అజరామరము ఆ స్వరము

Ghantasala familyt

నీవు లేవు నీ పాట ఉంది తెలుగుజాతిని అల్లుకుని
అమరగాయకుడు ఘంటసాల
నేడు ( డిసెంబర్ 4) ఘంటసాల వెంకటేశ్వరరావు 96వ జయంతి

తెలుగు పాట మీద ఎప్పటికీ చెరిగిపోని తేనె సంతకం ఘంటసాల. అమరగాయకుడు అనే పదానికి అర్థం పరమార్థం….గానగంధర్వుడు అనే బిరుదుకి నిలువెత్తు నిదర్శనం ఆయనే. రోజూ ఎక్కడో ఓ చోట ఆయన కంఠాన్ని ఇప్పటికీ వింటూనే ఉంటాం. అది ఎప్పటికీ నిలిచి ఉండిపోయే కంఠం ఆయనది. గాత్రంలోనే సంగీత ఝరి ప్రవహించే ఘంటసాలే తెలుగు పాటకు గొంతుక. ఆంధ్రదేశంలో కృష్ణమ్మ ఒడిలో ఎదిగి ఒదిగి ఎందరో మహానుభావులు ఇటు రంగస్థలానికి అటు సినీ కళామతల్లికి తమ సేవల్ని అందించి శాశ్వత కీర్తి ప్రతిష్టలను సంపాదించారు. అందులో మన ఘంటసాల ఒకరు. రత్నమ్మ – సూర్యనారాయణ దంపతులకు 1922 డిసెంబరు 4న చౌటిపల్లి గ్రామంలో జన్మించాడు ఘంటసాల వెంకటేశ్వరరావు. పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది అనే నానుడికి ప్రత్యక్ష నిదర్శనం ఘంటసాల! సూర్యనారాయణగారు మృదంగ విద్వాంసులు. ఇంట్లో నిరంతరం సంగీత సాధన సాగుతుండేది. ఘంటసాల బాల్యంలోనే తండ్రితో గొంతు కలపడం. పాదం కలపడం.. పరవశించి ఆడటం నేర్చుకున్నాడు. ఘంటసాల బాల్యంలో చూడముచ్చటగా వుండేవాడు. ఇంతలేసి కళ్లు. తేనెలొలికే తీయని గొంతు……ఎంతటి క్లిష్టమైన విషయాన్నైనా ఇట్టే గ్రహించే గ్రాహకశక్తి, అణకువ, ఇవన్నీ దేవుడిచ్చిన వరాలు. మధ్యతరగతి కుటుంబంలో పుట్టడం వలన చిన్నతనం నుంచీ మమతానురాగాలూ…. మానవ సంబంధాల్లోని మాధుర్యం విలువలు తెలుసుకుని నడుచుకునేవాడు.. గనుక అందరికీ తలలో నాలుకలా వుండేవాడు. తండ్రితో బాటు ఆడుతూ.. పాడుతూ… వుండే బాల ఘంటసాలకు పాటలే లోకంగా ఉండేవి.

