అబలత్వం నుంచి సబలగా...

Intl womens day
– నేడు అంతర్జాతీయ మహిళా దినోత్సవం

ప్రతిఏటా మార్చి 8న అంతర్జాతీయ మహిళాదినోత్సవాన్ని అంతా జరుపుకుంటున్నారు. ప్రభుత్వాలు, మహిళాసంఘాలు, వ్యాపారులు, స్వచ్ఛంద సంస్థలు ఈరోజున చాలా కార్యక్రమాలు నిర్వహిస్తాయి. అయితే మహిళాదినోత్సవ వాస్తవ లక్ష్యం ఇందుకు భిన్నమైనది. లింగవివక్షను అధిగమించడం, స్త్రీ పురుష సమానత్వానికి ఉద్యమించడం, ప్రపంచవ్యాప్తంగా మహిళల హక్కులకోసం జరుగుతున్న పోరాటాలు, మహిళలు సాధించిన విజయాలు, నిస్సహాయస్థితిలో ఉన్న తోటి మహిళలకు అందించిన తోడ్పాటు వంటి వాటితో మమేకమై ఉంటుంది. ఈ ఏడాది 2018లో దీనికి లక్ష్యం (థీమ్‌)గా ‘ప్రెస్‌ ఫర్‌ ప్రోగ్రెస్‌’ అనే నినాదాన్నిస్తున్నారు. ఈ నినాదం అర్థమేమిటంటే …మహిళలు సామూహికంగా తమ హక్కుల కోసం ఎలుగెత్తి చాటడం. లైంగిక వివక్ష, లైంగిక వేధింపులు వంటి వాటి నుంచి ఐక్యంగా బయటపడడం కోసం ఉద్యమించడం. అయితే ఇదంతా రాత్రికి రాత్రే సాధ్యమయ్యేది కాదు. కానీ మహిళల హక్కులకోసం న్యాయపరమైన మద్దతు, క్రియాశీలక చైతన్యం, సామాజిక అవగాహన పెరుగుతున్నవేళ లక్ష్యసాధనకు మరింత చేరువయ్యే అవకాశాలున్నాయనే ఆశాభావం వారిలో వ్యక్తమౌతోంది.

అంతర్జాతీయ మహిళా దినోత్సవం నేటి శ్రామిక మహిళలకు స్ఫూర్తి దాయకం. నేడు మనం అనుభవిస్తున్న ప్రతి హక్కు, సౌకర్యం వెనుక ఎంతో మంది వీర వనితల త్యాగాలు, పోరాట స్ఫూర్తి ఉంది. బహుళ జాతి సంస్థలు మహిళా దినోత్సవ ప్రాధాన్యతను మరుగు పరిచి స్త్రీని వినిమయ వస్తువుగా పరిగణించి తమ ఉత్పతుల అమ్మకాలకు, ప్రచారానికి ప్రత్యేక వేదికగా మలుచుకుంటున్నాయి. ప్రభుత్వాలు మహిళా సాధికారత పదాలను వల్లెవేస్తూ మహిళల హక్కులను కాలరాస్తు న్నాయి.

