40 ఏళ్ల అల్లూరి సీతారామరాజు

మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు ఓ మహోజ్వల శక్తి
—————————————————————
భారత స్వాతంత్ర్య చరిత్రలో ఓ  మహోజ్వల శక్తి  అల్లూరి సీతారామరాజు. ఆయన  జరిపిన సాయుధ పోరాటం ఓ  ప్రత్యేక అధ్యాయంగా స్వాతంత్ర్య చరిత్రలో నమోదైంది.
ఆయన  ఇంటిపేరు అల్లూరి. ఈ ఇంటి పేరున్న వాళ్ళు తూర్పు గోదావరి జిల్లా  కోమటిలంక, బట్టేలంక గ్రామాలలో స్థిరపడ్డారు. అల్లూరి వీరభద్రరాజుకు  ఆరుగురు కుమారులు. వీరిలో గోపాలకృష్ణంరాజు కొడుకు వెంకటకృష్ణంరాజు సీతారామరాజుకు తాత. వెంకట రామరాజు, సూర్యనారాయణమ్మలకు అల్లూరి సీతారామ రాజు 1897 జూలై 4 న జన్మించారు. ఈ దంపతులకు సీతమ్మ అనే కుమార్తె, సత్యనారాయణరాజు అనే మరొక కుమారుడు కూడా ఉన్నారు.
మన్యం వీరుడైన  అల్లూరి సీతారామరాజు అసలుపేరు “శ్రీరామరాజు”. ఆయన  తాత (మాతామహుడు) మందపాటి రామరాజు పేరే ఆయనకు పెట్టారు.
ఆరవ తరగతి చదువుతున్న వయసులోనే తండ్రిని కోల్పోయిన  రాజు జీవితంలో పెనుమార్పులే తీసుకువచ్చింది. భీమవరంలో మిషన్ హైస్కూలులో మొదటి ఫారంలో చేరి రోజూ కొవ్వాడ నుండి నడచి వెళ్ళేవారు. ఆ సమయంలో  నర్సాపురం దగ్గరి చించినాడ అనే గ్రామంలో స్నేహితుడి ఇంటిలో గుర్రపుస్వారీ నేర్చుకున్నారు. రాజమండ్రిలో ఆరవ తరగతి, రామచంద్రాపురంలో ఏడవ తరగతి ప్యాసైన సీతారామ రాజు  కాకినాడ పిఠాపురం రాజా పాఠశాలలో మూడవ ఫారంలో చేరారు.  ఆయనకు 14 వ ఏట ఉపనయనం చేసారు.  విశాఖపట్నంలో నాల్గవ ఫారంలో చేరారు.  అక్కడ సరిగా చదవకపోవడంవల్ల, కలరా వ్యాధి సోకడంవల్ల పరీక్ష తప్పారు. ఆవెంటనే  నర్సాపురంలో మళ్ళీ నాల్గవ ఫారంలో చేరారు. అయితే బాబాయి మాట పడక  కోపగిన్చుకుని, ఇల్లు వదలి, తల్లివద్దకు తుని వెళ్ళిపోయారు. అక్కడే ఐదవ ఫారంలో చేరారు. ఒకసారి ప్రధానోపాధ్యాయుడు కొట్టారు.  దానితో  శాశ్వతంగా చదువు మానేశారు.
వత్సవాయి నీలాద్రిరాజు వద్ద జ్యోతిష్యం, వాస్తు శాస్త్రం, హఠయోగం, కవిత్వం నేర్చుకున్నారు.  సూరి అబ్బయ్యశాస్త్రి వద్ద సంస్కృతం, ఆయుర్వేదం నేర్చుకున్నారు. బాల్యం నుండే ఆయనలో దైవ భక్తి, నాయకత్వ లక్షణాలు, దాన గుణం ఎక్కువే.
