల్లో జరిగిపోయింది. ఈ సంఘటన తర్వాత అసలు హోలీ అంటే ఏమిటో తెలుసుకోవాలనే ఆరాటం కలిగింది.
ఫాల్గుణ మాసంలో పొర్ణమి రోజున ఎంతో ఆనందంగా ఉత్సాహంగా జరుపుకునే హోలీ పండుగానే హోలికా, హోలికా దాహో, కామ దహనం అని అంటారు. హోలీ పండగ వసంత రుతువు ఆగమనాన్ని తెలియచెప్తుంది.
పూర్వం హోలికా అనే రాక్షసి ఉండేది. అది రోజుకో చంటి బిడ్డను చంపి తినేసేది. ఆ రాకాసి చర్య ఆ గ్రామస్తులందరికీ గర్భశోకాన్నికలిగించింది. ఇలా రోజులు సాగిపోతున్నాయి. ఒకరోజు ఒక వృద్ధురాలు తన మనవరాలిని రాకాసి వద్దకు పంపవలసి వచ్చింది. ఆమె ఈ దారుణానికి అడ్డుకట్ట వెయ్యాలనుకుని తమ గ్రామానికి సమీపంలో ఉంటున్న ఒక ముని దగ్గరకు వెళ్లి తమ బాధంతా చెప్పుకుంటుంది. మీరే ఇందుకు ఒక మార్గం చెప్పాలని వేడుకుంటుంది. అప్పుడు ఆ ముని ఇలా అంటాడు ….
“నువ్వు బాధ పడకు. శాపగ్రస్తురాలైన ఆ రాక్షసిని మీరందరూ కలిసి నోటికొచ్చినట్లు తిట్టండి. దానితో ఆ రాక్షసి ఆయువు క్షీణించి ప్రాణాలు కోల్పోతుంది” అని.
ముని చెప్పినట్లే ఆ వృద్దురాలు గ్రామంలో ఉన్న వాళ్ళను ఒక చోటకు రమ్మనమని చెప్పి రాక్షసిని తిట్టడం మొదలు పెడుతుంది. గ్రామస్తులందరూ ఆపకుండా చాలాసేపు దుర్భాషలాడతారు. అంతే కాస్సేపటికే హోలికా రాక్షసి చచ్చిపోతుంది. గ్రామస్తులకు రాకాసి నుంచి విముక్తి కలుగుతుంది. అందరూ కలిసి హోలికను తగలపెడతారు. వసంతమాడతారు. పరస్పరం రంగుల నీళ్ళు చల్లుకుంటారు. ఇంతకూ ఈ హోలిక ఎవరో కాదు. హిరణ్యకశిపుడి సోదరి. హిరణ్యకశిపుడి పుత్రుడు ప్రహ్లాదుడు. ప్రహ్లాదుడు గొప్ప విష్ణు భక్తుడు.  హిరణ్యకశిపుడికి పుత్రుడి వైనం గిట్టేది కాదు. ఎలాగైనాసరే కొడుకు మనసు మార్చాలని నానా  కష్టాలూ పెడతాడు. అయినా ప్రహ్లాదుడు మారడు. నారాయణ నామస్మరణ మానలేదు. కొడుకుని ఏం చెయ్యాలని హోలికతో కలిసి ఆలోచిస్తాడు.” ప్రహ్లాదుడి సంగతి నేను చూసుకుంటానులే…. నువ్వు దిగులు పడకు” అని ఆమె అంటుంది. ఆమె మేనల్లుడు ప్రహ్లాదుడిని ఎత్తుకుని పెద్ద మంటలో దూకుతుంది. తనను మంటలు ఏమీ చెయ్యదన్నభావనతో అలా చేస్తుంది. కానీ జరిగింది వేరు. హోలిక ఆ మంటల్లో దగ్ధమై పోతుంది. ప్రహ్లాదుడు మంటల్లోనే కూర్చుని ధ్యానం చేస్తాడు. మంట అణగారిన తర్వాత ప్రహ్లాదుడు ఏ ప్రమాదమూ జరగకుండా లేచి బయటకు వస్తాడు అనే కథ  కూడా ఉంది.
ఇక్కడే ఇంకొక కథ  చెప్పుకోవలసి ఉంది.
ఒకసారి పార్వతిదేవి తన ప్రభావంతో శివుని కళ్ళు మూతలు పడేటట్లు చేస్తుంది. శివుడు అలా కళ్ళు మూసుకున్నప్పుడు ప్రపంచమంతా చీకటిగుయ్యారం అవుతుంది. శివుడికి కోపం వస్తుంది. పార్వతిని ఆగ్రహించి కించపరుస్తాడు. అప్పుడు పార్వతి కైలాశంనుంచి బయలుదేరి కాంచీపురం వచ్చి శివుడు ప్రేమాభిమానాలు మళ్ళీ పొందడం కోసం ఒక మామిడి చెట్టు కింద తపస్సు చేస్తుంది. ఫాల్గుణ పొర్ణమి నాడు శివుడు పార్వతి ఎదుట ప్రత్యక్షమై పూర్వంలా తగిన రీతిలో ప్రేమ, అభిమానం చూపుతాడు. అప్పుడు హోలీ ప్రారంభమైంది అనే కధనమూ ప్రాచుర్యంలో లేకపోలేదు.
ఇలా  హోలీ గురించి రకరకాల ప్రస్తావనలు చెప్పుకోవడం తెలుసుకున్నాను.
ఇక హోలీకి వారం ముందు నుంచే స్త్రీలు ఒక బృందంగా ఏర్పడి బుట్టలతో ఇంటింటికీ వచ్చి బుట్టలను వాకిలి ముందు ఉంచి హోలీ హోలీరా రంగ హోలీ…..చమకేలిరా హోలీ అని చప్పట్లు కొడుతూ పాట పాడి డబ్బులు అడుగుతారు.
రంగు నీళ్ళ విషయానికి వస్తే పూర్వం మోదుగ పూలు తీసుకొచ్చి రోటిలో వేసి దంచి దానిని నీళ్ళల్లో కలిపి ఒకరి పై ఒకరు పోసుకునేవారు. కానీ ఇప్పుడు రంగు  పౌడర్లు నీళ్ళల్లో కలిపి వసంతమాడుతున్నారు. ఈ కృత్రిమ రంగులు మంచివికావని చెప్తున్నా వినే వారెవరు? పండగ రెండు రోజుల ముందునుంచే దుకాణాల దగ్గర రంగు పౌడర్లు అమ్ముతుంటారు.
ఏదేమైనా ఈ వసంతం నాకు కాస్తంత ఇష్టమే.
– యామిజాల జగదీశ్

Send a Comment

Your email address will not be published.