తొలి అడుగులు తండ్రి చిటికెన వేలు పట్టుకునే
ఘంటసాలకు 11 యేళ్లుండగా తండ్రి సూర్యనాయరణ మరణించాడు. మరణించే ముందు సంగీతం దాని ప్రాశస్య్తం.. ఎంత కఠోరమైన సాధన చేస్తే అంత ఫలితముంటుంది.. అని తెలియజెప్పి కన్నుమూశాడు. జీవితమంటే శూన్యంలా కనిపించిన ఘంటసాలనీ.. తల్లినీ.. సూర్యనారాయణ బావమరిది పిచ్చయ్యగారే వున్నంతలో చూసుకునేవారు. ఘంటసాలకి తండ్రి భౌతికంగా లేకపోయినా తండ్రి మాటలే వినిపించేవి. తండ్రి పాటలే తలపుకి వచ్చి ఏదో ప్రబోధిస్తున్నవని అనిపించేది. ఘంటసాల కనుమూసినా తెరచినా సంగీతం సంగీతం….తండ్రి ప్రభావం ఎక్కువ ఉండే వయస్సే కాక తండ్రి రాణించిన రంగాన్నే ఎంచుకోవడంతో ఆయనే ఘంటసాలకు రోల్‌ మోడల్‌ అయ్యాడు. ఆయన మరణాన్ని తట్టుకోవడం ఘంటసాలకు అసాధ్యంగానే అనిపించేది కానీ తండ్రి చివరిగా చెప్పిన సంగీతమే సాంత్వన అయ్యింది. కఠినమైన సంగీతసాధనతో మానసికంగా తండ్రికి చేరువయ్యేవాడు. తండ్రి ఆప్యాయతను ఆస్వాదిస్తున్న భావనకు లోనయ్యేవాడు. తండ్రి ఆశయం నెరవేర్చడానికి సంగీతానికి సంబంధించిన గురుకులాల్లో చేరినా అక్కడ కట్టుబాట్లు, అవహేళనలను తట్టుకోలేక తిరిగి వచ్చేసేవాడు. సాటి కళాకారులు ఎవరైనా అపశ్రుతులు పాడితే సహించలేని గుణం చిన్నతనం నుంచీ వుంది. ఒక సారి అలాగే సాటి సంగీత కళాకారులతో తలపడి అభాసుపాలయ్యాడు. అప్పటికీ తెలిసీ, తెలియని వయసు ఆ అవమానమే తనలో ఆలోచనల్ని రెచ్చగొట్టింది. ఏ పనిలోనైనా పరిపూర్ణత్వం సాధించనిదే బయట ప్రదర్శించ కూడదు అని నిర్ణయించుకున్నాడు. అప్పట్నించి తనని అబ్బురపరిచే సంగీత కళాకారుల ఇంట వంట చేస్తూ వారి దగ్గర శిక్షణ తీసుకోవాలనుకు న్నాడు. కానీ ఫలితం శూన్యం. చాకిరీ చేయించు కోవడం తప్ప ఒక్కముక్క చెప్పిన పాపాన పోలేదు. అప్పట్లో ఆంధ్రదేశంలో వున్న ఒకేఒక్క సంగీత కళాశాల విజయనగరం మహారాజా వారి సంగీత కళాశాల. బస్సు కిరాయి కావాలి కదా ఆ కిరాయికి సరిపడా డబ్బులు వచ్చేలా తన దగ్గరున్న చిన్న బంగారు ఉంగరం అమ్మి విజయనగరం బయలుదేరాడు.

తీర్చిదిద్దిన విజయనగరం
arch1

ఘంటసాల విజయనగరమే వెళ్లకపోయి వుంటే… తన జీవితం నిర్వీర్యంగా కాలగర్భంలో కలిసిపోయేదేమో..! అనే సందేహం కలుగుతుంది. ఎందుకంటే ప్రతిభను గుర్తించి బాహ్య ప్రపంచంలోకి తీసుకురావాలి కదా. అయితే విజయం వెంటనే రాలేదు. కష్టాలతోనే సంగీత ప్రయాణం ప్రారంభమైంది. తీరా విజయనగరం వెళ్లేసరికి వేసవి సెలవుల కారణంగా సంగీత కళాశాలని మూసేశారు. తలదాచుకోవడానికి చోటులేదు. కాలేజీ ప్రిన్సిపాల్‌ కాళ్లవేళ్లాపడి బ్రతిమాలగా కాలేజీ ఆవరణలో బస చెయ్యడానికి అనుమతిచ్చారు. ఘంటసాల రోజుకో ఇంట్లో వుంటూ వారాలు చేసుకుంటూ బతికేవాడు. తోటి విద్యార్థులు అల్లరిచిల్లరగా వుంటూ తాముచేసిన దొంగతనాన్ని ఘంటసాల మీదకి తోసేశారు. దాంతో కాలేజీలోకి అనుమతి లేకుండా పోయింది. ఈ విషయం వూళ్లోవాళ్లకి తెలిసి వూళ్లోవాళ్లూ ‘ముఖం చూపించొద్దు..’ అంటూ కట్టడి చేశారు. తలదాచుకోవడానికి చోటులేక ఆ వూరి గ్రామదేవత గుళ్లో తలదాచుకునేవాడు. ఏదో పని మీద గుడికి వచ్చిన పట్రాయని సీతారామశాస్త్రిగారు జరిగిందంతా విని తనతో తన ఇంటికి తీసుకుపోయారు. తను ఉచితంగా సంగీత శిక్షణ అయితే ఇవ్వగలడు కానీ భోజనం పెట్టే సామర్థ్యం లేదు. ఆకలిదప్పికలతో తిరుగుతున్న ఘంటసాలకి ఎవరో ఒక గురువుగారు ”అడగందే అమ్మయినా అన్నంపెట్టదు నాయనా.. ఇదిగో జోలె.. ఈ సువిశాల ప్రపంచంలో.. జీవరాశులన్నీ ఒకరి మీద మరొకరు ఆధారపడి బ్రతకవలసిందే.. తప్పులేదు” అని చెప్పారు. ఘంటసాల భుజానికి జోలెకట్టి….! మాతాకబళం తల్లీ! అంటూ ప్రాధేయపడుతూ అడిగేవారు. క్షణాల్లో జోలె నిండిపోయేది.. బ్రతకడానికి తినాలిగాని, తినడానికి బ్రతక్కూడదు కదా. సంగీత సాధన చేస్తూ.. ఒక్కోసారి మధ్యాహ్నాం తెచ్చుకున్న అన్నమే చీమలు పట్టినా ఈగలు ముసిరినా.. తినేసేవారు. సంగీత కళాశాల తెరిచారు. కాలేజీలో జాయినయ్యాడు. శాస్త్రిగారి శిక్షణలో నాలుగు సంవత్సరాల్లో చదవాల్సిన కోర్సు.. రెండేళ్లల్లో పూర్తి చేసి ప్రశంసలు పొందారు. ద్వారం వెంకటస్వామి నాయుడు గారు కూడా ఘంటసాల మాస్టారి ప్రతిభా పాటవాల్ని గుర్తించినట్లు ప్రశసించినట్లు సమాచారం! సంగీతంలో ప్రజ్ఞాపాటవాలు సంపాదించిన ఘంటసాల పెళ్లిపందిళ్లలోనూ, ఉత్సవాల్లోనూ… పాటలు పాడుతూ విజయనగరానికి ముద్దుబిడ్డగా పేరుతెచ్చుకున్నారు. ”ఏ తల్లి నా జోలెలో మొదటి కబళం వేసిందో… ఆ తల్లికి నేను జీవితాంతం రుణపడి ఉంటాను” అలాగే నర్తకి అయిన కళావర్‌రింగ్‌ అనే ఒక వేశ్య మాత కూడా తననెంతో ప్రోత్సహించిందని చెప్పుకుంటారు.