1916 ఏప్రిల్ నెలలో ఉత్తరభారతదేశ యాత్రకు బయలుదేరిన ఆయన లక్నోలో జరిగిన కాంగ్రెసు మహాసభకు హాజరయ్యారు.  ఆయనకు  తల్లిపై అపారమైన భక్తి ఉండేది. ఆమెకు  పాదాభివందనం చేసిన తర్వాతే బయటకు వెళ్ళేవారు. యుద్ధవిద్యల్లోను, ఆయుర్వేద వైద్యవిద్యలోను ప్రావీణ్యం ఉండడంతో  ఆయన అనతికాలంలోనే చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలకు ఆరాధ్యులయ్యారు. మన్యం వాసుల కష్టాలను తీర్చటానికి, ఆంగ్లేయుల  దోపిడిని ఎదుర్కోవడానికి గిరిజనులకు ఆండగా నిలిచి పోరాటం చేసారు.
గిరిజనులపై దోపిడీ చేసిన బ్రిటీషు అధికారులలో చింతపల్లి తహసీల్దారు బాస్టియన్ కు దయా, కరుణ, జాలీ వంటివి లేవు.  తనపై ఫిర్యాదు చేసారనే కోపంతో బాస్టియన్ ఆయనపై ప్రభుత్వానికి ఒక నివేదిక పంపారు. అప్పట్లోనే ఆయన  గిరిజనులను కూడగట్టి విప్లవానికి సన్నాహాలు చేశారు. దీనితో ఆయనపై
ఎప్పుడూ పోలీసుల  నిఘా ఉండేది. అంతే కాదు ఆయనకు  ప్రవాస శిక్ష విదించారు.  పోలవరంలో డిప్యూటీ కలెక్టరుగా పనిచేస్తున్న ఫజులుల్లా ఖాన్ సహకారంతో ఆ  శిక్షను తప్పించుకుని మళ్ళీ  మన్యంలోఅడుగుపెట్టి  విప్లవానికి కదం తొక్కారు. పోలీసు స్టేషన్లపై దాడి చేసి ఆయుధాలు ఎత్తుకెళ్ళడంతో విప్లవానికి శ్రీకారం చుట్టారు. 1922 ఆగస్టు 22న మన్యం విప్లవం ఆరంభమైంది. రంపచోడవరం ఏజన్సీలోని చింతపల్లి పోలీసు స్టేషనుపై 300 మంది విప్లవ వీరులతో రాజు దాడిచేసి, రికార్డులను చింపివేసి, తుపాకులు, మందుగుండు సామాగ్రిని తీసుకువెళ్ళారు. ఆయన సారధ్యంలో జరిగిన వరుసదాడులతో దెబ్బతిన్న బ్రిటీషు ప్రభుత్వం విప్లవ దళాన్ని అంతం చెయ్యడానికి పూనుకున్నది.
ఆయనను పట్టుకోవడానికి బ్రిటిష్ ప్రభుత్వం ప్రయత్నాలను ముమ్మరం చేసింది. ఆయన కదలికలను నిశితంగా అనుసరించింది. సీతారామ రాజు  విప్లవదళానికి మొదటి సారి తగిలిన ఎదురుదెబ్బలో  రాజు అనుచరులు నలుగురు చనిపోయారు. కొన్ని ఆయుధాలు పోలీసుల వశమయ్యాయి. ఆ వెంటనే మరోసారి జరిగిన  భీకర పోరులో ఇంకో 8 మంది విప్లవకారులు ప్రాణాలు కోల్పోయారు. క్రమంగా రాజు దళానికి, ప్రభుత్వ దళాలకు మధ్య పోరు తీవ్రరూపం దాల్చింది. ఆ తర్వాత అనేక మలుపులు జరిగి ఒకరోజు ఆయన ఏటి ఒడ్డున స్నానం చేస్తుండగా పోలీసులు చుట్టుముట్టి అదుపులోనికి తీసుకున్నారు. కొయ్యూరులో ఉన్న మేజర్ గుడాల్ వద్ద ఆయనను  హాజరు పరిచారు. బందీగా ఉన్న అల్లూరి సీతారామ రాజును ఒక చెట్టుకు కట్టేసి ఎటువంటి  విచారణ లేకుండా 1924 మే 7వ తేదీన గుడాల్ కాల్చి చంపారు. ఆయన మరణ వార్తను  తల్లికి కూడా చెప్పలేదు. ఆయన మృతదేహానికి ఫోటో తీసిన తర్వాత దహనం చేసారు. ఆయన అస్తికలను  వరాహ నదిలో కలిపారు. ఆ విధంగా 27 ఏళ్ళ వయసులోనే అల్లూరి సీతారామరాజు అమరులయ్యారు.
