గాయం...గానం

అడవిలో ఎన్నో ఎన్నెన్నో వెదురు చెట్లు ఉంటాయి.
కానీ వాటిలో కొన్ని మాత్రమే వేణువులు అవుతున్నాయి.

వేణువు ఓ మంత్ర దండం.

అది గాలిని ఇంపైన సంగీతంగా మార్చేస్తుంది. వినే హృదయాలను మైమరిపించి తాదాత్మ్యంలోకి తీసుకుపోతుంది. దానికున్న శక్తి అలాంటిది.
ఇంతకూ సంగీతం ఎక్కడుంది…? గాల్లోనా? వేణువులోనా..?

గాలిని ఓ బిందువు అనుకుందాం. వేణువు గర్భకోశం అనుకుందాం. సంగీతం పుట్టేందుకు ఈ రెండూ అంటే బిందువూ, గర్భకోశం అవసరం.
అదలా ఉండనిస్తే అన్ని వెదురు చెట్లూ ఎందుకు వేణువు కాలేకపోతున్నాయి? ఏ వెదురు చెట్టు రంధ్రాలు చేయించుకోవడానికి సిద్ధపడుతున్నాయో అవి వేణువులు అవుతున్నాయి. రంధ్రాలు వేయించుకోవడానికి సహకరించనవి వేణువు కాలేవు. అటువంటి చెట్లు ఒట్టి వెదురు చెట్లుగా ముద్ర వేయించుకుని అక్కడితో ఆగిపోతున్నాయి. ఆ వెదురు చెట్లు చూడటానికి అందంగా కనిపించవచ్చు. కానీ అది అడవి కాచిన వెన్నెల అవుతుందని వేరేగా చెప్పక్కర్లేదు.

రంధ్రాలు వేయించుకోవడానికి సిద్ధపడిన వెదురు కొమ్మలు గాయాలను సహిస్తూ సహకరించే తీరు గర్వించ  తగినదే. అవి అందాన్ని కోల్పోవచ్చు కానీ కమ్మనైన సంగీతాన్ని అందించేందుకు ముందుకొచ్చి మన ఆనందంతో మమేకమవుతుంది.

అన్ని వెదురు చెట్లకూ వేణువు అయ్యే అర్హత ఉంది. కానీ వాటిలో కొన్ని మాత్రమే పూర్వజన్మ ఫలితంలా వేణువులవుతాయి. గాయపడని వెదురు కొమ్మలు గాలిని లోపలికి తీసుకోకుండా వినసొంపైన నాదాన్ని ఇవ్వలేక మిన్నకుండిపోతాయి. మరోవైపు ఏ కొమ్మలైతే గాయాలను భరించి గాలితో సంగమించదానికి ద్వారాలు తెరుస్తాయో అవి తీయని రాగాన్ని వినిపిస్తాయి.

ఒక జెన్ కవి ఇలా అన్నాడు….
రంధ్రాలు లేని వేణువు
గానానికి
పనికిరాదని….

విన్నవే వింటుంటే ఎప్పుడో అప్పుడు విసుగు పుట్టడం ఖాయం. వినని పాటలను వినాలని మనసు పరితపిస్తుంది. నవ్యగీతాలను స్వాగతిస్తుంది. మనుషులూ వెదురు చెట్లగానే ఉన్నారు. వారిలో కొందరే వేణువులవుతున్నారు. గాయపడి ఆలపించేందుకు సహకరించేవారు కొందరైతే గాయాలు ఎవరు భరిస్తారనుకునే వాళ్ళు చీకటి గూళ్ళల్లో నివాసమున్నట్టే అనుకోవాలి. ఆ ఇళ్ళకు కిటికీలు లేనట్లే అనుకోవాలి. బాధలను తట్టుకునే వాళ్ళు వేణువై తీయనైన సంగీతాన్ని వినిపిస్తున్నారు. కానీ చాలా మంది హృదయ తలుపులను మూసే ఉంచుతున్నారు. అటువంటి వారు సంగీతాన్ని ఏ విధంగానూ ఆస్వాదించరని చెప్పడానికి ఆలోచించక్కరలేదు.

జీవన సంగీతం ఒక వరం. అందుకు పెట్టిపుట్టాలి.
జీవన సంగీతానికి తలుపులు తెరవని వారు మనసుకి సమాధి కట్టుకున్నట్లే అనుకోవాలి.

త్యాగరాజు అన్నాడిలా …

నాదలోలుడై బ్రహ్మానంద మందవే మనసా
స్వాదు ఫలప్రద సప్తస్వరరాగానిచాయ సహిత
హరిహరాత్మ భూసురపతి శరజన్మ గణేశాది
వరమౌనులుపాసించరే ధర త్యాగరాజు తెలియు…

ఓ మనసా, సప్త స్వరాల వల్ల ఏర్పడిన అనేక రాగాలతో కూడిన నాదంపైన ఎక్కువగా ఆసక్తి కల్గించుకుని బ్రహ్మానందాన్ని పొందాలన్నది త్యాగరాజు మాట. ఎందుకంటె అది రుచి అయిన ఫలాన్ని ఇస్తుందట. ఆత్మానందాన్నికలిగిస్తుందట. అలాగే మోక్షాన్నేఇస్తుందట.

కనుక మనం వేణువు కావడానికి సంసిద్ధమవుదాం ఏ మాత్రం ఆలస్యం చెయ్యకుండా. సరేనా.
– యామిజాల జగదీశ్

Send a Comment

Your email address will not be published.