MTF రాష్ట్రావతరణ సంబరాలు

మోదుగు పూల వాన, మొరటు పోరాటాల కోన, ఊర ఇసుకల తిన్నె, పాల పిట్టల తోవ, గంగిరెద్దుల ఆట, గోల్కొండ కోట, కాకతీయుల కట్ట, సిరులు పండే మెట్ట, నల్ల బంగారం గుట్ట, నిర్మల్ బొమ్మల పేట, తేనెలొలుకు తెలుగు మాట, వొళ్ళు గుర్పోడిచే జానపదాల పాట, జల జల పారే జీవ నదుల ఘోష, నా తెలంగాణ కోటి రతనాల వీణ,

తెలంగాణా రాష్ట్రం అవతరించి ఒక ఏడాది అయిన సందర్భంగా ప్రపంచంలో మొదటిగా మెల్బోర్న్ తెలంగాణా ఫోరం మే 30 వ తేదీన ఔత్సాహికులైన యువకులు మరియు తెలంగాణా రాష్ట్రం నుండి వచ్చిన పెద్దల సమక్షంలో రాష్ట్రావతరణ సంబరాలు ఘనంగా జరుపుకున్నారు.

మొదటిగా తెలంగాణా ఉద్యమకర్త, తెలంగాణా రాష్ట్ర సాధనలో ప్రత్యెక పాత్ర పోషించిన శ్రీ ప్రొఫెసర్ జయశంకర్ గారికి ప్రత్యెక తెలంగాణా స్థూపాన్ని (శ్రీ అమన్ మరియు కిరణ్ ఈ స్థూపాన్ని తాయారు చేసారు) నిర్మించి అందులో అమర్చిన వారి చిత్ర పటానికి ఈ కార్యక్రమానికి విచ్చేసిన వారందరూ వందనాలర్పించి శ్రీమతి రాణి తౌట్ రెడ్డి గారు పాడిన గణపతి శ్లోకంతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. శ్రీ జయశంకర్ గారి గురించి ఎన్నో విషయాలు తెలిపే ఒక వీడియోని కూడా ప్రదర్శించారు.

ఈ సంవత్సరం వేసవి తాపాలకు తెలంగాణా మరియు ఆంధ్ర ప్రదేశ్ లో చాలా మంది చనిపోవడం వడదెబ్బకు లోనుకావడంతో సస్యశ్యామలమైన వాతావరణ ఆవశ్యకత అవసరాన్ని తెలియజేయడానికి చెట్లు నాటే కార్యక్రమానికి దోహదం చెయ్యాలని భారతదేశం నుండి వచ్చిన ఒక పెద్దాయనతో ఒక చెట్టును నాటే కార్యక్రమం జరిపించారు. ఈ ఫోరం నిర్వహించే సాంఘిక కార్యక్రమాలలో దీనికి ఈ సంవత్సరం ప్రాముఖ్యతనివ్వాలని అభిలషించారు.

ఈ సంఘ వ్యవస్థాపక అధ్యక్షులు మరియు ప్రస్తుత గౌరవ సలహాదారు శ్రీ నూకల వెంకటేశ్వర రెడ్డి గారు మాట్లాడుతూ గత రెండు సంవత్సరాలుగా మెల్బోర్న్ తెలంగాణా ఫోరం చేపడుతున్న కార్యక్రమాల వివరాలను తెలిపారు. వాటిలో ముఖ్యంగా రెండు బతుకమ్మ పండగలు మరియు భారత దేశం నుండి ప్రత్యేకాహ్వానితులు శ్రీ తెలంగాణా ప్రకాష్ గారు, రసమయి బాలకృష్ణ గారు తదితరుల గురించి ప్రస్తావిస్తూ భావి కార్యక్రమాలు ఇలానే జరుపుకుని ముందుకు సాగాలని ఆకాంక్షించారు. అంతే కాకుండా ఈ సంఘం ప్రపంచంలోని పలు దేశాల్లోని సమాంతర సంస్థలతో అనుసంధానాన్ని ఏర్పరచుకొని తెలంగాణా రాష్ట్ర ప్రజలతో సన్నిహిత సంబంధాలు నెలకొల్పుకొందని తెలిపారు.

తెలంగాణా ప్రాంతానికి చెందిన పలువురు రాణీ రుద్రమదేవి, కొమరం భీం వంటి ప్రముఖులను పోల్చుతూ చిన్న పిల్లల ఫాన్సీ డ్రెస్సులు చాలా బాగున్నాయి. వీరందరూ ఎంతో కష్టపడి అవసరమైన చోట కట్టులవంటి ఆయుధాలను చేతబూని ప్రేక్షకులను అలరించారు.

ప్రియ చేసిన మెడ్లీ నృత్యం అందరినీ ఆకట్టుకుంది. ఈ నృత్యం పాత క్రొత్తల మేలుకలయిక.

పలువురు తెలంగాణా అమరవీరులపై పాడిన పాటలు అద్భుతంగా వున్నాయి. ముఖ్యంగా డాక్టర్ అందెశ్రీ వ్రాసిన జానపదాన్ని శ్రీ రాజేష్ పాడే విధానం చాలా బాగుంది.

“S | For the better cause” అన్న లఘు చిత్రం తెలంగాణా ఫోరం సభ్యులు శ్రీ అనిల్దీప్, నాగేశ్వర రావు నాగపురి మరియు ఇతర సభ్యుల సహకారంతో నిర్మించారు. ఈ చిత్రం చాలా స్పూర్తిదాయకంగానూ, ఆలోచనాత్మకంగానూ వుంది. ఈ లఘు చిత్రం తెలంగాణా రాష్ట్రావతరణ సందర్భంగా తెలంగాణా సాంస్కృతిక శాఖ పోటీలకు నామ నిర్దేశం అయినట్లు శ్రీ నాగేశ్వర రావు నాగపురి గారు తెలిపారు. ఈ చిత్రాన్ని తెలుగుమల్లి హోం పేజీ వీడియోలో చూడవచ్చు.

చివరిగా అధ్యక్షులు శ్రీ రాజేష్ గారు మాట్లాడుతూ ప్రతీ సంవత్సరం తెలంగాణా రాష్త్ర ఏర్పాటుకు అభివృద్ధికి పాటుపడిన వారికి సాదరంగా సత్కరించాలని నిర్ణయించినట్లు చెప్పారు. ఈ సంవత్సరం శ్రీ తెలంగాణ ప్రకాష్ గారిని “తెలంగాణా అస్వద్ధామ” బిరుదుని ప్రధానం చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి సహాయ సహకారాలందించిన స్వచ్చంద కార్యకర్తలకు, కళాకారులకు మరియు వ్యాపార సంస్థలకు, పరోక్షంగా సహాయం అందించిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు. పసందైన విందు భోజనంతో ఈనాటి కార్యక్రమం ముగిసింది.

ఈ కార్యక్రమానికి శ్రీమతి రాణి తౌట్ రెడ్డి గారు మరియు సుమన్ పారుపాటి గార్లు వచస్పతులుగా వ్యవహరించి కార్యక్రమాన్ని ఆద్యంతమూ చక్కగా నిర్వహించారు.

Send a Comment

Your email address will not be published.