ఇలా రచయిత అయ్యాను

ఇలా రచయిత అయ్యాను

మాక్సిం గోర్కీ …ఈ పేరు వినడంతోనే ఆయన రాసిన అమ్మ అనే పుస్తకం గుర్తుకు రాకమానదు.
ఈయన ప్రముఖ రష్యన్ రచయిత. 1868 లో పుట్టిన మాక్సిం గోర్కీ 1936 లో కన్నుమూశారు. ఆయన అసలు పేరు ఎలెక్సీ మాగ్జియోవిచ్ పెష్ కోవ్. ఆయన తండ్రి ఓ రైతు. అంతేకాదు షిప్పింగ్ ఏజెంటుగాను ఆయన పని చేశాడు. గోర్కీ చిన్నప్పుడే ఆయన తండ్రి చనిపోయాడు. ఆనాటి సంఘటన వల్లే తాను రచయిత అయినట్టు గోర్కీ చెప్పుకున్నారు.

ఒక రోజు రాత్రి. ఆదమరచి నిద్రపోతున్న గోర్కీని ఆయన తల్లి లేపి నాన్నను చివరిసారిగా చూడు అని అంటుంది. అప్పుడు గోర్కీ వయస్సు ఏడేళ్ళు. ఆయన తండ్రి తీవ్ర అనారోగ్యంతో ఎన్నో నెలలుగా మంచం మీదే ఉన్నాడు.

అమ్మ తనతో నాన్నను ఎందుకు చివరిసారిగా చూడమందో గోర్కీకి అర్ధం కాలేదు. మగత నిద్రలోనే గోర్కీ నాన్న పడుకున్న గదిలోకి వెళ్తాడు. నాన్న గోర్కీ వంక బేలగా చూస్తాడు. గోర్కీకి ఏమీ అర్ధం కాలేదు. నాన్న మంచానికి దగ్గరలోనే గోర్కీ వాళ్ళ అమ్మ ఏదో ప్రార్ధన చేస్తోంది. అదేదీ పట్టనట్టు గోర్కీ నిద్ర వస్తోందంటూ అక్కడి నుంచి పరిగెత్తుకుని వచ్చి తన పక్క మీద పడుకుంటాడు.

తెల్లవారింది.

అప్పటికే ఆయన తండ్రి చనిపోయి ఉన్నాడు. బంధువులు. చుట్టుపక్కల వాళ్ళు వచ్చారు. గోర్కీ తండ్రి భౌతికకాయాన్ని శ్మశాన వాటికకు తీసుకుపోవడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. మృతదేహాన్ని మోసుకుని గోర్కీ బంధువులు నెమ్మదిగా శ్మశాన వాటికకు అడుగులు వేస్తున్నారు. గోర్కీ కూడా వెళ్ళారు. ఆ సమయంలో జోరున వర్షం పడుతోంది. అలాగే అందరూ శ్మశానవాటికకు చేరారు. అక్కడ మృతదేహాన్ని పాతిపెట్టడానికి గొయ్యి తవ్వుతున్నారు. ఆ గోయ్యికి దగ్గరలో రెండు కప్ప పిల్లలు ఆకాశాన్ని చూసి అరుస్తున్నాయి. వాటి వంకే గోర్కీ ఆశ్చర్యంగా చూశాడు. కాస్సేపటికి గోర్కీ తండ్రి భౌతికకాయాన్ని గోతిలోకి దింపి మట్టి తవ్వి పోతున్నారు. అలా మట్టి తవ్వి పోతున్నప్పుడు మట్టితోపాటే కప్పపిల్లలు కూడా గోతిలో పడిపోయాయి. వాటినెవరూ పట్టించుకోలేదు. గోర్కీ మనసు చలించిపోయింది. మూగరోదనతో తల్లడిల్లాడు. తన తనది చనిపోవడం మాట అలా ఉంచి, సజీవంగా ఉన్న కప్పపిల్లలు కూడా చనిపోవడంతో ఆయన ఎంతో బాధపడ్డారు. ఎవరో ఒకరి కోసం ఓ రెండు అమాయక జీవులు తమ ప్రాణాలు కోల్పోయాయి కదా అని అనుకుంటూ ఈ సంఘటనతోనే తానూ రాయడం మొదలుపెట్టినట్టు గోర్కీ చెప్పుకున్నారు.

గోర్కీ ఎనిమిదవ ఏటనే పనిలోకి చేరారు. చెప్పుల దుకాణంలో చేరిన గోర్కీ వార్తాహరుడిగాను, వోల్గా అనే ఓడలో ప్లేట్లు కడుగే పని వాడుగాను పని చేశారు. ఓడలో పని చేస్తున్న రోజుల్లో ఓ వంట వాడు వీలు ఉన్నప్పుడల్లా పుస్తకాలు చదవడం చూసిన గోర్కీ మనసు కూడా పుస్తకాలు చదవడంపై మళ్ళింది. ఆ ఆసక్తి తుది శ్వాస వరకు సాగింది. అర్దాకలితోను, కట్టుకోవడానికి సరైన బట్టలు లేకుండా నా అవస్థలు పడిన గోర్కీ తన కలం పేరుగా గోర్కీ అని పెట్టుకున్నారు. రష్యన్ భాషలో గోర్కీ అంటే చేదు అని అర్ధం. తాను ఎన్నో ఏళ్ళ పాటు పడిన చేదు అనుభవాలను దృష్టిలో పెట్టుకుని ఆ పేరు పెట్టుకున్నట్టు కూడా గోర్కీ చెప్పారు. దేశదిమ్మరిగా రష్యా అంతటా తిరిగిన గోర్కీ 1892 లో మొట్టమొదటిసారిగా ఒక కథ రాశారు. ఆ కథ పేరు మకార్ చూద్రా.

ఆమన 1936 జూన్ 14వ తేదీన మరణించినప్పుడు కొన్ని అపోహలు వచ్చాయి. ఆయన ఆకస్మికంగా చనిపోవడం అనుమానాలకు తావిచ్చింది. అది సహజ మరణం కాదని, బలవన్మరణమని వార్తలు వచ్చాయి. ఓ సోవియట్ యూనియన్ వ్యతిరేక సంస్థ వారి కుట్ర ఫలితంగానే గోర్కీ చనిపోయినట్లు విచారణలో తేలింది. అమ్మ రచనతో విశ్వవ్యాప్తంగా పేరుప్రఖ్యాతులు గడించిన గోర్కీ ఆత్మ కథ పేరిట మూడు సంపుటాలు రాశారు. అవి …. ఒకటి నా బాల్యం. రెండు – ఈ ప్రపంచంలో. మూడు నా విశ్వవిద్యాలయాలు. రష్యన్ సాహిత్యంలో ఆయన ఆత్మకథ తలమానికమై నిలిచింది అనడంలో అతిశయోక్తి లేదు.

– యామిజాల జగదీశ్

Send a Comment

Your email address will not be published.