హోలీ..డోలీ..హోలీ..

వచ్చింది వచ్చింది హోలీ ….వర్ణాలు వెదజల్లుకుంటూ ….
ప్రతి ఏటా దేశవ్యాప్తంగా ఫాల్గుణ మాసం పూర్ణిమ తిథి రోజు ఎంతో ఆనందంతో జరుపుకునే పండుగ హోలీ….మన దేశంలోనే కాకుండా నేపాల్, బంగ్లాదేశ్ తదితర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు కూడా జరుపుకునే పండుగ హోలీ.

హోలీ వస్తూ వస్తూనే వసంత రుతువు రాకను తెలియజేస్తుంది.

పూర్వం రఘు మహారాజు హోలిక అనే రాక్షసిని చంపిన రోజుగా ఈ హోలీ పండుగ చేసుకోవడం ఆనవాయితి. ఈ హోలీనే కాముడి పున్నమి అని, డోలికా ఉత్సవం అని, ఫాల్గుణ ఉత్సవం అని రకరకాల పేర్లతో పిలుస్తారు.

అయినా హోలీ అనగానే అందరికీ గుర్తుకు వచ్చేది రంగులే రంగులు.

హోలీ గురించి భిన్నమైన కథలు వాడుకలో ఉన్నాయి.

ఫాల్గుణ మాసంలోని పౌర్ణమి రోజున చిన్నికృష్ణుడిని డోలికలో అంటే ఊయలలో వేసిన రోజుగా బెంగాల్ లో కృష్ణుడి ప్రతిమను డోలికలో ఉంచి అటు ఇటూ ఊపుతూ ఈ ఉత్సవాన్ని జరుపుకుంటారు. పాటలు పాడతారు.

ఇక మరో కథలోకి వెళ్దాం….
దక్షయజ్ఞం సమయంలో అగ్నికి ఆత్మాహుతి అయిన సతీదేవి హిమవంతుడి కూతురిగా పుడుతుంది. ఆమెకు పార్వతి అని పేరు పెడతారు. సతీదేవి వియోగ భారంతో పరమేశ్వరుడు ఎప్పుడూ తపో దీక్షలో ఉంటాడు. ఆ స్వామికి పరమేశ్వరుని పై భక్తి భావంతో పార్వతి నిత్యమూ పూజలు చేస్తూ సేవలు చేస్తూ ఉంటుంది.

మరోవైపు దేవతలు పార్వతీ పరమేశ్వరులకు కల్యాణం చెయ్యాలనుకుని మన్మధుడిని ఆశ్రయిస్తారు. సరేనని అందుకు మన్మధుడు సమ్మతిస్తాడు. పార్వతీ దేవి పరమేశ్వరుడికి సపర్యలు చేసే సమయాన్నే సరైన సమయంగా తలచి మన్మధుడు పరమేశ్వరుడిపై పూల బాణం ప్రయోగిస్తాడు.

ఆత్మధ్యానంలో ఉన్న పరమేశ్వరుడి మనసులో కోర్కెలు పుడతాయి. ఈ విధంగా పార్వతీ పరమేశ్వరుల పెళ్ళికి కారంయ్యాడు మన్మధుడు.

మన్మధుడిని దేవతలు అభినందిస్తారు.

అయితే పరమేశ్వరుడు తానూ కామ వికారాలకు ఏ విధంగా లోనయ్యానా అని అనుకుని దివ్య దృష్టితో చూడగా మన్మధుడు కనిపిస్తాడు. అంతే తక్షణమే పరమేశ్వరుడు తన మూడో కంటితో మన్మధుడిని బుగ్గిపాలు చేస్తాడు.

ఈ విషయం తెలుసుకుని రతీదేవి శివపార్వతుల వద్దకు వచ్చి తనకు పతి భిక్ష పెట్టమని ప్రాధేయపడుతుంది. అంతట పార్వతి ఈశ్వరుడుని శాంతింప జేసి రతీదేవికి మన్మధుడు ఆశరీరరూపంతో సజీవుడిగా ఉండేటట్లు మాంగల్య భాగ్యం కల్పిస్తుంది. ఆరోజు ఫాల్గుణ పూర్ణిమ కావడం వల్ల కాముడి పున్నమిగా వేడుక జరుపుకుంటారు.

ఇక హోలిక వృత్తాంతం చూద్దాం.

