అందర్నీ నవ్వించే ‘సిల్లీ ఫెలోస్‌‌’

Silli fellows

తెలుగు సినిమాల్లో హాస్య చిత్రాలకు ఓ ప్రత్యేకత ఎల్లప్పుడూ ఉంటోంది. తాజాగా విడుదలైన ‘సిల్లీ ఫెలోస్’ సినిమా కూడా ఇంటిల్లపాదికీ హాస్యాన్ని అందించేదిగా నిలుస్తోంది. ఇటీవల వరకూ వరుస ఫ్లాప్‌లతో ఇబ్బందుల్లో ఉన్న యంగ్ హీరో అల్లరి నరేష్‌, హీరోగా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేక తిరిగి కమెడియన్‌గా మారిన సునీల్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన కామెడీ ఎంటర్‌టైనర్‌ సిల్లీ ఫెలోస్‌. రీమేక్‌ చిత్రాల స్పెషలిస్ట్ భీమినేని శ్రీనివాస రావు మరోసారి తమిళరీమేక్‌తో ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. ఎంటర్‌టైన్మెంట్‌ గ్యారెంటీ అంటూ చిత్రయూనిట్ చాలా కాన్ఫిడెంట్‌గా చెప్పటంతో సినిమా మీద హైప్‌ క్రియేట్‌ అయ్యింది. అల్లరి నరేష్‌, సునీల్ ల కెరీర్‌కు ఎంతో కీలకమైన సిల్లీ ఫెలోస్‌ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.

ఇదీ కథ ;
వీరబాబు (అల్లరి నరేష్‌), సూరి బాబు (సునీల్‌) సత్యనారాయణపురం ఎమ్మెల్యే జాకెట్ జానకీ రాం(జయప్రకాష్ రెడ్డి) అనుచరులు. జాకెట్ ఇమేజ్‌ కాపాడటం కోసం వీరబాబు ఎలాంటి మోసం చేయడానికైనా రెడీ అవుతాడు. అలా ఓ కార్యక్రమంలో జాకెట్‌ పరువు కాపాడటం కోసం సూరిబాబు, రికార్డింగ్‌ డ్యాన్సులు చేసే పుష్ప(బిగ్‌బాస్‌ ఫేం నందిని)లకి పెళ్లి చేస్తాడు. అప్పటికే సూరిబాబుకు కృష్ణవేణి (పూర్ణ)తో పెళ్లి కుదరటంతో పుష్పను వదిలించుకునేందుకు ఎమ్మెల్యే జాకెట్‌ను ఆశ్రయించాలనుకుంటాడు. అదే సమయంలో తను ప్రేమించిన వాసంతి (చిత్ర శుక్ల) ఉద్యోగం కోసం వీరబాబు.. జాకెట్‌కు పది లక్షల రూపాయలు ఇస్తాడు. ఈ రెండు సమస్యలు పరిష్కరించాల్సిన జాకెట్‌, మినిస్టర్‌ గోవర్థన్ ను పరామర్శించడానికి హాస్పిటల్‌కు వెళ్లి తిరిగి వచ్చే దారిలో ప్రమాదానికి గురై గతం మర్చిపోతాడు. మినిస్టర్ చనిపోతూ 500 కోట్లకు సంబంధించిన రహాస్యాన్ని జాకెట్‌కు చెప్పటంతో భూతం(పోసాని కృష్ణమురళి) ఆ డబ్బు కోసం జాకెట్ వెంటపడతాడు. మరి గతం మర్చిపోయిన జాకెట్‌ తిరిగి కోలుకున్నాడా..? 500 కోట్లకు సంబంధించిన రహస్యాన్ని బయటపెట్టాడా? తమ సమస్యల నుంచి వీరబాబు, సూరి బాబలు ఎలా బయటపడ్డారు..? అనేదే మిగిలిన్ అకథ