మార్చి 8 నేపథ్యం
వంటింటి సామాను అమ్మకపు వస్తువుగానో, షాంపూ, బ్లేడు, పిల్లలకు, భర్తలకు ఏమి కావాలో అమర్చే వ్యక్తిగానో, ప్రేమ, త్యాగాలు, పగ, ద్వేషంతో నిత్యం రగిలిపోయే పాత్రధారిగానో, హింస, అత్యాచారాలకు గురయ్యే అబల కాదు అని చాటాయి అంతర్జాతీయ శ్రామిక మహిళా ఉద్యమాలు. స్వేచ్ఛ, సమానత్వం కోసం నినదించారు. ఆహారం, ఆరోగ్యం, విద్య, ఓటుహక్కుకై పోరాడారు. ఉపాధి, గౌరవం కల్పించాల న్నారు. నిర్లక్ష్యాన్ని సహించం, మేము దేనిలోనూ తీసిపోం అంటూ కదన రంగంలో నిలిచారు. ప్రాణాలను సైతం తృణ ప్రాయంగా భావించారు. అదే నేటి శ్రామిక మహిళలకు స్ఫూర్తిదాయకం. ఆకలి, పేదరికం ప్రపంచీకరణ అవుతున్న నేపథ్యం. పెరుగు తున్న హింస, తరిగిపోతున్న ఉపాధుల మధ్య సతమతమవుతున్న నేటి కార్మిక వర్గానికి, మహిళా ఉద్యమాలకు గత పోరాటాలను, వాటి స్ఫూర్తిని ముందుకు తీసుకువెళ్లటానికి ఉపయోగపడతాయి. ఆనాడు పరిశ్రమల్లో మహిళలకు అతి తక్కువ వేతనాలకు ఉపాధి కల్పించారు. కార్మిక వర్గంలో కూడా మహిళల పట్ల సనాతన ఆలోచనల కారణంగా అనేక పరిశ్రమల్లో మహిళలను చేర్చుకోలేదు. 1848 కమ్యూనిస్టు ప్రణాళి కలో మార్క్స్‌, ఎంగెల్స్‌ ”వర్గపోరాటం, స్త్రీ విముక్తి రెండూ కలిసే జరగాలి” అని స్పష్టంగా పేర్కొన్నారు. స్త్రీ పురుషులను సమానంగా చూస్తే కుటుంబాలు నాశనమవుతాయని సనాతనవాదులు గగ్గోలు పెట్టారు.

వందలాది బట్టల మిల్లుల్లో పని చేసే మహిళలు అమెరికాలోని న్యూయార్క్‌ నగరంలో 1857 మార్చి 8న సమ్మె చేశారు. పని ప్రదేశాల్లో సౌకర్యాలు, మెరుగైన వేతన పెంపు కోసం, ఎనిమిది పని గంటల పని కోసం కదం తొక్కారు. యాజమాన్యం నిర్బం ధాన్ని ప్రయోగించి ఉద్యమాన్ని అణచే ప్రయ త్నం చేసింది. ”ఆకలి కడుపులతో పని చేయ డం కన్నా పోరాడుతూ చావడం మేలు” అన్న నినాదంతో నిర్బంధాన్ని సైతం ఎదుర్కొని పోరాడిన ఫలితంగా యాజమాన్యం దిగిరాక తప్పలేదు. కార్మికులతో ఒప్పందాలు జరిగాయి.”1866లో అంతర్జాతీయ కార్మిక సంస్థ పరిశ్రమల్లో మహిళలు పనిచేయాలి. పని చేయడం ద్వారా స్త్రీల జీవితాల్లో విప్లవాత్మక మార్పు వస్తుంది. శ్రామిక మహిళలను సంఘటితం చేయాలని, స్త్రీల ప్రత్యేక సమస్యలు కార్మికోద్యమ ప్రధాన స్రవంతిలో భాగం కావాలి” అని మార్క్స్‌ నొక్కి చెప్పారు. 1869లో లేమాన్స్‌ సిల్క్‌ మహిళా కార్మికుల సమ్మెను సమర్థిస్తూ మహిళల అణచివేతను మార్క్స్‌ తీవ్రంగా వ్యతి రేకించారు. 1871 పారిస్‌ కమ్యూన్‌లో కార్మిక ప్రభుత్వ రక్షణ కోసం వేలాది మంది మహిళలు బారికేడ్‌లను ఛేదించుకొని పోరాడారు. ఆ పోరా టంలో అనేక మంది ప్రాణాలు కోల్పోయారు. 1889లో పారిస్‌లో జరిగిన రెండో అంతర్జాతీయ మహాసభలో క్లారా జట్కిన్‌ చొరవతో మహిళల పని హక్కు, తల్లీ బిడ్డల సంరక్షణ, ఓటు హక్కు వంటి అంశాలను చర్చకు పెట్టారు. 1907, ఆగస్టు 17న అంతర్జాతీయ సోషలిస్టు మహాసభ జర్మనీలోని స్టట్‌గార్ట్‌లో జరిగింది. ఆ సమయంలోనే మొదటి సోషలిస్టు మహిళా మహాసభను నిర్వహించారు. ఆనాడు ప్రజాస్వామ్య దేశాలని చెప్పుకునే ఏ ఒక్క దేశంలోనూ మహిళలకు సార్వత్రిక ఓటు హక్కు లేదు. సంపన్న వర్గాల పురుషులకు మాత్రమే ఓటు హక్కు ఉంది. స్టట్‌గార్ట్‌లో జరిగిన మహిళా సోషలిస్టు మహాసభలో మహిళా హక్కులతోపాటు స్త్రీ పురుషులందరికీ ఓటు హక్కు కల్పించాలని డిమాండ్‌ చేశారు. ఆ సభలో క్లారా జట్కిన్‌ కార్యదర్శిగా ఎన్నికయ్యారు. నాడు క్లారా జట్కిన్‌ నాయక త్వంలో ‘సమానత్వం’ పత్రిక ప్రారంభమైంది. 1910లో కోపెన్‌హెగెన్‌లో జరిగిన రెండో అంతర్జాతీయ మహిళా సదస్సుకు 17 దేశాల నుంచి వందమంది ప్రతినిధులు హాజరయ్యారు. ఆ సదస్సులో ఓటుహక్కు, మాతాశిశు సంరక్షణ, ప్రసూతి సౌకర్యాలు, యుద్ధానికి వ్యతిరేకంగా తీర్మానాలు ఆమోదించారు. ఈ సభలోనే మహిళా హక్కుల సాధన కోసం అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరపాలని తీర్మానించారు.