జైలు జీవితం.. సినిమా అవకాశం
విద్య పూర్తయిన తర్వాత కొంతకాలం గాంధీజీ పిలుపు విని… దేశ స్వాతంత్య్ర పోరాటంలో.. క్విట్‌ ఇండియా ఉద్యమంలో పాల్గొని ఆలేపూర్‌ జైలులో రెండు సంవత్సరాలు నిర్బంధంలో వుండి వచ్చారు. మేనమామ ‘వీణ్నిలా వదిలేస్తే దారి తప్పి రాజకీయాలకు ప్రభావితుడవుతాడ’ని ఆలోచించి…తన కూతురు సావిత్రితో 1944 మార్చి నాల్గవ తారీఖున పెళ్లి జరిపించారు. విశేషమేమిటంటే! తన పెళ్లికి తనే కచేరీ నిర్వహించారు. అంతటి పాటల పిచ్చి.. ఈ సందర్భంగా సముద్రాల వారు ఘంటసాలని చూసి ‘ఒకసారి చెన్నపట్నం వచ్చి కలవాలని అని ఓ మాట అన్నారు. అదో గొప్ప అవకాశంగా భావించిన ఘంటసాల చెన్నపట్నం పయనమయ్యి, సముద్రాల వారిని కలిశారు. ఆయన రేణుకా ఫిలింస్‌కి తీసుకెళ్లి, నాగయ్య, బి.యన్‌రెడ్డిలకు ఘంటసాల గాత్ర సౌరభాన్ని వినిపించారు. ఘంటసాల గాన మాధుర్యానికి పరవశించిన నాగయ్య.. బి.యన్‌రెడ్డి దర్శకత్వంలో నిర్మిస్తున్న ‘స్వర్గసీమ’ చిత్రంలో పాడే అవకాశం కల్పించారు. బాలాంత్రపు రజనీకాంతరావు సంగీతస్రష్ట. ఈ చిత్రానికి స్వర రచన చేశారు. ఆయన అప్పటికే ఆలిండియా రేడియోలో పనిచేయడం వలన నళినీకాంతరావు పేరుతో ఆ సినిమా వచ్చింది. ఆయన ముందు పాడటమంటే మాటలా? అందులోనూ గానసరస్వతి భానుమతి సరసన – భయపడుతూ పాడాడు. నాగయ్య ఘంటసాలకి ధైర్యం చెప్పి నెలకు నూట పదహార్లు జీతం కుదిర్చారు.

