ఆకట్టుకునే మరో కుటుంబ కథాచిత్రం

ammamma gari illu

ఆకట్టుకునే మరో కుటుంబ కథాచిత్రం- అమ్మమ్మగారిల్లు

నాటి తరాన్నుంచి నేటి తరం వరకూ కుటుంబకథా చిత్రాలకు ఆదరణ ఉంది. శుక్రవారం విడుదలైన అమ్మమ్మగారిల్లు సినిమాలో కొత్తదనం అంతగా లేకపోయినా ఫ్యామిలీ ఫార్ములా కాబట్టి కొంతలోకొంత పర్వాలేదనే చెప్పొచ్చు. అందులోనూ యూత్ హీరో తో నడిపిన కథ కావడం మరో ప్లస్ పాయింట్. కారణమేమిటంటే యువ క‌థానాయ‌కులు కేవ‌లం కాలేజీ క‌థ‌లు, ప్రేమ‌క‌థ‌లే కాదు.. కుటుంబ క‌థల్లోనూ చ‌క్క‌గా ఒదిగిపోతుంటారు. ఆ త‌ర‌హా చిత్రాలతో విజ‌యాల్ని సొంతం చేసుకొన్న క‌థానాయ‌కులు చాలామందే. ‘ఛ‌లో’తో మంచి విజ‌యాన్ని అందుకున్న నాగ‌‌శౌర్య.. అందుకు భిన్నమైన క‌థ‌తో ‘అమ్మ‌మ్మ‌గారిల్లు’ చేశాడు. ఒక‌ప్పుడు బాల‌న‌టిగా ఆక‌ట్టుకున్న షామిలి ఈ చిత్రంలో క‌థానాయిక‌గా న‌టించింది. విజ‌యాల‌తో జోరుమీదున్న నాగ‌శౌర్య‌కి ఈ చిత్రం కొంత ప్రయోజనం కల్గించేలా ఉంది

కథలోః
సీతామహాలక్ష్మి(సుమిత్ర)ది పెద్ద కుటుంబం. ఆస్తి పంపకాలపై వివాదాలు మొదలు కావడంతో కుటుంబ పెద్ద రంగారావు(చలపతిరావు) కలత చెంది చనిపోతాడు. దాంతో కుటుంబం చెల్లాచెదురవుతుంది. ముగ్గురు కొడుకులు, ఇద్దరు కూతుళ్లు తలో దిక్కు వెళ్లిపోతారు. 20 ఏళ్లయినా తిరిగిరారు. కానీ, చిన్నప్పుడే అమ్మమ్మతో అనుబంధం ఏర్పరుచుకున్న సంతోష్‌ (నాగశౌర్య) అందర్నీ కలపాలని నిర్ణయించుకుంటాడు. అందుకోసం ఏం చేశాడు? అమ్మమ్మ ముఖంలో సంతోషం ఎలా నింపాడు? అన్నదే సినిమా కథ.

