ఈ శతాబ్దపు మేటి చిత్రం

Mahanati-updates

మహానటి సినిమా పై ప్రేక్షకుల అంచనాలకు పూర్తిస్థాయిలో న్యాయం జరిగిందని సినిమా చూసిన ప్రతి ఒక్కరూ అంగీకరిస్తున్నారు. అందర్నీ మహానటి మెప్పించడం ఇందులో ప్రత్యేకత. తెలుగు సినిమా పరిశ్రమలో తిరుగులేని నటి సావిత్రి. దక్షిణాదిలో తొలి సూపర్‌స్టార్ హోదా దక్కించుకొన్న మహానటి. అలాంటి మహోన్నతమైన నటిగా పేరు ప్రఖ్యాతులు సంపాదించుకొని తెలుగు ప్రేక్షకుల గుండెల్లో గూడుకట్టుకొన్న అతికొద్ది మంది హీరోయిన్లలో సావిత్రి ఒకరు. అలాంటి నటి జీవిత కథ ఆధారంగా మహానటి పేరుతో దర్శకుడు నాగ అశ్విన్ చిత్రాన్ని తెరకెక్కించారు. సావిత్రి పాత్రలో యువ నటి కీర్తి సురేష్ నటించారు. సమంత, విజయ్ దేవరకొండ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం ఈ నెల 9న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఎన్నో అద్భుత సక్సెస్‌లను సొంతం చేసుకొన్న ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ వైజయంతి మూవీస్ రూపొందించిన ఈ చిత్రం ఆ బ్యానర్‌కు మరో ఘనవిజయాన్ని అందించినట్టే.

ఇదే ‘మహానటి’ కథ
విజయవాడలో అతి సామాన్య జీవితంలో పుట్టిన సావిత్రి (కీర్తి సురేష్) చిన్నతనంలో తండ్రిని పోగొట్టుకొంటుంది. పెదనాన్న కేవీ చౌదరీ (రాజేంద్రప్రసాద్) అండతో పెరిగి పెద్దవుతుంది. తన పెదనాన్న ప్రోత్సాహంతో తొలుత నాటక రంగం, ఆ తర్వాత సినీ రంగంలోకి ప్రవేశిస్తుంది. ఎంతగానో అభిమానించే హీరో అక్కినేని నాగేశ్వరరావు సరసన నటించే స్థాయికి హీరోయిన్‌గా ఎదుగుతుంది. సినీ పరిశ్రమలో ప్రవేశించిన తొలినాళ్లలో తనకు గాడ్ ఫాదర్‌గా మారిన జెమినీ గణేషన్‌ (దుల్కర్ సల్మాన్) దగ్గరవుతుంది. అప్పటికే వివాహితుడైన జెమిని ప్రేమలో పడటమే కాకుండా అతడిని సావిత్రి వివాహం కూడా చేసుకొంటుంది. పెళ్లి తర్వాత ఎలాంటి పరిస్థితులను సావిత్రి ఎదుర్కొన్నారు? భర్త జెమినీ గణేషన్‌తో విబేధాలు ఎందుకు వచ్చాయి? భర్తకు దూరమైన తర్వాత సావిత్రి వ్యక్తిగత, సినీ జీవితంలో చోటుచేసుకొన్న పరిస్థితులు ఏంటీ? కోమాలోకి వెళ్లిన తర్వాత ఆమె జీవితం గురించి ఎలా పరిశోధన చేశారు? చివరకు సావిత్రి జీవితం ఎలా ముగిసింది? మహానటి కథలో విజయ్ ఆంటోని (విజయ్ దేవరకొండ), మధురవాణి (సమంత) పాత్రల ప్రాధాన్యం ఏమిటనే విషయాలకు తెరమీద సమాధానమే మహానటి చిత్ర కథ.