చిత్రసీమలో గాన పరిమళాలు
87_copyభానుమతి ఘంటసాల ప్రతిభని గుర్తించి తన స్వీయనిర్మాణం ‘రత్నమాల’ చిత్రానికి సహాయ సంగీత దర్శకుడిగా పనిచేసే అవకాశం కల్పించారు. అదే స్వరరచనకి పునాది. ఆ తర్వాత ‘మనదేశం’ (కృష్ణవేణి సినిమా యన్‌.టి.ఆర్‌ మొదటి సినిమా) బాలరాజు సినిమాలకు స్వరరచన చేసే అవకాశం లభించింది. ‘బాలరాజు’ చిత్రం సంచలన విజయం సాధించింది. తెలుగు చలనచిత్ర చరిత్రలో మొట్ట మొదటి రజతోత్సవ చిత్రం బాలరాజు! ఆ సినిమా విడుదలై అక్కినేనికీ యస్‌.వరలక్ష్మీకి ఎంత మంచి పేరు వచ్చిందో ఘంటసాల వారికీ అంతే పేరొచ్చింది.విజయావారి ‘పాతాళభైరవి’ని సినిమా ఘంటసాల పేరుని దశదిశలా వ్యాపించేలా చేసింది. ఇందుకు ప్రధానమైన కారణం ఘంటసాల స్వరరచనలోని వైవిధ్యం! విలక్షణత! ఒక విధంగా తెలుగు సినీసంగీత ప్రపంచాన్ని రెండు విధాలుగా చెప్పుకోవచ్చు. మొదటిది ఘంటసాలకు ముందు.. రెండు ఘంటసాల తర్వాత. అంతవరకూ శాస్త్రీయ సంగీతం ప్రధానంగా రాగభరితంగా వచ్చిన పాటలు.. ఘంటసాల సంగీతంలో ప్రత్యేకత మాధుర్యం.. రాగంతోబాటు భావప్రకటన, స్వచ్ఛత, సంపూర్ణత్వం.. ఒక్కసారి విన్న పాటను మరిచిపోలేరు. అంతగొప్ప గానమాధుర్యం భావప్రకటనను బాలరాజు సినిమాలో పాడినప్పుడు చెరుకుదనం ఇప్పుడు… సుస్వర మాధురీ రసధార….పాతాళగంగలా తన్నుకొచ్చేది. విజయా వారి మరోచిత్రం ‘మల్లీశ్వరి’ బంగారానికి తావి అద్దినట్లు.. దేవులపల్లి వారి సాహిత్యానికి భానుమతి-రామారావుల నటనకి ఘంటసాల-భానుమతిల గానమాధుర్యం…….ఆ మాధుర్యంలోని ‘విలక్షణత’ ఆ పాటలకు పూర్ణాయుష్షుని ప్రసాదించాయి. సినిమాకి నేపథ్యగానం.. వాద్యకారులు వాద్య సహకారమందిస్తుండగా.. నటీనటులు ఎవరి పాట వారు పాడుకునే రోజులు పోయాయి. ఘంటసాల పాటల్లోని మాధురీ పరిమళాలు బాగా నచ్చాయి. ఎక్కడజూసిన ఘంటసాల గురించి చర్చే! అంతకుముందు ఎంతమంది నేపథ్యగాయకులున్నా… అగ్రతాంబూలం ఘంటసాల వారికే దక్కుతుందని నాగయ్యగారు పలుమార్లు ప్రశంసించారు.

 

‘దేవదాసు’తో మత్తు జల్లి…
డిఎల్‌ నారాయణ ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్మించిన చిత్రం ‘దేవదాసు’. ఆ చిత్రానికి సంగీతకళానిధి సి.ఆర్‌.సుబ్బురామన్‌, సహాయకులు ఎంఎస్‌ విశ్వనాథన్‌.. రచన సముద్రాల వారు.. పాటలు భేషుగ్గా వచ్చాయి. స్వరాలు అంతకంటే భేషుగ్గా ఉన్నాయి. మరి గానం? ఈ ప్రశ్నకి సమాధానంగా నిలబడ్డాడు ఘంటసాల! గతంలో సైగల్‌ పాడిన పాటల కంటే అద్భుతంగా పాడారు ఘంటసాల. ఆ పాటలు ఎప్పుడు విన్నా జవసత్వాలతో వుంటాయి. నిత్యనూతనాదిగా భాసిల్లుతాయి. ఆ పాటలు అజరామరం! ఆ పాటల్లోని బింకం.. పొంకం ఈనాటికీ తగ్గలేదు. అంతకుమించిన పాటలు రాలేదు అంటే అతిశయోక్తి కాదేమో! అప్పుడే నిర్ణయించుకున్నారు అక్కినేని. బ్రతికినంతకాలం తనకు ఘంటసాలే పాడాలని ఏవో ఒకటి రెండు పాటలు తప్ప, బ్రతికినంతకాలం ఆ మాట నిలబెట్టుకున్నారు. సాలూరి రాజేశ్వర రావు, ఆదినారాయణరావు సమకాలీనులు. వీరి సంగీతం మీద ఆకుల నరసింహారావు గారి ప్రభావం వుంది. ఆకుల నటుడు, గాయకుడు, సంగీత దర్శకుడు. ఎన్ని పాటలు చేసినా మాధుర్యాన్ని విడిచిపెట్టేవాడు కాదు. అదే సాలూరి. ఆదినారాయణరావుల్లో కనిపిస్తుంది. ‘అనార్కలి’ చిత్రంలో ఘంటసాల పాడిన……’తాన్‌సేన్‌’ పాత్ర ద్వారా పాడించిన ‘మదన మనోహర మంజులనారీ’ పాట మరచిపోగలమా? సినీ సంగీత ప్రపంచాన్ని ఓ మలుపుతిప్పిన స్వరసార్వభౌముడు ఘంటసాల! కె.వి.రెడ్డిగారి ‘మాయబజార్‌’ చిత్రం మాత్రం ఎంతగొప్ప స్వరసారథ్యాన్ని వహించిందని! ఘంటసాల మాస్టారుని చూడాలని ప్రేక్షకులు తహతహలాడుతుండేవారు అది కుదిరే పనేనా? పి.పుల్లయ్య స్వీయనిర్మాణం, దర్శకత్వం వహించిన ‘వెంకటేశ్వర మహత్యం’ చిత్రంలో స్వామివారి గర్భగుడి ముందు ఘంటసాల పట్టువస్త్రాలతో కూర్చుని తన అనుయాయులను తన వెంటబెట్టుకొని ‘శేషశైలవాసాశ్రీ వెంకటేశా’ పాడటం జరిగింది. అలా ఇద్దరి కోరికా నెరవేరింది.