విశ్లేషణః
రొటీన్ ఫామిలీ సెంటిమెంట్ కథే. అదే కుటుంబం.. అవే బంధాలు.. కానీ, చాలా సన్నివేశాలు హృదయాల్ని హత్తుకుంటాయి. చాలా రోజుల తర్వాత మరొక స్వచ్ఛమైన కుటుంబ కథను చూసిన అనుభూతికి గురిచేస్తాయి. ఎన్ని సినిమాలు వచ్చినా కుటుంబ కథలు మళ్లీ మళ్లీ తెరకెక్కడం.. వాటిని ప్రేక్షకులు ఆదరించడం వెనుక కారణం బంధాలు-అనుబంధాల గొప్పతనాలే. ప్రతి ప్రేక్షకుడికి వేగంగా కనెక్ట్‌ అయ్యే విషయాలివి. కాకపోతే వాటి మధ్య సంఘర్షణ సరైన రీతిలో పండేలా చూసుకోవాలి. ఆ విషయంలో ఈ చిత్ర దర్శకుడు సఫలమయ్యాడు. అక్కడడక్కడా నవ్విస్తూ హృదయాల్ని మెలిపెడుతూ సినిమాని తీర్చిదిద్దాడు. సినిమాలో ఆరంభ సన్నివేశాలు హత్తుకుంటాయి. ప్రేక్షకుడిని త్వరగా కథలో లీనం చేస్తాయి. ముఖ్యంగా రావురమేశ్‌, నాగశౌర్య పాత్రలను అల్లిన విధానం చాలా బాగుంది. మధ్యలో కథ కాస్త మందగమనంతో సాగడం, సంతోష్‌, సీత(షామిలి)పాత్రల మధ్య ప్రేమ చిగురించే సన్నివేశాల్లో బలం లేకపోవడం, కథలో పెద్ద మలుపులు లేకపోవడం వంటి అంశాలు సినిమాకి కాస్త ఇబ్బందిగా అనిపించినప్పటికీ వాటి గురించి పెద్దగా ఆలోచించనీయకుండా దర్శకుడు సినిమాను ముందుకు నడిపించాడు. భావోద్వేగాలు, స్వచ్ఛమైన వినోదం, కుటుంబ నేపథ్యం ప్రేక్షకులను కట్టిపడేసే అంశాలు. నాగశౌర్య ఈ చిత్రంతో కుటుంబ ప్రేక్షకులకు మరింత దగ్గరవుతాడు.

నటన తీరు:
కుటుంబ కథలకు రావు రమేశ్ ఎంత బలమో ఈ సినిమాతో మరోసారి చాటి చెప్పారు. ఆవేశపరుడైన ఇంటి పెద్దకొడుకుగా ఏ2 కాంట్రాక్టర్‌ బాబూరావుగా ఆయన నటన హావభావాలు చిత్రానికి హైలైట్‌గా నిలిచాయి. సంతోష్‌ అనే మనవడి పాత్రలో నాగశౌర్య ఒదిగి పోయాడు. పాత్రకు ఎంత అవసరమో అంతే మోతాదులో నటిస్తూ భావోద్వేగాలు పండించాడు. ఆయన నటనలో పరిణతి స్పష్టంగా కనిపిస్తుంది. శివాజీ రాజా, సుమిత్ర, రవి ప్రకాశ్‌, హేమ, సుధ తదితరుల పాత్రలు అలరిస్తాయి. స్నేహితుడి పాత్రలో షకలక శంకర్‌ నవ్విస్తాడు. పోసాని, గౌతం రాజు, సమ్మెట గాంధీ తదితరులు గుర్తుండిపోయే పాత్రలు చేశారు. సాంకేతికంగా సినిమా బాగుంది. ముఖ్యంగా మాటలు చిత్రానికి ప్రాణం పోశాయి. దర్శకుడు పాత కథనే కొత్తగా తీర్చిదిద్దిన విధానం మెచ్చుకునేలా ఉంది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి. కల్యాణ్‌ రమణ సంగీతం, ఛాయాగ్రహణం దర్శకుడి ఆలోచనలకు తగ్గట్టుగా కుదిరాయి. ఆద్యంతం సినిమా ప్రేక్షకుల్ని ఆకట్టుకుంతుంది.

తెరముందుః నాగ‌శౌర్య‌, షామిలి, సుమిత్ర‌, రావు ర‌మేష్‌, శివాజీరాజా, హేమ‌, సుధ‌, ష‌క‌ల‌క శంక‌ర్‌, ర‌విప్ర‌కాష్ త‌దిత‌రులు
తెరవెనుకః ఛాయాగ్ర‌హ‌ణం: ర‌సూల్ ఎల్లోర్‌, సంగీతం: క‌ళ్యాణ ర‌మ‌ణ, సాహిత్యం: సిరివెన్నెల సీతారామ‌శాస్త్రి, భాస్క‌ర‌భ‌ట్ల, కూర్పు: జె.పి,
క‌థ‌, క‌థ‌నం, మాట‌లు, ద‌ర్శ‌క‌త్వం: సుంద‌ర్ సూర్య‌, నిర్మాత‌: రాజేష్‌, నిర్మాణ సంస్థ‌: స్వాజిత్ మూవీస్‌

Send a Comment

Your email address will not be published.