ఆనాటి శ్రామిక మహిళల పిలుపుతో ప్రారంభమైన మార్చి 8 మహిళా దినోత్సవం ప్రపంచవ్యాప్తమయింది. దోపిడీ, అణచివేతకు వ్యతిరేకంగానూ, సమానత్వం, స్వేచ్ఛ కోసం ‘మార్చి 8’ జరుపు కుంటున్నాం. 1972లో జరిగిన ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశం ప్రపంచ మహిళా సదస్సు జరపాలని నిర్ణయించింది. 1975లో మెక్సికోలో జరిగిన రెండవ ఇంటర్నేషనల్‌ మహిళా సదస్సు మహిళల స్ధితిగతులపై చర్చించింది. 1985లో నాల్గవ ప్రపంచ సదస్సు వివిధ దేశాల్లో సాధించిన విజయాలను సమీక్షించి ఆ దశాబ్దాన్ని మహిళా దశాబ్దంగా ప్రకటించింది. మరలా 1995లో బీజింగ్‌లో జరిగిన నాలుగో ప్రపంచ మహిళా సదస్సుకు 195 దేశాల నుంచి ప్రతినిధులు హాజరయ్యారు. ఆ సదస్సులో మహిళా సంఘాలు పెట్టిన అనేక తీర్మానాలు ఆమోదం పొందాయి. మహిళలకు ఉద్యోగాల్లో, విద్యలో, స్థానికసంస్థల్లో 33 శాతం రిజర్వేషన్‌తో పాటు వరకట్న నిషేధ చట్టం మొదలైన చట్టాలను అనేక మహిళా ఉద్యమాల ఫలితంగా మన దేశంలో కూడా సాధించుకున్నాం.

