RMIT లో దీపావళి

బహుళ సంస్కృతీ సాంప్రదాయానికి పట్టంగట్టే ఆస్ట్రేలియా దేశంలో భారతీయతకు పెద్దపేట వేయడం జరుగుతోంది.ప్రతీ ఏటా జరిగే దీపావళి పండగ ఇప్పుడు ప్రతీ రాష్ట్ర పార్లమెంట్ లోనూ జరగడం విశేషం.ప్రతీ రాష్ట్రం వారి క్యాలెండర్ లో ఒక రోజు ఈ దీపావళికి కేటాయించి రాష్ట్ర రాజధానిలోని ముఖ్యమైన భవనాలను, చారిత్రాత్మక ప్రాంగణాలను దీపాలంకరణ చేయడం ఆనవాయితీగా మారింది.ఒక దేశ సాంప్రదాయపు విలువలున్న పండగను పరదేశంలో ప్రమాణాలకు లోటు లేకుండా జరుపుకోవడం పరాయి సాంప్రదాయాన్ని సగౌరవంతో ఆలింగనం చేసుకోవడమే.ఈ సంస్కృతి రెండు దేశాల మైత్రీ బంధాలకు ప్రతీక.ఒకరిపై ఒకరికున్న గౌరవానికి సూచకం.

RMIT (Royal Melbourne Institute of Technology) – ఆస్ట్రేలియాలో ఇంజనీరింగ్ మరియు సాంకేతిక విద్యలో ప్రపంచ ప్రామాణికాలు అనుసరిస్తున్న విశ్వవిద్యాలయం. ఇందులో షుమారు 7000 కు పైగా అంతర్జాతీయ విద్యార్ధులు చదువుకుంటారు. భారతీయ సంతతికి చెందిన విద్యార్ధులు అనేకమంది వున్నారు. ఈ విశ్వవిద్యాలయంలో ప్రతీ ఏటా దీపావళిని జరుపుకోవడం ముదావహం. ఈ సంవత్సరం ఓంసాయి కార్యదర్శి శ్రీ రాంపాల్ ముత్యాల గారి అద్వర్యంలో కనులపండువుగా జరిగిన కార్యక్రమంలో RMIT విశ్వవిద్యాలయాధ్యక్షుడు ప్రొఫెసర్ పీటర్ కోలో పాల్గొన్నారు. ప్రొఫెసర్ సురేష్ కె.భార్గవ గారు అధ్యక్షోపన్యాసం చేస్తూ మెల్బోర్న్ నగరంలో ఇప్పుడు అనేక ప్రాంతాల్లో దీపావళి సంబరాలు జరుపుకుంటూ స్థానిక ప్రజలు ఈ సంబరాల్లో పాల్గొనడం ఎంతో ఆనందదాయకమైన విషయమని చెప్పారు. ప్రొఫెసర్ కోలో మాట్లాడుతూ తాను భారత దేశం ఎన్నో సార్లు సందర్శించటం జరిగిందనీ అందులో కొన్ని అనుభవపూర్వకమైన విషయాలు వివరించారు.భారతదేశంలో కొన్ని విశ్వవిద్యాలయాలతో క్రొత్త ఒడంబడికలు చేసుకుని విద్యా రంగంలో మరింత పురోభివృద్ది సాధించటానికి కృషి చేస్తున్నట్లు కోలో చెప్పారు.ఈ కార్యక్రమానికి ప్రత్యెక అతిధిగా హైదరాబాదుకు చెందిన ప్రముఖ రసాయన శాస్త్రవేత్త శ్రీమతి లక్ష్మీ కాంతం గారు (ప్రస్తుతం తేజ్పూర్ విశ్వవిద్యాలయంలో పని చేస్తున్నారు) రావడం జరిగింది.

మన తెలుగువారు శ్రీ చారి చిగురాల, శ్రీ మురళి ధర్మపురి, శ్రీ వెంకటేశ్వర రెడ్డి నూకల, శ్రీ శర్మ బేతనభట్ల గార్లు పాల్గొనడం జరిగింది.భారతీయ వర్గాలలో ముఖ్యులు మరియు లేబర్ పార్టీ సభ్యులు శ్రీ మనోజ్ కుమార్ కూడా పాల్గొన్నారు.వక్తలందరూ ఆస్ట్రేలియాలో బహుళ సంస్కృతీ సాంప్రదాయం మరియు భారతీయుల పాత్ర గురించి తమ ఆలోచనలను పంచుకున్నారు.

పలు సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు జరిగిన రెండున్నర గంటల కార్యక్రమం దోస హట్ వారు అందించిన విందు భోజనంతో ముగిసింది.

Send a Comment

Your email address will not be published.