ఈ నెలాఖరులో 'అత్తారింటికి దారేది?'

ఈ నెలాఖరులో 'అత్తారింటికి దారేది?'

అక్టోబర్ నెలాఖరులో గానీ విడుదల కాదనుకున్న ‘అత్తారింటికి దారేది?’ చిత్రం సెప్టెంబర్ చివరి వారంలోనే విడుదలయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. భోగవల్లి ప్రసాద్ నిర్మించిన ఈ చిత్రంలో పవన్ కల్యాణ్ కథా నాయకుడు కాగా, త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకుడు. జూలైలోనే విడుదల కావాల్సిన ఈ చిత్రం తెలంగాణా, సీమాంధ్ర ఆందోళనల కారణంగా వాయిదా పడింది. అయితే ఈ సినిమా విడుదలను వాయిదా వేయడం వల్ల నిర్మాత ఆర్థికంగా బాగా నష్టపోతున్నారని, వడ్డీలు కట్టుకోలేక అవస్థలు పడుతున్నారని తెలిసింది. ఈ సినిమాని సుమారు 35 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించారని వినికిడి. ఈ చిత్రం వల్ల వచ్చే లాభాలతో ‘బాహుబలి’ అనే చిత్రాన్ని నిర్మించాలని నిర్మాత భావించారు. కానీ పరిస్థితులు తారుమారయ్యాయి. అత్తారింటికి దారేది? చిత్రంతోనే ఆయన ఆర్థికంగా కుప్పకూలిపోయారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. చిరంజీవి కుటుంబానికే చెందినా రామ్ చరణ్ నటించిన ‘తూఫాన్’ చిత్రం విఫలం కావడంతో, ప్రసాద్ కు ఇంకో భయం కూడా పట్టుకుంది. చిరంజీవి కుమారుడి చిత్రమే ఫెయిల్ అయినప్పుడు, చిరంజీవి తమ్ముడి చిత్రం విజయం సాధిస్తుందా అని ఆయన దిగులు పడుతున్నారు. పవన్ కల్యాణ్ కూడా తన చిత్రం విడుదల కావడానికి ఇది సమయం కాదని భావిస్తున్నారు. కానీ ప్రసాద్ అత్తారింటికి దారేది? చిత్రం మీద బాగా ఆశలు పెట్టుకుని ఉన్నారు. త్వరగా ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు ఆయన ప్రయత్నిస్తున్నారు.

Send a Comment

Your email address will not be published.