అంతర్మధనం

అంతర్మధనం

జీవిత ప్రయాణం లో చీకటి ముసిరినప్పుడు వెలుగును చూపేది నీవే!
మనోవ్యధలతో లోలోనే కుమిలే నా మనస్సుకు హాయి కలిగించేది నీవే!
తీరం దూరమయ్యిందని నిరాశకు లోనైన నన్ను గమ్యం చేర్చేది నీవే!
విషాదానికి లోనయ్యి వేదన అలముకొన్న క్షణాలలో వివేకం చూపేది నీవే!

నా ప్రార్ధనలో భావం నీవే! నా మనస్సుకు బలము నీవే!
నా తపస్సుకు ఫలము నీవే!నా హృదయంలో ప్రకాశం నీవే!
కష్టాలను తొలగించే ఆశవు నీవే! శాంతిని అందించే సందేశం నీవే!
భ్రాంతిని కరగించే జ్యోతివి నీవే! ఆనందం నింపే రాగము నీవే!

లేదు ఇరువురి మధ్య దూరం! లేదు మన భాషకు ఆకారం!
లేదు యమనియమాల నిభంధనం! లేదు నిర్ణీత ప్రార్ధనా సమయం!
అంతరంగమే నీ కోవెల కాగా! భావతరంగమే నీ కుసుమం కాగా!
ఆత్మసంత్రుప్తియే నీ నైవేద్యము కాగా! ఆత్మానందమే నా ఆహారము కాదా!

–డా.రాంప్రకాష్ ఎర్రమిల్లి

Send a Comment

Your email address will not be published.