మరపురాని ఘట్టాలు
114_copy

Ghantasala-Padmasri

కులదైవం ‘చిత్రంలోని పయనించే ఓ చిలుకా’ పాట విని.. మహమ్మద్‌ రఫీ పరవశించి పోయారు. ఆయన చెన్నపట్నం వెళ్లేటప్పుడు మాస్టారు రికార్డింగ్‌లో వుంటుండగా కలిసి ఎంతో అభినందిస్తూ అమూల్యమైన గిఫ్టు ఇచ్చారు. ఆ అమూల్యమైన గిప్టు అంబాసిడర్‌ కారు అని కొందరు.. బంగారు గొలుసు అని మరికొందరూ ఆయన ఆత్మీయులే చెబుతుంటారు. ‘శివశంకరీ-శివానంద లహరి’ పాట పాడుతుండగా రష్యా పర్యటనలో చాలా ఇబ్బంది పడ్డారట. అప్పటి నుంచి ఆ పాటని వేదిక మీద పాడకూడదని నిర్ణయించుకున్నారు. ‘మురళీకృష్ణ’లో పాట ఆత్రేయ రాశారు. ‘ఎక్కడ వున్నా ఏమైనా’ మాస్టర్‌ వేణు స్వరపరిచారు. ఘంటసాల మాస్టారు పాడారు. ఆ పాట విన్న వేణు కన్నీరుమున్నీరుగా ఏడ్చారు. ఆత్రేయగారికీ అత్యంత ఇష్టమైన పాట ఇది. మనసు బాగా లేనప్పుడు మనసార పాడుకునే పాట ఇది. ఇకపోతే చాలా సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొంటూ విరాళాలు సేకరించి.. దేశరక్షణకి విరాళాలు ఇవ్వడంతో బాటు ఎన్నో స్వచ్ఛంద సేవా కార్యక్రమాల్లో పాల్గొనేవారు. ఒకరికి సహాయం చేయడంలో వున్న తృప్తి అనంతం అంటారాయన.
ఇప్పట్లా రెమ్యూనరేషన్లు ఓవర్‌నైట్‌ పెంచేవారు కాదు. ఘంటసాల మాస్టారు ప్రొడ్యూసర్లు ఎంతిస్తే అంత పుచ్చుకునేవారు. మారు మాట్లాడేవారు కాదు. ముందు తన దగ్గర వాద్య కళాకారులందరికీ డబ్బులు ఇచ్చిన తరువాత. మిగిలితే తీసుకునేవారు, తగిలితే వేసుకునేవారు. ఈ నేపథ్యంలో జరిగిన సంఘటన ఒకటి… ఒకరోజు తెల్లారుజామునే యన్‌.టి.ఆర్‌ ఇంటికి వచ్చారు. యన్‌.టి.ఆర్‌ త్రివిక్రమ్‌రావు ముఖ్యవిషయాలు మాట్లాడుకుంటున్నారు. త్రివిక్రమ్‌రావు సౌత్‌ ఇండియన్‌ ఫిలిం చాంబర్‌కి అధ్యక్షులు ఘంటసాల మాస్టారు వచ్చారని తెలిసి రమ్మని స్వాగతించారు. ఘంటసాల మొహమాటపడిపోతూ ‘నా కుటుంబం పెరిగింది. ఖర్చులు పెరిగాయి. ఈ సమయంలో మిమ్మల్ని రెమ్యూనరేషను పెంచమని అడగడం భావ్యం కాదు. చిత్రనిర్మాణవ్యయం పెరిగింది. అందువలన తమరు అనుమతి ఇస్తే విజయనగరం వెళ్లిపోయి పదిమంది పిల్లలకు పాఠాలు చెప్పుకుంటాను’ అన్నారు. ఇద్దరూ ఒకరి మొహాలు ఒకరు చూసుకున్నారు. అప్పటికి ఘంటసాల మాస్టారు తీసుకుంటున్న రెమ్యూనరేషన్‌ కేవలం అయిదువందల రూపాయలు. అంత మొహమాటస్తుడు.