విరామం వరకూ కథా విశ్లేషణ
మహానటి సావిత్రి దిక్కులేని విధంగా ఓ దవాఖానలో అనాథలా పడి ఉండే సన్నివేశంతో కథ ప్రారంభమవుతుంది. కోమాలోకి చేరుకొన్న సావిత్రి కథతో మొదటి సీన్‌లోనే ప్రేక్షకుడిని భావోద్వేగానికి గురిచేయడంలో దర్శకుడు తన ప్రతిభను చాటుకొన్నాడు. ఎంతో ఉన్నత శిఖరాలను అధిరోహించిన సావిత్రి అలాంటి దుర్భర జీవితాన్ని అనుభవించడానికి దారి తీసిన పరిస్థితులను తెలుసుకోవడానికి జర్నలిస్టు మధురవాణి, ఫొటోగ్రాఫర్ విజయ్ అంటోని పరిశోధనతో సినిమా ఫ్లాష్‌‌బ్యాక్‌కు వెళ్తుంది. సావిత్రి బాల్యం, ఆ తర్వాత సినీ రంగంలో ప్రవేశించిన తీరు, జెమినీ గణేషన్‌తో ప్రేమ, పెళ్లి అంశాలతో చిత్ర మొదటి భాగం ఆసక్తిగా సాగుతుంది.

విరామం తర్వాత కథా విశ్లేషణ
మహానటి సినిమా రెండో భాగం ప్రేక్షకుడిని ఉత్కంఠకు గురిచేసిందనడంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు. జెమినీ గణేషన్‌తో వైవాహిక జీవితం, విబేధాలు లాంటి అంశాలు చకచకగా సాగిపోతాయి. ప్రీ క్లైమాక్స్ ముందు నుంచి సావిత్రి జీవితం క్రమంగా ఎలా క్షీణించిందనే విషయాన్ని గొప్ప విజన్‌తో దర్శకుడు తెరకెక్కించారని చెప్పవచ్చు. సావిత్రి జీవిత చరమాంకంలో విషాదాన్ని ప్రేక్షకుడికి చూపించే ప్రయత్నం చేయలేదని స్పష్టంగా కనిపిస్తుంది. 18 నెలలపాటు కోమాలో ఉన్న తర్వాత సావిత్రి జీవితం సంపూర్ణమవుతుంది. అయితే మధురవాణి క్యారెక్టర్‌తో గొప్పగా డైలాగ్స్ చెప్పించి ప్రేక్షకుడిని భావోద్వేగంలో కట్టిపడేయడం దర్శకుడు నాగ ఆశ్విన్ టేకింగ్ సినిమాను మరోస్థాయికి చేర్చింది.

దర్శకుడు నాగ అశ్విన్ ప్రతిభ
సావిత్రి సినీ జీవితం వెనుకటి తరాలకు తెలిసిందే. నేటి తరం ప్రేక్షకులకు సావిత్రి ఓ నటిగానే పరిచయం. అలాంటి గొప్ప నటి తెర వెనుక జీవితం గురించి ఎన్నో సందేహాలు రేకెత్తడం సహజం. కీర్తి ప్రతిష్టలు, సంపదతోనే జీవితాన్ని సంపూర్ణంగా అనుభవించిన నటి ఒక్కసారిగా కింద పడిపోవడమనే సావిత్రి జీవితంలోని ఆసక్తికరమైన అంశం. అలాంటి కథను శోధించి, పరిశోధించిన దర్శకుడు నాగ అశ్విన్ గొప్ప సంకల్పం మహానటిగా మలిచింది. బయోపిక్‌లో సవాల్‌గా మారే పాత్రల చిత్రీకరణ, నటీనటుల ఎంపికను దర్శకుడు అద్బుతంగా పూర్తి చేసి తనేంటో చెప్పకనే చెప్పాడు. 60 నుంచి 80 దశకాల వరకు ఉంటే వాతావరణాన్ని ప్రతిబింబింప చేయడంలో నాగ అశ్విన్ గొప్పగా ఆకట్టుకొన్నారు. అందం, అభినయం, విషాదం కలబోసిన ఓ మహానటి జీవితాన్ని తెరకెక్కించిన ఆయనకు సలాం కొట్టాల్సిందే.

అభినవ సావిత్రి ‘కీర్తి సురేష్’
ఏ మొండితనంతో సినీ జీవితంలో అత్యున్నత శిఖరాన్ని అధిరోహించడం, అదే మొండితనంతో అధోపాతాళానికి దిగజారిన సావిత్రి క్యారెక్టర్‌లో కీర్తీ సురేష్ అద్భుతంగా జీవించింది. సావిత్రి తెరపైన నటిస్తుందా అనే ఫీలింగ్‌ను కల్పించడంలో ఆమె తన వంతు పాత్రను నూరుశాతం నెరవేర్చారు. అభినయంతో సావిత్రిలా ప్రేక్షకుడిని మైమరిపించింది. ఉద్వేగానికి గురిచేసింది. కంటతడి పెట్టించింది. సావిత్రి పాత్రలో మరొకరిని ఊహించుకోలేని విధంగా నటనతో ఆకట్టుకొన్నది. సావిత్రి బయోపిక్‌లో కీర్తి సురేష్ పాత్రకు ఎంత ప్రాధాన్యం ఉందో.. జెమినీ గణేషన్‌గా దుల్కర్ సల్మాన్ రోల్‌కు అంతే ఇంపార్టెన్స్ ఉంది. ఈ చిత్రానికి దుల్కర్ తన నటనతో ప్రాణం పోశారు. కీర్తి సురేష్‌తో పోటీ పడి నటించారు. తన ఫెర్ఫార్మెన్స్‌తో మహానటిని మరోస్థాయికి తీసుకెళ్లారు.

