అనవసరపు అడ్డుగోడ

అనవసరపు అడ్డుగోడ

మన ఇంటికి, పొరుగింటికి మధ్య దూరం పెద్దగా ఉండకపోవచ్చు. ఉంటే మహా అయిదు పది అడుగుల కన్నా దూరం ఉండకపోవచ్చు. కానీ నిజానికి మనకు, పక్కింటి వారికి మధ్య మానసికంగా చైనా గోడ అంత పొడవు ఉంటుంది అనేది వాస్తవం. ఒకటి రెండు కారణాలతో పొరుగింటి వారితో మాట్లాడిన వారంటే గిట్టని కారణాలు మనలో అనేకం ఉంటాయి. ఆ కారణాల వల్ల మనసులో ఒకటుంచుకుని పై పై పెదవులతో అన్య మనస్కంగా మాట్లాడుతుంటాం. ఇలా రాయడం వెనుక కారణం లేకపోలేదు. ఈ మధ్య అంతర్జాలంలో ఒక లఘు చిత్రం చూసాను. ఆ చిత్రం నిడివి ఎనిమిది నిమిషాలు. ఆ చిత్రానికి ఆస్కార్ అవార్డు కూడా లభించింది. ఆ చిత్రానికి దర్శకుడు నార్మన్ మెర్క్లెన్. పక్కనే ఉన్న డిందు ఇళ్ళ మధ్య ఓ పువ్వు వల్ల వచ్చిన సమస్యతో ప్రాణాలు తీసేసుకోవడం వరకు వెళ్ళడం ఆ చిత్ర కథా సారాంశం.

ఓ సువిశాలమైన పచ్చిక బయలు. నిగనిగలాడే ఆ పచ్చిక బయలులో రెండిళ్ళు పక్కపక్కనే ఉన్నాయి. రెండిళ్ళ యజమానులు బాగా చదువుకున్న వాళ్ళే. వాళ్ళు ఇద్దరూ వాకిట్లో పడక్కుర్చీలు వేసుకుని అందులో కూర్చుని ప్రకృతి సౌందర్యాన్ని ఆస్వాదించిన వాళ్ళే. తాము పొందిన ఆనందాన్ని పరస్పరం మాటలతో పంచుకున్న వారే.

రోజులు గడుస్తున్నాయి.

ఇంతలో ఒక రోజు ఒక పసుపు రంగు పువ్వు పూస్తుంది. అది చూడటానికి ఎంతో అందంగా ఉంది. ఈ రెండిళ్ళ యజమానులు ఆ పువ్వును తదేకంగా చూసి ఆనందిస్తారు. అయితే అక్కడితో ఆగిపోయి ఉంటే బాగుండేది. కానీ ఆగరు. ఒకింటి యజమాని ఆ పువ్వు తనకే సొంతం అనేలా తన ఇంటి నుంచి ఆ పువ్వును తన పరిధిలోకి కలుపుకునేలా కంచె ఏర్పాటు చేస్తాడు. అయితే రెండో ఇంటి యజమానికి కోపం వస్తుంది. ఆ పువ్వు తన ఇంటి ఆవరణలోనిదే అని చెప్పడం కోసం మొదటి ఇంటి యజమాని వేసిన కంచెను ధ్వంసం చేసి తాను కొత్తగా కంచె వేస్తాడు. అది చూసి మొదటి ఇంటి యజమాని ఆవేశంతో ఊగిపోతూ రెండో ఇంటి యజమానిపై దాడి చేస్తాడు. రెండో ఇంటి యజమాని ఆగడు. అతనూ దాడికి దిగుతాడు. ఇద్దరూ కొట్టుకుంటారు. ఇద్దరికీ తీవ్ర గాయాలు అవుతాయి. అంతటితో ఆగిపోయినా బాగుండేది. కానీ ఆగరు. పరస్పరం ఒకరి ఇంట్లోకి ఒకరు జొరబడి భార్యా బిడ్డలను చంపుకుంటారు. ఇళ్ళను ధ్వంసం చేసుకుంటారు. ఆ తర్వాత తమను కూడా మరింత గాయపరచుకుని ప్రాణాలు తీసుకుంటారు. వారు చనిపోయిన చోట రెండు సమాధులు ఏర్పడతాయి. ఆ సమాధుల మధ్య పసుపు పువ్వు మౌనంగా అటూ ఇటూ కదులుతుంటుంది.

పొరుగిళ్ళ వాళ్ళు ఇద్దరూ ఇలా ఓ అందమైన పువ్వును పువ్వుగా చూడకుండా ప్రతీకారం తీర్చుకుని కొట్టుకుని చనిపోవడం అవసరమా. ఎంత దారుణం ఇది. ఇలాంటివి జరగకుండా ఉండాలంటే మనలో సహనం, సంస్కారం, ప్రేమ, అనురాగం వంటివి ఉండాలని చాటి చెప్పే ఈ చిత్రం లఘు చిత్రమే కావచ్చు కానీ అది ఇచ్చిన సందేశం అద్భుతం.

జీవితకాలం స్వల్పం. ఈ స్వల్పకాలంలో చిన్న చిన్న అభిప్రాయభేదాలు ఉన్నా వాటిని తగ్గించుకుని కలసి మెలసి ఆనందంగా జీవించడం ప్రధానం కదా. కక్షలు పెంచుకోవడం వల్ల సాధించేదేమీ ఉండదు అనే వాస్తవం తెలుసుకోవాలి.
————————-
– నీరజ, కైకలూరు

Send a Comment

Your email address will not be published.