చట్టసభల్లో మహిళ ….?
అంతర్జాతీయ మహిళా దినోత్సవం ప్రారంభమై 107 సంవత్సరాలు అయింది. శతాబ్ద కాలం దాటినా మహిళల పరాధీనత, సాధికారతలో సమూలమైన మార్పులు రాలేదు. అధికారమైనా, అవకాశాలైనా మేము దయతలచి ఇస్తే తీసుకోవాలనే పురుషాధిక్య భావజాలం భౌతికంగా, నైతికంగా స్త్రీ అస్తిత్వాన్ని దెబ్బతీస్తోంది. చట్టసభల్లో సమానత సాధన కోసం రెండు దశాబ్దాలుగా మహిళా ఉద్యమాలు అలుపెరుగని పోరాటం చేస్తున్నాయి. చట్టసభల్లో స్త్రీల ప్రాతినిథ్యం 11.23 శాతం (61 మంది) ప్రాతినిథ్యంతో 140 దేశాల జాబితాలో భారత్‌ 103వ స్థానంలో ఉంది. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల శాసనసభల్లో మరీ అధ్వానంగా ఉంది. మన రాష్ట్రంలో 25 మంది ఎంపిలకు ఇద్దరు, అసెంబ్లీలో 175 మందికి 20 మంది మాత్రమే మహిళలున్నారు.
మన పొరుగు దేశాలు నేపాల్‌లో 29.5, ఆఫ్ఘనిస్థాన్‌లో 27.7, పాకిస్తాన్‌లో 20, బంగ్లాదేశ్‌లో 19 శాతం మహిళల ప్రాతినిధ్యం ఉంది. అతి పెద్ద ప్రజాస్వామ్య దేశమని చెప్పుకునే భారత్‌లో 20 ఏళ్లుగా మహిళా రిజర్వేషన్‌ బిల్లు పెండింగ్‌లో ఉంది. విధాన నిర్ణయాల్లో దేశ జనాభాలో సగ భాగంగా ఉన్న మహిళల భాగస్వామ్యం లేకుండా మహిళా సాధికారత ఎక్కడిది?

వైద్య, ఆరోగ్యంలో మహిళల స్థానమెక్కడ?
స్త్రీలపై అత్యాచారాలు, లైంగిక వేధింపులు, వరకట్నపు దాడులు పెరుగుతుంటే ఆడపిల్లలను పిండ దశలోనే నులిమేస్తున్న దుస్సంస్కృతి విస్తరిస్తోంది. 2011 జనాభా లెక్కల ప్రకారం బాల, బాలిక నిష్పత్తి 1000:914గా ఉంది. మహిళల ఆరోగ్య సమస్యలు పెరుగుతున్నాయి. ప్రభుత్వాస్పత్రుల్లో ప్రసూతి సౌకర్యాలు లేక ఎందరో తల్లులు ప్రసవ సమయంలోనే మరణిస్తున్నారు. జాతీయ ఆరోగ్య సర్వే-3 ప్రకారం మహిళల్లో 51.8 శాతం మంది పౌష్టికాహార లోపంతో ఉన్నారు. 55.3 శాతం రక్తహీనతతో, అనారోగ్యంతో బాధపడుతున్నారు. యునిసెఫ్‌ అంచనాల ప్రకారం భారత్‌లో ఏడాదికి 75 లక్షల నవజాత శిశువులు తక్కువ బరువుతో పుడుతున్నారు. ప్రతి వెయ్యికి 38 మంది ఆడ శిశువుల మరణాలు సంభవిస్తున్నాయి. విద్య, ఉద్యోగం, ఆరోగ్య, ఆర్థికరంగాల్లో అసమానతల్లో ప్రపంచ దేశాల జాబితాలో 139వ స్థానంలో ఉందని ప్రపంచ ఆర్థిక సంఘం నివేదిక తెలుపుతోంది.