అల్లూరి సీతారామ రాజు చిత్రం …
ఇలా ఉండగా కృష్ణ సీతారామ రాజుగా నటించిన అల్లూరి సీతారామ రాజు చిత్రం విడుదలై ఈ మే నెలకు 40  సంవత్సరాలు అయ్యింది. 1974 మే ఒకటిన ఈ చిత్రం విడుదల అయ్యింది. అగ్గిరాముడు అనే చిత్రంలో నాజర్ బృందం అల్లూరి సీతారామరాజుపై చెప్పిన బుర్రకథ చూసినప్పటినుంచి ఆయన ఆ తర్వాత ప్రజానాట్య మండలి వారి సీతారామరాజు నాటకం చూసి చేస్తే అలాంటి పాత్ర చేయాలనుకున్నారు. దాదాపు పది లక్షల రూపాయల వ్యయంతో ఈ సినిమా తీసారు. వైజాగ్ లోని చింతపల్లి, లోతుగడ్డ, పోషం పాడు,. అన్నవరం ఏజెన్సీ, పుణ్యక్షేత్రం తదితర ప్రాంతాలలో ఈ చిత్రాన్ని షూట్ చేసారు. త్రిపురనేని మహారధి మాటలు రాయగా శ్రీశ్రీ, కొసరాజు, ఆరుద్ర, సి నా రె,  పీ ఆదినారయన రావు పాటలు రాసారు. పీ ఆదినారాయణ రావు సంగీతం సమకూర్చారు. కృష్ణతో పాటు జగ్గయ్య, గుమ్మడి, విజయనిర్మల, ప్రభాకర్ రెడ్డి, బాలయ్య, కాంతారావు, జయంతి, మంజుల తదితరులు నటించారు. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ ..అనే సాగే ఇంగ్లిష్ పాటను ఆదినారాయణ రావు రాసారు.
1973 డిసెంబర్ 12వ తేదీన “విజయా” నాగిరెడ్డి కెమెరా స్విచ్ ఆన్ చేయాగా చక్రపాణి క్లాప్ ఇచ్చారు. కాళికా దేవి సెట్ వేసి కొండ దేవత నిన్ను కొలిచే మామ్మా అనే పాత షూట్ చేసారు.
కేవలం అరవై రోజుల్లో తీసిన ఈ చిత్రం సూపర్ డూపర్ హిట్టయ్యింది. ఈ చిత్రంలో శ్రీ శ్రీ రాసిన తెలుగువీర లేవరా అనే పాటకు జాతీయ స్థాయిలో అవార్డు లభించింది. టాలీవుడ్ లో ఈ చిత్రమే తొలి ఈస్ట్ మాన్ కలర్ సినిమా స్కోప్ చిత్రం కావడం విశేషం.
ఈ చిత్రంలో చిన్నప్పటి  అల్లూరి సీతారామరాజుగా కృష్ణ పెద్ద కుమారుడు రమేష్ బాబు నటించారు.
1974 లో  దీనికి రాష్ట్ర ప్రభుత్వం స్వర్ణ నంది పురస్కారం అందించింది. ఈ చిత్రాన్నే హిందీలో ఇంక్విలాబ్ జిందాబాద్ అనే పేరుతో అనువదించారు.
ఏదేమైనా తెలుగు చిత్ర పరిశ్రమలో ఈ అల్లూరి సీతారామరాజు చిత్రానికి ఒక ప్రత్యేక స్థానం ఉందనేది అతిశయోక్తి కాదు.
– నీరజా చంద్రన్

Send a Comment

Your email address will not be published.