ఒకానొకప్పుడు హోలిక అనే రాక్షసి ఉండేది. ఆమె రోజూ ఒక శిశువుని చంపి తింటూ ఉండేది. ఇలా ఆమె ఒక పల్లెలో ఉన్న వారికి గర్భశోకం కలిగించింది. ఒకరోజు ఒక వృద్ధురాలి మనవడిని హోలికకు ఆహారంగా పంపవలసి ఉంటుంది. అప్పుడు ఆ వృద్ధురాలు ఎలాగైనా తన మనవడిని కాపాడుకోవడం కోసం ఆ ఊరి చివర్లో దీక్షలో ఉన్న ఒక మహర్షి దగ్గరకు వెళ్లి తన బాధ చెప్పుకుంటుంది.

అప్పుడు ఆ మహర్షి “తల్లీ, నువ్వు బాధ పడకు. ఆ రాక్షసి శాపం వల్ల అలా చేస్తోంది. ఆ రాక్షసిని ఎవరైనా చిత్తమొచ్చినట్లు నానా విధాలుగా తిడితే ఆమె ఆయువు క్షీణించి వెంటనే చనిపోతుంది. మీ గ్రామస్తులందరూ నేను చెప్పినట్లు చేయండి” అని సూచిస్తాడు.

మరుసటిరోజు అందరూ కలిసి సమావేశమై మహర్షి చెప్పినట్టే చేస్తారు. అంతే గ్రామస్తుల తిట్ల దండకానికి హోలిక కుప్పకూలి చనిపోతుంది. ఆమె చనిపోయిందన్న ఆనందంతో గ్రామస్థులు చితిమంటలో హోలికను తగులబెట్టి వసంతాలు చల్లుకుని నృత్యాలు చేస్తారు. ఆరోజు నుంచి హోలీ పండుగ వాడుకలోకి వచ్చినట్టు మరికొందరి కథనం.

హోలీ రోజున రంగుల చూర్ణాన్ని, రంగు నీటిని ఒకరిపై ఒకరు చల్లుకుంటూ సంబరాలు చేసుకుంటారు.

హోలీ ముందు రోజు హిరణ్యకశ్యపుడి చెల్లెలైన హోలిక దిష్టి బొమ్మకు నిప్పంటిస్తారు. దీనిని హోలిక దహన్ లేదా చోటీ హోలీ అని అంటారు. హిరణ్యకశిపుని చెల్లెలైన హోలిక అనే రాక్షసి ప్రహ్లాదుడిని మంటలలో వేసినప్పుడు దైవలీలతో తప్పించుకుంటాడు. అందుకే భోగి మంటలు అంటిస్తారు. హోలిక ఈ మంటలలో దహనమైంది కానీ విష్ణువుకు పరమ భక్తుడైన ప్రహ్లాదుడు తన భక్తి ప్రపత్తులతో ఎలాంటి గాయాలూ లేకుండా తప్పించుకుంటాడు. మన రెండు తెలుగు రాష్ట్రాలలో హోలిక దహన్‌ను కామ దహనం అని అంటారు.

భగవంతుడైన కృష్ణుడు పెరిగిన ఉత్తర భారత ప్రాంతాలైన మథుర, బృందావనంలలో 16 రోజులపాటు హోలీని ఘనంగా జరుపుకొంటారు.

హోలీ పండుగ వేళ ఇంటికి వచ్చిన అతిథులకు గుజియా అప్పడాలు, కంజి, మల్పాస్, దహి బదాస్ వంటి రకరకాల ఫలహరాలను వడ్డిస్తారు. హోలీ రోజు రాత్రి కొన్ని ప్రాంతాలలో బంగు తాగుతారు. .

పంజాబ్‌ సిక్కులు కూడా ఈ పండుగను జరుపుకుంటారు. ఇక్కడ హోలీని హోలా మోహల్లా అంటారు.

ఉత్తర్ ప్రదేశ్ లోని బర్సాన ప్రదేశం హోలీ పండుగకు చాలా ప్రసిద్ధి. ఇక్కడున్న రాధారాణి ఆలయంలో లాత్ మార్ హోలీ అనే క్రీడను భారీ ఎత్తున నిర్వహిస్తారు. ఈ రోజున అనేకమంది సాక్షిగా స్త్రీలు పురుషులను కర్రలతో కొడతారు. హోలీ పాటలు పాడతారు. బీహార్‌లో కూడా హోలీని ఎంతో ఘనంగా జరుపుకొంటారు.

ఒడిషా, గుజరాత్ తదితర రాష్ట్రాలలోనూ హోలీ వేడుకలు ఘనంగా నిర్వహిస్తారు. గుజరాతీయులు హోలీ పండుగ రోజున ఎంతో ఉత్సాహముతో మంటల చుట్టూ నృత్యాలు చేస్తారు.

– చౌటపల్లి నీరజ

Send a Comment

Your email address will not be published.