సాటి గొంతుకులకు ప్రోత్సాహం
సంగీత ప్రపంచమంతటినీ తన స్వంత కుటుంబసభ్యుల్లా చూసుకునేవారు ఘంటసాల. ఎవరికే ఆపద వచ్చినా తనే ముందుడేవారు. చిత్రంలో ఆరు పాటలుంటే ఒకటో రెండో పాటలు తనుపాడి మిగతా పాటలు పిఠాపురం, మాధవపెద్ది.. కొందరు ఔత్సాహిక గాయనీగాయకులు పేర్లు చెప్పేవారు. అలాగే కోరస్‌ పాడేవాళ్లు ఆర్థికబాధలతో వుంటే మ్యూజిక్‌ డైరెక్టర్‌కి చెప్పి నాలుగయిదు సినిమాల్లో కోరస్‌ ఛాన్సులు ఇప్పించి ఆ నెల గడిచి గట్టేక్కలా చూసేవారు. ఆయనకో చిత్రమైన తీయని అలవాటుండేది. ఉదయం తొమ్మిది గంటలకు ముందే రావడం.. తనకిష్టమైన పెసరట్టు ఉప్మా తినడం.. పొంగలి పాలల్లో కలుపుకొని అందులో పంచదార వేసి తినేవారు. తనకు షుగర్‌ వ్యాధి వుందని తెలిసినా పక్కన పెట్టేసేవారు. తర్వాత ఆయన కోసం ప్రత్యేకించి కట్టించి తీసుకువచ్చిన తాంబూలం వేసుకునేవారు. పల్చటి జుబ్బా గ్లాస్గో లుంగీ పంచె, గోల్డ్‌ ఫ్రేము కళ్లద్దాలూ ధవళ వస్త్రాలూ, ఎర్రగా పండిన పెదవులు.. భలే చూడముచ్చటగా వుండేవారు. కళ్లద్దాలోంచి నవ్వుతున్న కళ్లతో చూస్తు పేరుపేరునా పలకరించేవారు. ఆ తర్వాత ఆర్కెస్ట్రాతో రిహార్సల్స్‌ చేసి.. రికార్డింగ్‌ థియేటర్లోకి వెళ్లి.. సహచర గాయనికి ఏమాత్రం ఇబ్బంది కలగకుండా పాటలో మెలకువలు నేర్పుతూ తన తృప్తి మేరకు పాడేవారు. కంపోజర్‌కు ఓకే అయినా తనకి తృప్తిగా అనిపించకపోతే మళ్లీ మళ్లీ పాడి.. ఫైనల్‌ అవుట్‌ పుట్‌ని సౌండ్‌ ఇంజనీరు పక్కన అందరితో కలిసి కూర్చొని విని పసిపిల్లాడిలా కేరింతలు కొట్టేవారు. ఆయన ఏ పాట పాడినా తాదాత్మ్యం చెందుతూ పాడేవాడు. మాస్టారికి మధుమేహం వ్యాధి వుంది. స్వతహాగా భోజనప్రియుడు. ఆహార నియంత్రణ చేయలేకపోయేవారు. ఎవరే మందు చెప్పినా వాడేసేవారు. ఇంకా చిన్నవయసు కదా సంతోషంగా తినండి… ఆనందంగా వుండండి అంటే పొంగిపొయ్యేవారు. నాటువైద్యం కూడా చేయించుకున్నారు. మందు వికటించి యాభై ఒక్క సంవత్సరానికే నూరేళ్లు నిండాయి.