పోటీ పడి నటించిన విజయ్ దేవరకొండ, సమంతలు
కీర్తి సురేష్ తర్వాత ఆకట్టుకొన్న పాత్రలు సమంత, విజయ్ దేవరకొండ. ఆటలో అరటిపండులా ఉండే సమంత, విజయ్ దేవరకొండ పాత్రలు సీరియస్‌గా సాగే కథ వేగానికి కళ్లెం వేసినట్టు అనిపిస్తుంది. అయినప్పటికీ వ్యక్తిగతంగా సమంత, విజయ్ పాత్రలు, వారి లవ్ స్టోరి ఆకట్టుకొన్నది. వారి లవ్ ట్రాక్‌లో కొన్ని సీన్లు ఎమోషనల్‌గా ఉంటాయి. సమంత లూనా స్టార్ చేసే సీన్, చర్చిలో ఎంగేజ్ మెంట్ సీన్, కారు ఎక్కి విజయ్ ప్రపోజ్ చేసే సన్నివేశాలలో వారి నటన సినిమాను మరోస్థాయికి చేర్చింది. సమంత, విజయ్ దేవరకొండ పాత్రలు సినిమాకు వెన్నెముకగా నిలిచాయి.

మిగతా పాత్రల్లో
మహానటి చిత్రంలో అద్భుతంగా మలిచిన పాత్రలో రాజేంద్ర ప్రసాద్, మోహన్‌బాబు, ప్రకాశ్ రాజ్ పాత్రలు ప్రేక్షకుడిని బాగా ఆకట్టుకొంటాయి. సావిత్రి పెదనాన్న పాత్రలో కేవీ చౌదరీగా రాజేంద్ర ప్రసాద్, ఎస్వీ రంగారావుగా మోహన్‌బాబు, నిర్మాత చక్రపాణిగా ప్రకాశ్ రాజ్ తమ నటనతో సినిమాకు జీవం పోశారు. ఎల్వీ ప్రసాద్‌గా అవసరాల శ్రీనివాస్, సింగీతం శ్రీనివాసరావుగా తరుణ్ భాస్కర్ తమ పాత్రలతో అలరించారు. అక్కినేని నాగేశ్వరరావు పాత్రలో నాగచైతన్య మెరిసారు. సినిమాకు కీలకంగా మారిన సన్నివేశాల్లో ఏఎన్నాఆర్‌గా చైతూ హావభావాలతో ఆకట్టుకొన్నారు. పాత చిత్రాల్లో మేటి సినిమాలలో నాగచైతన్య తన తాత పాత్రలో కనిపించి మెప్పించాడు. ఒక సీన్‌లో నందమూరి తారక రామారావును గ్రాఫిక్‌లో చూపించారు.

ఉద్వేగ సంభాషణలు
మహానటి చిత్రానికి రచయిత బుర్రా సాయిమాధవ్ అందించిన మాటలు సినిమాకు జీవం పోశాయి. “గురుగారూ కట్ చెప్పమంటావా….” లాంటి డైలాగ్స్ ప్రేక్షకుడిని నవ్వించాయి. ప్రతిభ ఇంటి పట్టునే ఉండిపోతే ప్రపంచానికి పుట్టుగతులు ఉండవు అనే రచయిత ప్రతిభకు గీటురాయిగా నిలిచాయి. అలాగే మోహన్‌బాబు చేత ఇది కలికాలం. అన్నం పెట్టే చేతుల నుంచి ఉంగరాలు లాగేసుకొనే రోజులివి అంటూ చెప్పిన డైలాగ్స్ భావోద్వేగానికి గురిచేస్తాయి. సావిత్రి, జెమినీ గణేషన్ మధ్య వచ్చే డైలాగ్స్ ఎమోషనల్‌గా ఉంటాయి. సినీ గేయరచయిత పింగళి పాత్రలో కూడా సాయిమాధవ్ కనిపించడం విశేషం.

