అలా... ఇలా....

1
అడిగింది వినిపించాలేదేమో
దేవుడి ముందు గంట కొడుతున్నాడు
భక్తుడు

2
యవ్వనం తీరిపోవడంతోనే
తానెంటో ఆలోచించడం
మొదలుపెట్టింది …వేశ్య

3
కోల్పోయిన తర్వాత
ఆలోచిస్తుంటాం
జీవితాన్ని

4
మౌనం
మాట్లాడుతోంది
మనసుతో గుట్టుగా

5
నాలో నమ్మకం పుట్టింది
నన్ను దాటుకుంటూ వెళ్ళిన వ్యక్తి
ఓ అంధుడు

6
నిద్రకు ముందు
వేల కలలు
నవ వధువు

7
రెక్కలొచ్చాయి పక్షిపిల్లకు
గూడు మరిచింది
మనిషిలా

8
చుట్టూ నిగనిగలాడే తోట
కానీ
మనసు మాత్రం ఎడారి

9
డబ్బున్నోళ్ళు
కౌలుకు తీసుకున్నారు
గుండెపోటుని

10
చెప్పుకోవడానికే తోడపుట్టిన వాళ్ళు
గుమికూడారు
అమ్మ పోయినప్పుడు మాత్రం

11
ఎన్నో అడవులు వెతికాను
విసుగుపుట్టేదాక…..
ఒక్క బోధి వృక్షం కనిపించలేదు

12
అందరిలోనూ
ఉన్న జబ్బు
చాపల్యం

13
ఎందుకో గాంభీర్యం
కాలిపోతున్న నిజం తెలియని
సిగరెట్టూ

14
స్వాతంత్ర్య దినోత్సవం
సొతంత్రంగా రెపరెపలాడుతోంది
జాతీయ పతాకం

15
వెన్నెల
చిరునామా
నింగీ, చందమామా

—————————
యామిజాల జగదీశ్

Send a Comment

Your email address will not be published.