విశిష్ట వ్యక్తిత్వం
ఘంటసాల లాంటివారు నూటికో కోటికో ఒక్కరుంటారు. ‘తానెంతో జగమంత’ అనే మనస్తత్త్వం గల వ్యక్తి ఘంటసాల. అందుకే అందర్నీ తనతో సమానంగా చూసుకునేవారు. ‘అల్లూరి సీతారామరాజు’ చిత్రం సమయానికే పాడుతున్నప్పుడు ఆయాసం వచ్చేది. అలాగే పాడుతూ ‘తెలుగువీర లేవరా’ పాట పాడారు. ఆ పాటకి శ్రీశ్రీకి జాతీయ ఆవార్డు వచ్చింది. 1990 ఆయనకి పద్మశ్రీ అవార్డు వచ్చింది. 1917లో ఐరొపా, అమెరికాలో సంగీత కార్యక్రమాలు చేసి అక్కడి ప్రేక్షకులకు తెలుగుపాట రుచి చూపించారు. 1972లోనే ఒకసారి రవీంధ్రభారతిలో కచేరీ చేస్తున్నప్పుడు గుండెనొప్పి వచ్చింది. హస్పిటల్‌లో చేరారు. చికిత్స జరిగింది. ఆ సమయంలో గుర్తుండిపోయే కార్యక్రమం ఏదయినా చేయాలని నిర్ణయించుకున్నారు. ఆ సంకల్పం కలగ్గానే ‘భగవద్గీత’కు స్వరరచన చేశారు. విజయాకృష్ణమూర్తి పక్కనే వున్నారు. సంగీత రావు కూడా తోడున్నాడు. రికార్డింగ్‌ జరక్కుండానే తనువు చాలిస్తానేమో నని భయపడ్డారు కానీ, ఒక పక్క ట్రీట్‌మెంట్‌ తీసుకుంటూనే పరిసమాప్తి గావించారు. ఈ రోజు భారతజాతికి ఘంటసాల మాస్టారు అందించిన గానామృతం తరగని సంపద….ఘంటసాల మన తెలుగు జాతిసంపద.

అరుదైన గౌరవం
Ghantasala-stamp of India2003ఘంటసాల గౌరవార్థం తపాళ బిల్ల కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఘంటసాల విగ్రహం. హైదరాబాద్‌ రవీంద్రభారతి ఆవరణలో ఘంటసాల కళానిలయం, ఘంటసాల సంగీత కళాశాల (శరత్‌చంద్ర) ఘంటసాల పేరిట సంగీతోనృత్యోత్సవాలు.. ఆంధ్రదేశంలోనే కాదు. ప్రపంచవ్యాప్తంగా ఎక్కడో ఒకచోట ఘంటసాల మాస్టారి సంగీతోత్సవాలు కొనసాగుతూనే వుంటాయి. ఎవరన్నారు? ఘంటసాల వారికి యాభై ఒక్క సంవత్సరాలని. తెలుగు పాట బ్రతికున్నంత కాలం ఆయన బ్రతికుంటారు. ఆయన అమరగాయకుడు! భారతీయ సంగీత సామ్రాజ్యానికి చక్రవర్తి.

పాటల పాలవెల్లి
9_copy

ఘంట సాల పాటల్లోని ఆణిము త్యాలను ఏరడం సముద్రం దగ్గర నిల్చొని చెమ్చాలతో నీళ్లు లెక్క పెట్టినట్లు వుంటుంది. ‘జగమే మాయ’, ‘కుడి ఎడమైతే పొరపాటు లేదోరు’ (దేవదాసు), ‘గగనసీమలో వెలిగే ఓ మేఘమాలా’ (మల్లీశ్వరి), ‘మదన మనోహర మంజులనారీ’ (అనార్కలి), ‘నీవేనా నను పిలిచినదీ’, ‘సుందరి నీవంటి దివ్య స్వరూపంబు’ (మాయబజార్‌), ‘పయనించే ఓ చిలుకా’ (కులదైవం), ‘రసికరాజ తగువారము కామా’ (జయభేరి), ‘హే కృష్ణా ముకుందా మురారి!’ (పాండురంగ మహత్యం), శివశంకరి (జగదేకవీరుని కథ), ‘మోహనరాగమహా’ (మహామంత్రి తిమ్మరసు), ‘మౌనముగా నీ మనసు పాడినా’ (గుండమ్మ కథ), ‘ఎక్కడ వున్నా ఏమైనా మనమెవరికి వారై వేరైనా నీ సుఖమేనే కోరుతున్నా’ (మురళీకృష్ణ), ‘ఎందుకో సిగ్గెందుకో’ (ఆస్తిపరులు), ‘జోరుగా..హుషారుగా షికారు పోదమా’ (భార్యభర్తలు), ‘ఒహో.. ఒహో నిన్నే కోరిక (ఇద్దరు మిత్రులు), ‘చిగురాకులలో చిలకమ్మా’ (దొంగరాముడు), ‘ఒకటే హృదయం కోసము.. ఇరువురి పోటీ దోషము’ (చదువుకున్న అమ్మాయిలు), ‘కనులు కనులతో కలబడితే’ (సుమంగళి), ‘మాణిక్యవీణా’ (మహాకవి కాళిదాసు), ‘కనులు కనులతో కలబడితే ఆ తగవుకి ఘనమేది?’ (కులగోత్రాలు), ‘గాంధీ పుట్టినదేశమా ఇది!’ (పవిత్రబంధం), ‘పగడాల జాబిలి చూడు’ (మూగనోము) ‘ఈ జీవన తరంగాలలో’ (జీవనతరంగాలు), ‘నా హృదయంలో నిదురించే చెలి’ (ఆరాధన), ‘కల కానిది.. విలువైనదీ..’ (వెలుగునీడలు), ‘నేను పుట్టాను ఈ లోకం మెచ్చింది’ ‘ప్రేమనగర్‌’ ఒకటా రెండా.. వందలూ… వేలు…. ఇవిగాక ప్రైవేటు రికార్డులు. కొన్ని… ‘తల నిండా పూదండ.. గుత్తివంకాయ కూరోరు బావా.. నిను మరువలేనురా.’ నండూరి వారి ఎంకి పాటలు.. పుష్పవిలాపం.. కుంతి విలాపం.. ఎన్నని రాయగలం. రాయాలంటే ఓ పుస్తకం వెయ్యిపేజీలు రాయొచ్చు.