మిక్కి జే మేయర్ సంగీతం
మహానటి చిత్రానికి సంగీత దర్శకుడు మిక్కి జే మేయర్ మ్యూజిక్ అందించారు. కథలోని సన్నివేశాలకు అనుగుణంగా ఓల్డ్ ఫ్లేవర్‌తో పాటలను ఆసక్తికరంగా అందించారు. కీలక సన్నివేశాల్లో బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కొంత బలహీనంగా కనిపించింది. ఎమోషన్‌ను మరింత ఎలివేట్ చేయడానికి ఆస్కారం ఉన్నప్పటికి దానిపై సరిగా దృష్టిపెట్టలేదనే ఫీలింగ్ కలుగుతుంది.

డానీ సినిమాటోగ్రఫీ
సావిత్రి బయోపిక్‌కు డానీ సాంచేజ్ లోపేజ్ సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరించారు. 60 నుంచి 80 దశకాల్లోని వాతావరణాన్ని అద్బుతంగా తెరెకెక్కించారు. సావిత్రి బాల్యం సన్నివేశాలు ఆసక్తికరంగా తెరెకెక్కించారు. విజయ్ ఆంటోని, సమంత ట్రాక్‌ను వింటేజ్ టెక్నాలజీతో చిత్రీకరించి సినిమాను ఆహ్లాదకరంగా మలిచారు. ప్రతిష్టాత్మకంగా రూపొందిన మహానటి చిత్రానికి స్వప్నదత్, ప్రియాంక దత్‌ నిర్మాతలుగా వ్యవహరించారు. ఈ చిత్రం వైజయంతి మూవీస్, స్వప్న మూవీస్ బ్యానర్‌పై రూపొందింది. కథకు అవసరమైన విధంగా సెట్ల రూపకల్పనలోనూ, క్యాస్టూమ్స్ అందించిన తీరు వారి సినీ అభిరుచికి అద్ధం పట్టింది. ఖర్చుకు వెనుకాడకుండా ఓ ఛాలెంజ్‌గా తీసిన ఈ చిత్రంతో ప్రేక్షకుల గౌరవానికి వారు చేరువవుతారు.

చివరిగా…
భావితరం నటీనటులకు, ప్రేక్షకులకు మహానటి సావిత్రి జీవితం ఆదర్శప్రాయం అనడంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు. ఎందుకంటే చిన్న తప్పుతో జీవితం సరిదిద్దుకోలేని పరిస్థితులకు దారి తీస్తుందని చెప్పేది సావిత్రి జీవితం. ఈ చిత్రం పాతతరం వారిని మరోస్థాయి గత జీవితంలో వెళ్లడానికి, కొత్త తరం ప్రేక్షకులకు ఓ గొప్ప కథను తెలుసుకోవడానికి సావిత్రి బయోపిక్ ఉపయోగపడుతుంది. మల్టిప్లెక్స్ ప్రేక్షకులకు ఇది సంపూర్ణంగా నచ్చే చిత్రం. బీ, సీ సెంటర్లలో ప్రేక్షకుల అదరణ కూడా ఈ చిత్రానికి బాగానే అందుతోంది.

తెరముందు;
కీర్తి సురేష్, రాజేంద్ర ప్రసాద్, సమంత, విజయ్ దేవరకొండ, మాళవికా నాయర్, భానుప్రియ, శాలిని పాండే, దివ్యవాణి, శ్రీనివాస్ అవసరాల, దర్శకులు క్రిష్, తరుణ్ భాస్కర్, బుర్రా సాయిమాధవ్ తదితరులు

తెర వెనుకః
దర్శకత్వం: నాగ అశ్విన్, నిర్మాత: ప్రియాంక దత్, స్వప్న దత్, సంగీతం: మిక్కీ జె.మేయర్, మాటలు: బుర్రా సాయిమాధవ్, ప్రొడక్షన్ డిజైన్: శివం,
ఆర్ట్: అవినాష్, కాస్ట్యూమ్స్: గౌరాంగ్, అర్చన, స్టైలిస్ట్: ఇంద్రాక్షి, కెమెరా: డాని, ఆర్ట్: తోట తరణి, ఎడిటర్: కోటగిరి వెంకటేశ్వర్రావు

Send a Comment

Your email address will not be published.