లైంగిక వేధింపులు-అత్యాచారాలు
మూడు దశాబ్దాలుగా పాలక వర్గాలు అనుసరిస్తున్న ప్రపంచీకరణ విధానాల వల్ల పోరాడి సాధించుకున్న చట్టాలు కనుమరుగవుతున్నాయి. రాత్రి షిప్టులలో మహిళల చేత పనిచేయించ కూడదనే నిబంధనను సడలించింది. పర్మినెంటు ఉద్యోగాల స్థానే క్యాజువల్‌ కార్మికులు, గృహ కార్మికులు 10 నుంచి 12 శాతం పెరిగారు. పని గంటలు పెరిగాయి. శ్రమ దోపిడీ పెరిగింది. కాంట్రాక్టు కార్మికులకు నిజ వేతనాలు లేవు. ఉద్యోగ భద్రత లేదు. శాశ్వత ఉద్యోగుల్లో రిటైర్‌ అయిన వారి స్థానంలో కొత్త నియామకాలు లేకపోవటంతో అనేక రంగాలలో ఉన్నవారిపై పని భారం పెరుగుతోంది. ప్రభుత్వ రంగాన్ని మూసివేసి ప్రయివేటీకరించే దిశగా ప్రభుత్వాలు నడుస్తున్నాయి. పేదల సంక్షేమాన్ని విస్మరించి ప్రాథమిక విద్య, వైద్య రంగాలను కార్పొరేటీకరిస్తోంది. ప్రభుత్వ పథకాలలో పని చేన్తున్న స్కీమ్‌ వర్కర్లను ప్రభుత్వం శ్రమ దోపిడీ చేస్తోంది. అరకొరగా ఇచ్చే వేతనాలు కూడా నెలనెలా ఇవ్వరు. తమ సమస్యల పరిష్కారానికై పోరాడుతున్న మహిళా ఉద్యోగినులు, కార్మికులపై ప్రభుత్వం తీవ్రమైన నిర్బంధకాండ ప్రయోగిస్తోంది.పిల్లల పట్ల అనుచిత లైంగిక ప్రవర్తన, లైంగిక కుంభకోణాలు, బ్లాక్‌మెయిలింగ్‌ వగైరాలు పెరిగాయి. నయా ఉదారవాద విధానాల వల్ల వినియోగ విలువలు సర్వవ్యాప్తమవుతున్న పరిస్థితుల్లో స్త్రీని కించపరిచే విధంగా అసభ్యంగా చిత్రించే ధోరణులు సీరియళ్లలో, సినిమాల్లో, సోషల్‌ మీడియాలో విపరీతంగా పెరుగుతున్నాయి. సైబర్‌ నేరాలు పెరిగాయి. దారిద్య్రం కారణంగా స్త్రీలు అనేక ప్రాంతాల్లో వ్యభిచార వృత్తిలోకి నెట్టబడుతున్నారు. ఇది స్త్రీల ప్రతిపత్తిపై అనేక విధాల ప్రభావం చూపిస్తోంది. అదే సమయంలో పెరిగి పోతున్న గృహహింస పెద్ద సంఖ్యలో స్త్రీల ప్రాణాలు బలిగొంటోంది. వారి శారీరక, మానసిక ఆరోగ్యాలను హరిస్తోంది.

మార్చి 8 అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళల హక్కులను ఎలుగెత్తి చాటాలి. 160 సంవత్సరాల నాడు 8 గంటల పనిహక్కు, అమానవీయ పని పరిస్థితులకు వ్యతిరేకంగా, వేతన పెంపు కోసం, ధరల తగ్గింపు కోసం, సార్వజనీన ఓటుహక్కు కోసం పోరాటాలు నిర్వహించారు. లాఠీలు, తూటాలను, ప్రాణాలను సైతం లెక్కచేయలేదు. ఆ వీరోచిత పోరాటాలు స్ఫూర్తి కావాలి. చట్టసభల్లో రిజర్వేషన్లు, బడ్జెట్‌లో వాటా, పని హక్కు, గౌరవప్రదమైన జీవితం, కనీస వేతనం, వృద్ధాప్యంలో భద్రత కోసం, హింసకు వ్యతిరేకంగా, మద్యం నియంత్రించాలని, ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా మార్చి 8 స్ఫూర్తితో సంఘటితంగా మహిళల హక్కులకై ముందుకుసాగుదాం.

#MeToo ఉద్యమం
ఇటీవల కాలంలో ఈ ఉద్యమం మరింత ఉధృతమై ఎన్నెన్నో అకృత్యాలు వెలుగులోకి వస్తున్నాయి. హాలీవుడ్ లో మొదలై ప్రపంచమంతటా #MeToo ఉద్యమానికి ఊతం ఇస్తున్నారు. అత్యున్నత స్థానంలో ఉన్న ఎందరో మహిళలు పురుషాధిక్యత గల సమాజంలో లైంగిక వేధింపులకు గురై వారి బాధలను తెలియజేస్తున్నారు. లింగ సమానత్వం మాటల వరకే పరిమితమై ముందుకు సాగడం లేదన్నది నిర్వివాదాంశం.

Send a Comment

Your email address will not be published.