‘‘ఘంటసాల గారికి సాహిత్యంలో వస్తున్న గీతాలు, ప్రజాజీవితంలో పాటలంటే చాలా ఇష్టం. ఆయన వాటిని వెతుక్కుంటూ శ్రీకాకుళం దాకా వెళ్లారు. ‘రావయాన రావయాన రాజా నామాలుకి (నా మహలుకి)’ అంటూ జముకు వాయిస్తూ జానపదులు పాడిన పాటను ఆయన ఇలాంటి అన్వేషణలో జానపదుల నుంచి విని సినిమాకు వాడారు. ఆయన వల్ల ‘అత్తలేని కోడలుత్తమురాలు ఓయమ్మా’ లాంటి పాటలు ప్రజలలో ప్రాచుర్యం పొందాయి. సినిమాలతో సంబంధం లేకుండా ప్రైవేట్‌ గ్రామఫోను రికార్డులు కూడా చేశారు. కరుణశ్రీ రచించిన ‘పుష్పవిలాపం’, ‘కుంతీకుమారి’ రసజ్ఞుల హృదయాలను దోచుకున్నాయి. శ్రీశ్రీ ‘పొలాలనన్నీ హలాల దున్నీ’, గురజాడ వారి ‘పుత్తడిబొమ్మ పూర్ణమ్మ’ పాటలు ప్రాచుర్యం పొందాయి. ఆరోజుల్లో రేడియోలో ఎన్నో లలిత గీతాలు పాడారు ఘంటసాల. ‘ఈ చల్లని రేయి తిరిగి రానేరాదు’, ‘తూరుపు దిక్కున అదిగో చూడు’, ‘బహుదూరపు బాటసారి’ వంటి పాటలెన్నో. ఆనాటి పరిస్థితులకు అనుగుణంగా ఆంధ్రరాష్ట్ర గానం వంటి ఆంధ్రమాతను ప్రస్తుతించే పాటలు, ‘ఆంధ్రుల చరితం అతిరసభరితం’ వంటి పాటలు ఎంతో ఉత్తేజకరంగా గానం చేశారు. తిరుపతి శ్రీవేంకటేశ్వరుని మీద పాడిన భక్తిగీతాలు తెలుగునాట ఇంటింటా వినిపించాయి. తిరుమల గిరులు ఘంటసాల గారి భక్తిగీతాలతో ప్రతిధ్వనించాయి.ఘంటసాల తన జీవిత చరమాంకంలో గానం చేసినది భగవద్గీత. ఇది రాగబద్ధం చేస్తున్నప్పుడే చాలా ఆసక్తికరంగా ఉండేది. భగవద్గీత సంగీత ప్రధానమైన రచన కాదు. ప్రధానంగా తాత్త్విక చర్చ వంటిది. అటువంటి రచనను సంగీతానికి అనుకూలంగా చేయడంలో కృతకృత్యులయ్యారు ఘంటసాల.

ఘంటసాల మనందరికీ దూరమై, అమరగాయకుడై నాలుగు దశాబ్దాలు దాటుతున్నా ఆయన పాడిన పాటల్ని వర్ధమాన గాయకులు ఇంకా పాడుతూండడం తెలుగువారికి ఆయనపట్ల గల అపారప్రేమకు, అభిమానానికీ నిదర్శనం. నేటికీ అనేక తెలుగు కుటుంబాలలో ఘంటసాల ప్రాతఃస్మరణీయుడు.
———————————–

Send a Comment

Your email address will not be published.