రొటీన్ గా ఉన్నా పండిన కామెడీ
కామెడీ స్టార్‌గా మంచి ఇమేజ్‌ ఉన్న నరేష్ మరోసారి తన ఇమేజ్‌కు తగ్గ కామెడీ ఎంటర్‌టైనర్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అయితే పెద్దగా కొత్తదనం చూపించకుండా రొటీన్‌ ఫార్ములానే ఫాలో అయ్యాడు. తనవంతుగా వీరబాబు పాత్రకు పూర్తి న్యాయం చేశాడు. కమెడియన్‌గా రీ ఎంట్రీ ఇచ్చిన సునీల్‌ తనదైన కామెడీ టైమింగ్‌తో ఆకట్టుకున్నాడు. హీరోయిన్‌గా చిత్ర శుక్లా పరవాలేదనిపించారు. వాసంతి పాత్రలో యాక్షన్‌ సీన్స్‌లోనూ ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. మరో కీలక పాత్రలో కనిపించిన బిగ్‌బాస్‌ ఫేం నందిని రాయ్‌ నిరాశపరిచారు. జయ ప్రకాష్‌ రెడ్డి, పోసాని కృష్ణమురళి, రాజా రవీంద్ర రొటీన్‌ పాత్రల్లో కనిపించారు. అతిథి పాత్రలో పూర్ణ తళుక్కున మెరిశారు.

విశ్లేషణ ;
రీమేక్‌ స్పెషలిస్ట్‌గా పేరున్న దర్శకుడు భీమినేని శ్రీనివాస్‌ రావు మరోసారి రీమేక్‌ కథతోనే ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. తమిళంలో విజయం సాధించిన ‘వెలైను వంధుట్ట వెల్లకారన్‌’ సినిమాను తెలుగు నేటివిటికి తగ్గట్టుగా కొద్దిపాటి మార్పులతో రీమేక్‌ చేశారు. కోలీవుడ్‌ లో ఈ తరహా చిత్రాలు కొత్తైనా మన దగ్గర చాలా వచ్చాయి. దీంతో మరోసారి రొటీన్‌ కామెడీ సినిమా చూస్తున్న ఫీలింగ్ కలుగుతుంది. ఫస్ట్ హాఫ్‌ ప్రధాన పాత్రల పరిచయం, మంచి కామెడీ సీన్స్‌ తో ఆకట్టుకున్న దర్శకుడు ద్వితీయార్థంలో ఆ స్థాయిలో అలరించలేకపోయారు. పెద్దగా కథ లేకపోవటంతో ఒకే సన్నివేశాన్ని సాగదీస్తూ టైం పాస్‌ చేశారు. ముఖ్యంగా జయప్రకాష్‌ రెడ్డి, పోసాని కృష్ణమురళీల మధ్య సన్నివేశాలు ప్రేక్షకుల సహనాన్ని పరీక్షిస్తాయి. హీరో హీరోయిన్‌ల మధ్య ప్రేమ సన్నివేశాల విషయంలోనూ ఇంకాస్త దృష్టి పెట్టాల్సింది. శ్రీ వసంత్ సంగీతం బాగుంది. సినిమాటోగ్రపి, ఎడిటింగ్‌, నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి. ఈ మధ్య వచ్చిన కామెడీ సినిమాల్లో ఇది బాగానే ఉందని చెప్పొచ్చు. ఈ సినిమాకి ప్లస్‌ పాయింట్స్‌ కామెడీ, నరేష్‌, సునీల్‌ ల నటన అయితే, మైనస్‌ పాయింట్స్‌…రొటీన్‌ కథా కథనం.

సినిమా తారాగణం : అల్లరి నరేష్‌, సునీల్‌, చిత్ర శుక్ల, నందిని, జయప్రకాష్ రెడ్డి, పోసాని కృష్ణముకళి
సంగీతం : శ్రీ వసంత్‌, దర్శకత్వం : భీమినేని శ్రీనివాసరావు, నిర్మాత : కిరణ్‌ రెడ్డి, భరత్‌ చౌదరి

Send a Comment

Your email address will not be published.